Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అలా ఆ పుస్తక ప్రపంచంలోకి ఓరోజు… బాగానే కొంటున్నారు…

December 24, 2024 by M S R

.

మొన్న ఒకరోజు నేను, మా అబ్బాయి హైదరాబాద్ లో జాతీయ పుస్తక ప్రదర్శనకు వెళ్ళాము. ఇదివరకటితో పోలిస్తే ఇప్పుడు పుస్తకాలు కొనడం బాగా తగ్గించాను. కొన్నవి చదవకపోతే అలమరాల్లో కనిపించిన ప్రతిసారీ ఇబ్బందిగా ఉంటుంది.

నా దగ్గరి నుండి పుస్తకాలు తీసుకుని ఇవ్వడం మరచిపోయిన మిత్రులను అడిగి ఇక లాభం లేదనుకుని మళ్ళీ కొనదలుచుకున్న కొన్ని పుస్తకాలను ముందే అనుకుని లోపలికి వెళ్ళాను. రాసేప్పుడు రెఫెరెన్సుగా ఉపయోగపడే పుస్తకాలవి, దయచేసి వెనక్కు ఇవ్వండి- అన్నా కొందరికి పదేళ్ళుగా తీరుబడి దొరక్కపోవడం వల్ల… ఇప్పుడెవరన్నా పుస్తకాలు అడిగితే నిర్దయగా ఇవ్వనని చెబుతున్నాను…

Ads

చేతులు కాలాక అయినా ఆకులు పట్టుకోవాలి కాబట్టి! భర్తృహరి వాక్యపదీయం, కరుణశ్రీ ఉషశ్రీ, బిరుదురాజు రామరాజు తెలుగు జానపదగేయ సాహిత్యం, రాచమల్లు రామచంద్రా రెడ్డి అనువాద సమస్యలు, పోతన భాగవతోపన్యాసాలు… ఇలా ఎన్నో అనుకుని వెళితే కొన్నే దొరికాయి. అక్కడ తిరుగుతున్నప్పుడు రెండు దృశ్యాలు నన్ను కట్టిపడేశాయి.

సంస్కృత గ్రంథాలు అమ్మే చిన్న స్టాల్లో ఒక ముసలావిడ నా వెనుక నిలుచుని పుస్తకాలు చూస్తున్నారు. మేడం మీరేదో పుస్తకం కోసం వెతుకుతున్నట్లున్నారు? అన్నాను. “పాణిని అష్టాధ్యాయి” అన్నారు. ఇక్కడ లేదు మేడం. ఫలానా చోట “వేద భారతి” బుక్ స్టాల్లో ఇందాకే చూశాను. మళ్ళీ అంతదూరం మీరెందుకు వెళ్ళడం? నేను వెళ్ళి తీసుకురానా? అని అడిగాను.

నేను ఆ పుస్తకాల కోసమే వచ్చాను. నేనే వెళ్ళి కొనుక్కుంటాను అన్నారావిడ. ఆమె వయసు ఎనభై అని మాటల మధ్యలో ఆమే చెప్పారు. మీరేమి చేసేవారు? అని అడిగాను. నువ్వేమి చేస్తావ్? అని వెంటనే అడిగారు. చెప్పాను. తనేమి చేయలేదు.

స్కూల్ రోజులనుండి తెలుగు, సంస్కృతం, ఇంగ్లిష్ వ్యాకరణమంటే ఇష్టమట. ఈ వయసులో…? అన్నాను. చదువుతానో! లేదో! తరువాత సంగతి. నా మంచం ముందు అష్టాధ్యాయి రెండు పుస్తకాలు కనిపిస్తుంటే అదో తృప్తి అని నవ్వుతూ… మెల్లగా కర్ర సాయంతో నడచుకుంటూ వెళ్లిపోయారు.

అంతకుముందే ఆ రెండు పుస్తకాలు చేతికి తీసుకుని… ఈ మధ్య చదవడం తగ్గించాను కదా! అందునా ప్రపంచంలోనే అద్వితీయమైన వ్యాకరణ గ్రంథాలు… గురువు లేకుండా చదవలేనేమో! అని కొనకుండా వచ్చేశాను. నాకు ఆ పెద్దావిడ ఏదో కర్తవ్యబోధ చేసి వెళ్ళినట్లు అనిపించింది.

ఈమధ్య యువ రచయితలను ప్రోత్సహిస్తున్న ఒక పబ్లికేషన్స్ సంస్థ స్టాల్ దగ్గర మరో దృశ్యం. నేనేదో తెలుగు నవల పుస్తకం చేతికి తీసుకుని పేజీలు తిప్పుతుంటే…”these ten books are written by 25 to 30 years age group writers. These are bound to be best Telugu classics in next 50 years. Best sellers” అన్న స్టాల్ సేల్స్ పర్సన్ మార్కెటింగ్ మెళకువ నాకు నచ్చింది.

అతనలా ఆ తెలుగు పుస్తకాల సమాచారాన్ని ఇంగ్లిష్ లో ఎందుకు చెబుతున్నాడో అక్కడో పది నిముషాలు ఉండి… గమనిస్తే నాకు తెలిసింది. ఆ స్టాల్ కు వస్తున్నవారందరూ పాతికేళ్లలోపువారే. లోపల ఒక పాతికేళ్ల రచయిత్రి తన తెలుగు పుస్తకం కొన్న అభిమానులతో ఇంగ్లిష్ లో మాట్లాడుతూ ఇంగ్లిష్ సంతకం చేసి పుస్తకం వారిచేతిలో పెడుతూ… వారితో సెల్ఫీలు దిగుతోంది.

ఆధునిక తరానికి ఏమి కావాలో, ఎలా చెప్పాలో, కొత్త తరానికి ఏమి చెప్పి పుస్తకాలు కొనిపించాలో, ఏయే మార్గాల్లో అత్యధికంగా పుస్తకాలు అమ్ముకోవచ్చో అన్న విషయాలపై ఈ సంస్థకు స్పష్టమైన అవగాహన ఉన్నట్లుంది. మంచిదే. తెలుగులో కొత్త రచయితలను, కొత్త పాఠకులను పుట్టించిన ఈ సంస్థ- “అన్వీక్షకి”. తెలుగు పుస్తకాల ముద్రణలో వారి వినూత్న ఆలోచనలు, మార్కెటింగ్ ప్రతిభ అభినందించదగ్గవి.

స్టాల్ దాటి బయటికొచ్చాక… ముప్పయ్ లోపు వయసు వారికి, ప్రత్యేకించి చదవడం అలవాటున్న కొత్తతరం పిల్లలను ఎంగేజ్ చేసేలా తెలుగులో రాయలేకపోతున్నారు నాన్నా. వీళ్ళు ఆ పాయింట్ ను బాగా పట్టుకున్నారు. ట్రెండీగా జెన్ జెడ్ (1995-2010 మధ్య పుట్టిన తరానికి పేరు) భాష, పరిభాషతో కొత్త రచయితలతో రాయిస్తున్నారు. సక్సస్ అయ్యారు-అన్నాడు మా అబ్బాయి.

వాడు ఎక్కువగా ఇంగ్లిష్ లో సైన్స్ ఫిక్షన్; తెలుగులో కవిత్వం, చారిత్రక నవలలు చదువుతుంటాడు. ఇంగ్లిష్ వాటిలా తెలుగులోకూడా కట్టిపడేసే విషయం, అంతకు మించి ఆగకుండా చదివించే శైలి ఉండాలన్నాడు. ఆ సమయానికి తెలుగు అకాడెమీ “తెలుగు వచన శైలి” పుస్తకం ఉంది నా చేతిలో!

అన్వీక్షకి స్టాల్ ముందు పాతికేళ్లలోపు వయసున్న అమ్మాయిల గుంపు. అందరూ తెలుగు పుస్తకాల గురించి ఇంగ్లిష్ లో అనర్గళంగా మాట్లాడుకుంటున్నారు. ఆధునిక తెలుగు నవలలు, కథలు, తెలుగు వచనశైలి, తెలుగు రచయితల గురించి అలా ఇంగ్లిష్ లో మాట్లాడుకోవడం నాకు తప్పనిపించలేదు. ఇంగ్లిష్, తెలుగు రెండు భాషలూ తెలియడం ఈరోజుల్లో అవసరం.

ఇంగ్లిష్ మీడియం దెబ్బకు మాకు తెలుగు రాయడం, చదవడమే రాదని గర్వంగా చెప్పుకునే అత్యాధునికులైన తెలుగువారితే పోలిస్తే వీరు తెలుగు పుస్తకాలు చదివి వాటి బాగోగుల గురించి సమీక్ష స్థాయిలో ఇంగ్లిష్ లో మాట్లాడుకోవడాన్ని తప్పుపట్టాల్సిన పనేలేదు.

లోకాభిరామాయణంగా అన్ని విషయాలమీద వారు గలగలా మాట్లాడుకుంటున్నారు. తెలుగు పాటల్లో సాహిత్య విలువలు పడిపోవడం, ద్వంద్వార్థాలు, బూతులు రాయడాన్ని సమర్థించుకుంటూ ఒక గేయరచయిత అన్న – “ఇప్పుడు మీరు బూతన్నవే యాభై ఏళ్ల తరువాత పోతన పద్యాల్లా పరమ పవిత్రమైనవిగా పాడుకుంటారు” అని మిమిక్రీ చేసి వినిపించింది ఒకమ్మాయి. అందరూ గొల్లున నవ్వుకున్నారు. కొత్తతరం అన్నిటినీ ఎంత సునిశితంగా గమనిస్తోందో తెలిసి నవ్వుకుంటూ నేను మరో స్టాల్లోకి వెళ్ళాను.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • గ్రోక్ కూడా చేతులెత్తేసిన భాష… ఇక ఆక్స్‌ఫర్డ్ టీమ్‌కే సాధ్యమేమో…
  • ఏమైంది అసలు..? చేజేతులా ట్రోలర్లకు చిక్కుతున్న కొండా సురేఖ..!!
  • అడుగుకో పాక్ గూఢచారి… వీళ్ల ఏరివేతే యుద్ధంకన్నా ప్రధానం..,
  • అనవసరంగా వైసీపీ సోషల్ బ్యాచ్‌ను గోకిన భైరవం దర్శకుడు…
  • అత్యంత అసాధారణ కరెంటు బిల్లు… నమ్మడమే కష్టం సుమీ….
  • సొంత ‘బతుకమ్మ’ పేర్చుకుని… తన ఆట తాను ఆడుకోవడమేనా..?
  • ఫక్తు అక్కినేని మార్క్ వన్ ప్లస్ టూ రొటీన్ సినిమా ప్రేమ కథ..!!
  • ఆ సిరివెన్నెల పాటలు… రాసిన అర్థాలు వేరు- వాడుకున్న తీరు వేరు…
  • శరణార్థుల ఆశాసూచిక – భారత రాజ్యాంగంలోని కుబేరుని కళాచిత్రం…
  • కశ్మీర్‌లో యూఎన్ ధర్మసత్రం షట్‌డౌన్… శెభాష్ జైశంకర్… ఇదీ టెంపర్‌మెంట్..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions