ప్రతి ఏటా కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ… మందు ప్రేమికులు మద్యం తాగుతూనే ఉంటారు… ఈసారి కరోనా భయం లేదు కాబట్టి చిన్న చిన్న గెట్‌టుగెదర్స్ జరిగాయి… అయితే ఆంధ్రా ప్రజలు 142 కోట్లు తాగేశారు… తెలంగాణలో ఏకంగా 215 కోట్లు తాగేశారు… అని ఎడాపెడా పత్రికలు రాసిపారేశాయి… నిజానికి తాగడం కాదు వార్త… ఆ ఒక్కరోజు డిపోల నుంచి తీసుకొచ్చిన మద్యం విలువను రాశారు గానీ అంతకుముందే ఉన్న స్టాక్స్ విలువ మాటేమిటి..? పైగా తెలంగాణలో రెండుసార్లు ధరలు పెంచినా సరే కేవలం 215 కోట్లు మాత్రమే తాగారు అంటే, గత ఏడాదికన్నా తక్కువ తాగినట్టే కదా…
సో, ఆ లెక్కలు వదిలేస్తే… దేశంలోని ఏ నగరం తాగినా సరే, బాధ్యతగా వ్యవహరించింది అనేది వార్త… ఊగుతూనే, తూలుతూనే ఇంటికెళ్లడం పెద్ద టాస్క్ ఈరోజుల్లో… రాత్రంతా పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు పెట్టేసి, కేసులు బుక్ చేశారు కదా…! జరిమానాలు, కేసులు, చాలాన్లు, డ్రైవింగ్ లైసెన్సుల రద్దు, వాహనాల జప్తు అంటూ ఎంత భయం పెట్టినా సరే, ఈ విషయంలో హైదరాబాద్ ఓ చెత్తా రికార్డును మూటగట్టుకుంది… సిటీలో 1413 డ్రంకెన్ డ్రైవ్ కేసుల్ని ట్రాఫిక్ పోలీసులు బుక్ చేశారు… మొత్తం కేసులు 10337 అయినా సరే, హెల్మెట్లు లేకపోవడం, ట్రిపుల్ రైడింగ్ గట్రా తీసేస్తే సూకా 1413 కేసులు తాగి, ఒళ్లు మరిచిన కేసులే… రవాణా శాఖ కూడా తనిఖీలు చేసి ఏకంగా 5819 మంది డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేసింది… ఈ సంఖ్య గత ఏడాది కేవలం 3220 మాత్రమే…
ఈ విషయంలో బెంగుళూరు ఈసారి అందరినీ ఆశ్చర్యపరిచింది… అదీ మెట్రో కల్చర్ ఉన్న సిటీయే… ఐటీ సిటీయే… తాగడం పెద్ద విషయమే కాదు సిటీలో… గత ఏడాదితో పోలిస్తే ఆరవ వంతు, అంటే కేవలం 77 కేసులు బుక్కయ్యాయి… సిటీ పోలీసులు హేపీ… ఈసారి బెంగుళూరు జనాన్ని మెచ్చుకోవాలి… కేవలం 77 కేసులే… బాధ్యతగా వ్యవహరించారు అని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ అనుచేత్ ఏకంగా ట్వీట్ కొట్టాడు ఆనందంగా… పార్టీలు జరగలేదా..? జరిగాయి… కానీ మెట్రో, బీఎంటీసీ బస్సులు, ఆటోలను ఆశ్రయించారు అధికంగా… హైదరాబాద్‌లో కూడా మెట్రో టైం పొడిగించినా సరే జనం సొంత వాహనాల్లోనే ఇళ్లకు వెళ్తూ దొరికిపోయారు…
Ads
ఢిల్లీలో 318 కేసులు బుక్కయ్యాయి… గత ఏడాదితో పోలిస్తే 12 రెట్లు ఎక్కువ… నిజానికి ఢిల్లీలో డ్రంకెన్ డ్రైవ్ చెక్స్ తక్కువ, చలాన్లు తక్కువ… ఈసారి ఎందుకో తేడా కొట్టేసింది… అంత పెద్ద ముంబైలో కూడా నమోదైన డ్రంకెన్ డ్రైవ్ కేసుల సంఖ్య కేవలం 156 మాత్రమే… ఒక్కసారి పోల్చి చూడండి, హైదరాబాద్ సిటిజనం ఎంత కేర్‌లెస్‌గా వ్యవహరించారో..!!
Share this Article