.
హైదరాబాద్ మెట్రో అప్పుల కుప్పగా తయారయ్యింది. భారత దేశంలో మిగతా మెట్రోలన్నీ ప్రభుత్వాలే నిర్వహిస్తుండగా పబ్లిక్, ప్రయివేట్ పార్ట్ నర్ షిప్- పిపిపి మోడల్లో నడుస్తున్నది హైదరాబాద్ మెట్రో ఒకటే.
ఏటేటా పేరుకుపోతున్న నష్టాల దెబ్బకు మెట్రోను వీలైనంత త్వరగా ప్రభుత్వానికి అప్పగించి నిర్వహణ నుండి పూర్తిగా పక్కకు తప్పుకోవాలని ఎల్ అండ్ టీ అనుకుంటోంది. నగరం నలుదిశలా రీజనల్ రింగ్ రోడ్డు దాకా మెట్రోను విస్తరించడానికి ప్రభుత్వం ఫ్యూచర్ కలలు కంటున్నవేళ… ఎల్అండ్‌టీకి ఇప్పుడున్న 69 కిలో మీటర్ల మెట్రో నిర్వహణకు ఇన్నేళ్ళలో తగిలిన దెబ్బ విలువ అక్షరాలా పదమూడు వేల కోట్ల రూపాయలు.
Ads
కాకి లెక్కగా అంచనా వేసినా… ఇది మెట్రో పెట్టుబడికి మించే ఉంటుంది. ఇందులో నిర్వహణపరమైన నష్టాలే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలనుండి రావాల్సిన బకాయిలు, వయబిలిటీ గ్యాప్ ఫండ్ లాంటివి అంతర్గతంగా చాలా ఉంటాయి. ఆ లెక్కల చిక్కు ముళ్ళు ఇక్కడ అనవసరం…
కోటికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్ మహానగరంలో రోజుకు నాలుగు లక్షలమందికి పైగా ప్రయాణికులు మెట్రోను ఉపయోగించుకుంటూ ఉండడం నిజానికి మంచిది. దాదాపు పది లక్షల మంది నిత్యం మెట్రోను వాడితే… కొన్ని లక్షల వ్యక్తిగత వాహనాలు రోడ్లమీదికి రావాల్సిన అవసరమే ఉండదు. ట్రాఫిక్ జామ్ లు తగ్గుతాయి.
పార్కింగ్ సమస్యలు తగ్గుతాయి. వాహన కాలుష్యం తగ్గుతుంది. లక్షలమందికి రోజుకు రెండు గంటల సమయం కలిసొస్తుంది. మహానగరాల్లో పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఎంత పెరిగితే అంతగా సమస్యలు తగ్గుతాయి. ప్రపంచవ్యాప్తంగా మహానగరాల్లో దశాబ్దాలుగా అనుభవసారమిది.
వందేళ్ళకు పైబడి ఉన్న లండన్ ట్యూబ్ (భూగర్భ పబ్లిక్ మెట్రో రైల్) ఆగిపోతే లండన్ ఊపిరి ఆగిపోతుంది. చిన్నా పెద్దా, ఉన్నవారు లేనివారు అందరూ ట్యూబ్ ను తప్పనిసరిగా వాడతారు. భారతీయ సమాజంలో ఎంత సంపన్నులైతే అంత పెద్ద సొంత కారులోనే తిరగాలి కాబట్టి… పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వాడడం చాలామందికి నామోషి. చేతికి అందేంత దూరంలో ఇల్లు ఉన్నా రెండు గంటలు ట్రాఫిక్ లో ఇరుక్కుని కారులో ఇల్లు చేరడమే హోదా. మర్యాద. సంపదకు చిహ్నం.
ఓఆర్ఆర్ వెంట మెట్రోను విస్తరించడం;
ఆర్ఆర్ఆర్ దాకా మెట్రో పిల్లర్లను మొలిపించడం;
ఫ్యూచర్ సిటీలోకి మెట్రో పరుగులు తీయడం;
మరో అర్ధశతాబ్దానికి సరిపడేలా మెట్రోను శాఖోపశాఖలుగా విస్తరించడం లాంటి ప్రభుత్వ ప్రకటనలకు ఎల్ అండ్ టీ మెట్రో లెక్కలకు పొత్తు కుదరడం లేదు.
ఎల్ అండ్ టీ లక్షల కోట్ల వ్యాపారంలో ఈ మెట్రో పదమూడు వేల కోట్ల నష్టం ఆవగింజంతే కావచ్చు. ఐదేళ్లకో, పదేళ్ళకో పెట్టిన పెట్టుబడికి రెండు మూడింతల రాబడి రాకపోతే మెట్రో అప్పుల భారాన్ని ఇలాగే మోస్తూ ఉండడానికి అదేమీ లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థ కాదు.
ఇన్నేళ్ళుగా లేనిది ఇప్పుడే పక్కకు తప్పుకోవడం గురించి ఎల్ అండ్ టీ ఎందుకు ఆలోచిస్తున్నది అన్నదే చర్చించాల్సిన విషయం. ఇప్పుడున్న మూడు కారిడార్లకు కొనసాగింపు; కొత్త రూట్లు అని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనల దెబ్బకు ఎల్ అండ్ టీ వెన్నులో వణుకు మొదలైనట్లుంది. ఉన్నదానితోనే ఇన్ని వేల కోట్ల నష్టాలైతే కొత్త మెట్రో ప్రతిపాదనలు తోడై పట్టాలెక్కితే… ఆ నష్టం సున్నాలు లెక్కపెట్టడానికి ఎల్ అండ్ టీ దగ్గరున్న మెగా సర్వర్ లకు కూడా సాధ్యం కాదని క్లారిటీ వచ్చినట్లుంది.
ఇంటికెళ్ళి ఇరవై నాలుగుగంటలూ భార్య మొహం చూస్తూ కూర్చుంటారా? రోజుకు రెండు గంటలు అఫీస్ లో ఓవర్ టైమ్ పని చేయలేరా? అన్నది సాక్షాత్తు ఈ ఎల్ అండ్ టీ అధిపతే. ఎల్ అండ్ టీ స్వరూప స్వభావానికి, నిర్వహణ విధానానికి అదొక మచ్చు తునక!
భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మెట్రోతో పాటు ఇతర పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వ్యవస్థలను విస్తరించడం, బలోపేతం చేయాలన్న ప్రభుత్వ సంకల్పం సరైనదే. కానీ ఇతర మహానగరాల్లో ప్రభుత్వమే నడిపే మెట్రోలు ఎలా ఉన్నాయి? హైదరాబాద్ మెట్రో నష్టానికి ఎవరు కారణం? ఎల్ అండ్ టీ పక్కకు తప్పుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇలాగే నిర్వహించగలదా? ఎల్ అండ్ టీ కాకుంటే ప్రత్యామ్నాయాలేమిటి? అన్న విషయాలమీద ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు లేదు.
వాస్తవానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అహోబల మఠంలానే ఉంది. ఈనేపథ్యంలో ఎల్ అండ్ టీ కి భవిష్యత్ మెట్రో నష్టాల ముఖ చిత్రం పట్టాలమీద పట్టుదప్పినట్లు స్పష్టంగా కనిపించి… గుండెల్లో నిజంగానే మెట్రో రైళ్ళు పరుగెట్టి ఉంటాయి.
ఇంతకూ హైదరాబాద్ మెట్రో భవిష్యత్ ఏమవుతుందబ్బా?
ఇది సచివాలయ రాజసౌధం ముందు చెక్కపెట్టెలో దాగిన రా చిలుకను ఇనుప చువ్వల చిట్టి తలుపు తీసి… బయటికి పిలిచి… అడగాల్సిన చిలుక జోస్యం ప్రశ్న!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article