ఒకే రోజు పత్రికల్లో రెండు వార్తలు. రెండూ పోలీసు చిరు ఉద్యోగులకు సంబంధించినవి.
మొదటిది:- ఆత్మహత్య చేసుకోబోయి…పురుగులమందు తాగిన వ్యక్తిని…హుటాహుటిన రెండు కిలో మీటర్లు భుజాన మోసి…పరుగెత్తి ఆసుపత్రిలో చేర్చి…అతడి ప్రాణాన్ని కాపాడిన కానిస్టేబుల్.
రెండోది:- తాగుడుకు బానిసైన వ్యక్తి 90 ఎం ఎల్ ఇస్తే కానీ…బయటకు రాను అని హుసేన్ సాగర్ నీళ్లల్లో దిగి మొండికేస్తే…కాపాడిన కానిస్టేబుల్.
Ads
తప్ప తాగి…రాంగ్ రూట్లో వచ్చి…అడ్డుకున్న హోం గార్డ్ బట్టలు చించి…చిందులు తొక్కిన వనిత; సొంత హోటల్లో డ్రగ్స్ పార్టీలు చేసుకునే సంపన్నుడు లాంటి వార్తలు మీడియాలో మొదటి పేజీ ప్రాధాన్యం వల్ల మన దృష్టిని బాగా ఆకర్షిస్తాయి. పద్ధతిగా కారు నడపడం కంటే ఆ అమ్మాయిలా తప్ప తాగి రాంగ్ రూట్లో ఒక్కసారైనా హోం గార్డ్ బట్టలు చించలేకపోయామే అని, మనక్కూడా సొంతంగా ఒక ఫైవ్ స్టార్ హోటల్ ఉండి ఉంటే రోజూ అతడిలా “తెల్ల పొడి” పార్టీలు చేసుకుని ఉండి ఉండేవాళ్లం కదా అని బాధపడేలా ఆ వార్తలు, వాటి ఫాలో అప్ వార్తలు మన వెంటపడతాయి.
ఈ రెండు వార్తలు అలాంటివి కావు కాబట్టి లోపలెక్కడో జోనల్ పేజీలో…నరమానవుడి కంటికి కనపడకుండా ఉన్నాయి. “కుక్క మనిషిని కరిస్తే వార్త కాదు. మనిషే కుక్కను కరిస్తే వార్త” అన్న మీడియా పరమ ప్రామాణికమైన శునకాదర్శం వల్ల ఎన్నో కుక్కలు మనిషి కాట్లకు గురై…మీడియా నిండా మనిషి కాట్ల వార్తలే ఉంటున్నాయి. ఆ కోణంలో చూసినప్పుడు కరీంనగర్ జిల్లా వీణవంకలో కానిస్టేబుల్ జయపాల్ కాపాడిన ఒక ప్రాణం చాలా చిన్న సింగిల్ కాలం వార్తే కావాలి. అలాగే అయ్యింది కూడా.
ఈరోజుల్లో బతకాలంటే కష్టం కానీ…చావడానికి సవాలక్ష కారణాలు. అలా భేతిగల్ గ్రామానికి చెందిన కుర్ర సురేష్ ఇంట్లో గొడవపడ్డాడు. మనసు విరిగింది. పురుగుల మందు డబ్బా తీసుకుని…పొలానికి వెళ్లి…ఆత్మహత్య చేసుకోవడానికి మందు నోట్లో పోసుకున్నాడు. అదేమి విడ్డూరమో కానీ ఏ పురుగుల మందూ పొలంలో చీడను చంపలేదు కానీ…గుక్కెడు తాగిన రైతును మాత్రం వెంటనే చంపేస్తుంది. నోట్లో నురగలు కక్కుకుంటూ సురేష్ స్పృహదప్పి పడిపోయాడు. పక్క పొలంలో పనిచేసుకుంటున్నవారు చూసి…పోలీస్ 100 కు ఫోన్ చేశారు. కానిస్టేబుల్ జయపాల్, హోంగార్డ్ కిన్నెర సంపత్ వచ్చారు. పొలాల్లోకి అంబులెన్స్ కాదు కదా టూ వీలర్ కూడా వచ్చే అవకాశం లేదు. అపస్మారక స్థితిలో ఉన్న సురేష్ ను కానిస్టేబుల్ జయపాల్ భుజాన పెట్టుకుని రోడ్డు వైపు రెండు కిలో మీటర్లు పరుగులు తీశాడు. జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి సకాలంలో చేరడంతో సురేష్ ప్రాణం దక్కింది. జయపాల్ ను ఊరి జనం అభినందించారు.
తాగే వ్యసనపరులకు వేళకు మందు దొరకకపోతే అది భూకంపం కంటే, సునామీ కంటే పెద్ద ప్రళయం. తాగుతున్నప్పుడు 90 ఎం ఎల్ తక్కువ పడితే అది మహాప్రళయం కంటే ప్రమాదకర సందర్భం అవుతుంది. అలా ఒకానొక తాగుబోతు ఒకానొక సాయం సంధ్యావేళ…పక్షులు గూళ్లకు చేరేవేళ…చక్కటి హుసేన్ సాగర్ తీరంలో…చల్లగాలులు మెల్లగా వీస్తుండగా తాగడం మొదలు పెట్టాడు. చుక్క చుక్క ద్రవం చల్లగా గొంతులో దిగుతోంది. వెచ్చ వెచ్చగా మత్తు గాల్లోకి తేలుస్తోంది. దయ్యాలు నిద్ర లేచి నర్తించే అర్ధరాత్రి వేళయ్యింది. ఈలోపు తెచ్చుకున్న బాటిళ్లు అయిపోయాయి. చుట్టూ చీకటి. జనసంచారం లేదు. చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. ఆకాశంలో చుక్కలు పొడిచినవేళ లిక్కర్ చుక్కలు ఎక్కడ దొరుకుతాయో కూడా తెలియదు. అంతటి మత్తులో కూడా అతడికి మరో 90 ఎం ఎల్ అవసరమన్న స్పృహ మాత్రం ఉంది. డోస్ మీద ఉన్న అవగాహనతో…90 ఎం ఎల్ సాధించే మార్గంగా హుసేన్ సాగర్ నీళ్లలోకి వెళ్లి డోస్…డోస్…అని గట్టిగా అరవడం మొదలు పెట్టాడు. అల వైకుంఠపురంబులో, ఆ మూల సౌధంబులో మందార వనాంతరాలలో ఉయ్యాలలో ఊగుతున్న స్వామి చెవిన గజేంద్రుడి మొర వినపడగానే సిరికిన్ చెప్పక…శంఖు చక్ర యుగముకు చెప్పక వడివడిగా బయలుదేరిన శ్రీమన్నారాయణుడిలా…90 ఎం ఎల్ ద్రవార్థిని కాపాడడానికి పోలీసు వాహనాలు, ఫైర్ ఇంజన్లు, పెద్ద పెద్ద తాళ్లు, టార్చ్ లైట్లు ఎన్నెన్నో వచ్చాయి.
ఒరేయ్ నీ 90 ఎం ఎల్ మా చావుకొచ్చిందిరా! ముందు ఈ తాడు పట్టుకుని బయటికి రారా! అని యావత్ రక్షక వ్యవస్థలు ప్రాధేయపడ్డాయి. నీళ్ళల్లోనే ఉంటాను…తక్కువ పడ్డ 90 ఎం ఎల్ పోస్తేనే వస్తాను…లేకుంటే చస్తాను అని వాడు…ఇలా మూడు గంటలు హైడ్ అండ్ సీక్ ఆట సాగింది. చివరకెలాగో వాడి దాకా పోలీసులే తాళ్ల సాయంతో వెళ్లి బయటకు లాగి…మత్తు దిగాక భద్రంగా ఇంటికి చేర్చారు.
ఈ వార్తకు పెద్దగా ప్రాచుర్యం కలగకపోవడమే మంచిదయ్యింది. లేకపోతే ప్రతి ఊళ్ళో చెరువులోకి దిగి…అందరూ ఇలాగే తక్కువ పడ్డ 90 ఎం ఎల్ అడుగుతుంటే ఎన్ని పోలీసు రెస్క్యూ వాహనాలు, ఎన్ని ఫైర్ ఇంజన్లు, ఎన్ని తాళ్లు, ఎన్ని టార్చ్ లైట్లు కావాలి?
రేప్పొద్దున-
మేటి మేడిగడ్డ ఓటి గడ్డ పగుళ్లు అతుక్కుని…
అన్నం పెట్టే అన్నారం కడుపు నీళ్లతో నింపుకుని…
కన్నీళ్లు తుడిచి సుందిళ్ల సుడులు తిరిగి…
ఎత్తిపోతలన్నీ తల ఎత్తుకుని నిజంగానే కాళేశ్వరాల గోదావరులన్నీ చెరువుల రాదారులు పట్టి నిండితే…
ప్రతి చెరువులో ఇలాగే 90 ఎం ఎల్ ద్రవ దాహార్తులు అర్ధరాత్రి పోలికేకలు వేస్తే…
బంజారా హిల్స్ నీలి పలకల ఆకాశహర్మ్య పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ తట్టుకోగలదా? తట్టుకుని నిలబడగలదా- పాపం!
“ఒకరాజును గెలిపించుటకై
ఒరిగిన నరకంఠాలెన్నో?”
అన్నాడు దాశరథి.
“ఒక ప్రాణాన్ని కాపాడడానికి
జరిగిన ప్రయత్నాలెన్నో?”
అని పోలీసులు కూడా దాశరథి గేయాన్ని మార్చి పాడుకోవాలి. -పమిడికాల్వ మధుసూదన్ 9989090018
Share this Article