Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మనం చెరువును చెరబట్టి… చెరువు గుండెను చెరిపిన కథ..!!

August 14, 2024 by M S R

భాగ్యనగరం చెరువుల
గుండె చెరువు

“అప్పిచ్చువాడు, వైద్యుడు,
ఎప్పుడు నెడతెగక పారు నేరును, ద్విజుడున్
చొప్పడిన యూరనుండుము;
చొప్పడకున్నట్టి యూర జొరకుము సుమతీ”

తెలుగు మీడియం మాత్రమే తెలిసిన అనాది కాలంలో ఒకటి, రెండో తరగతుల్లో తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన పద్యమిది. అప్పిచ్చువాడు తరువాత కామాను గుర్తించని లోకం వైద్యుడికి అది విశేషణ పూర్వపదకర్మధారయంగా అనుకుని వైద్యులంటే రోగులకు అప్పిచ్చేవారని అపార్థం చేసుకుంది. వేదాంత దృక్కోణంలో వైద్యులు అప్పు చేయించేవారే అవుతారు కానీ, అప్పిచ్చేవారు కాదు. అయినా మన గొడవ అప్పు గురించి కాదు. వరద ముప్పు గురించి. ఎప్పుడు ఎడతెగక పారే ఏటి గురించి. అలా పారే మూసీని మింగేసిన ఆక్రమణలతో మూసీ గుండె చెరువు కావడం గురించి. అంతకంటే ముఖ్యంగా మూసీ పుట్టు పూర్వోత్తరాల గురించి. మూసీని కన్న అనంతగిరి అందచందాల గురించి.

Ads

ఇప్పుడంటే చంద్రమండలం మీద కూడా గేటెడ్ కమ్యూనిటీల్లో విల్లాలు, భూమ్యాకర్షణ శక్తి లేకపోవడంవల్ల ఆకాశంలో తేలే అపార్ట్ మెంట్లు కొంటున్నారు కానీ- వేల ఏళ్లుగా ప్రపంచ నాగరికతలన్నీ నదీ తీరంవెంబడే పురుడు పోసుకుని పెరిగి పెద్దవయ్యాయి. భూగోళం మీద సాటిలేని మేటి నగరాలన్నీ సముద్ర తీరంలోనే ఉంటాయి. త్రేతాయుగ రామాయణంలో తమసా, సరయూ, గోమతి, గంగ, యమున, గోదావరి, పంపా నదులమీద పడవల్లోనే ప్రయాణం చేశారు. తిరుగులేని అయోధ్య సరయూ పక్కనే ఉంది. ఆటవిక తెగల రాజ్యం శృంగిబేరపురం గంగ ఒడ్డున ఉంది.

సుదీర్ఘమయిన చరిత్ర ఉండి, దక్కన్ పీఠభూమి కేంద్ర స్థానంలో ఉన్న భాగ్యనగరానికి సముద్రతీరం లేదని మరీ అంతగా బాధ పడాల్సిన పని లేదు. నిజాం రాజుల కాలంగా ఒక అయిదు వందల సంవత్సరాల చరిత్రనే హైదరాబాద్ కు ఆపాదించాం. వేల సంవత్సరాల క్రితం ముచుకుంద మహర్షి వికారాబాద్ దగ్గరి అనంతగిరి కొండల్లో తపస్సు చేశాడు. బలరామకృష్ణులమీద దాడి చేసిన కాలయవనుడు ఇక్కడే ముచుకుందుడి కోపాగ్నికి బూడిద అయిపోయాడు. ఆ ముచుకుందుడే నదిగా మారి కృష్ణుడి కాళ్లు కడిగి అనంతగిరి నుండి ప్రవహిస్తూ కృష్ణా నదిలో కలుస్తున్నాడు. ఇదే మూసీనది. చాలా పురాణ ప్రాశస్త్యం ఉన్నా ఎందుకో అనంతగిరికి విహారస్థలంగానే గుర్తింపు వచ్చింది. ముచుకుంద మహర్షి- అనంతగిరి అనుబంధాన్ని ప్రఖ్యాత పురాణ ప్రవచనకర్త మల్లాది చంద్రశేఖర శాస్త్రి అనేక పురాణాల సమన్వయంతో నిరూపించారు.

ఇప్పుడంటే నగరం మురికిని మింగడంవల్ల మూసీ మురికిదయ్యింది కానీ- ఒకప్పుడు మూసీ తెలంగాణ గంగ. మూసీ పరీవాహక ప్రాంతంలో వెలసిల్లిన నాగరికతకు చాలా చరిత్ర ఉంది. పుక్కిటి పురాణాలు అని కొట్టిపారేసి కాగితం మీద దక్కిన దక్కన్ చరిత్రను మాత్రమే మనం అంగీకరించాలి! అందునా వామనేత్రంతో చూసి రాసిన చరిత్ర అయితే మరీ శ్రేష్ఠం!

తెలుగులో అప్పుడప్పుడు గుండె చెరువు అవుతూ ఉంటుంది. గుండెకు చిల్లులు పడతాయి. లేదా గుండె కవాటాల్లో అడ్డు పడతాయి. గుండె బరువెక్కుతుంది. గుండె తేలికవుతుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. గుండె నెమ్మదిగా కొట్టుకుంటుంది. లేదా కొట్టుకుని కొట్టుకుని అలసితి సొలసితి అంతర్యామీ! అని ఆగిపోతుంది. మరి గుండె చెరువు కావడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా అన్వయించుకోవాలి? నిజానికి హైదరాబాద్ గుండె ఇప్పుడు చెరువయ్యే ఉంది. ఏడ్చి ఏడ్చి ఆ కన్నీళ్లతో గుండెలోపల కన్నీటి చెరువు ఏర్పడ్డం అనే అర్థంలో అంతులేని బాధల్లో మునిగిపోవడాన్ని గుండె చెరువుగా చెప్పుకుంటున్నాం.

దుర్గం చెరువు
పీరం చెరువు
హుస్సేన్ సాగర్ చెరువు
గండిపేట చెరువు
సఫిల్ గూడ చెరువు
సరూర్ నగర్ చెరువు
అల్వాల్ చెరువు
రామంతాపూర్ చెరువు
శామీర్ పేట్ చెరువు
జీడిమెట్ల చెరువు
మీర్ ఆలం చెరువు

ఇలా మొత్తం హైదరాబాద్ నగరం లోపల, శివారు ప్రాంతాల్లో, చుట్టుపక్కల కలిపి మొత్తం 1728 చెరువులుండేవి. అత్యంత వేగవంతమైన నగర విస్తరణ మహా యజ్ఞంలో…గడచిన 45 ఏళ్ల ప్రయాణంలో 700 చెరువులే మిగిలి ఉన్నాయి. అక్షరాలా వెయ్యి చెరువులు మటుమాయమయ్యాయి. మిగిలినవి కూడా విస్తరణలో కుచించుకుని పేరుకే ఉండి…బతకలేక చస్తున్నాయి. చావలేక బతుకుతున్నాయి. కొన్ని చెరువులు మొండివి కాబట్టి బతికి బట్టగలిగాయి.

మనిషికి ఏడుపొస్తే “గుండె చెరువయ్యింది” అంటున్నాం. చెరువుకే ఏడుపొస్తే-
“చెరువు గుండె చెరువయ్యింది” అనాలా? చెరువుకు మాత్రం గుండె ఉండదా? ఆ గుండెకు ఒక స్పందన ఉండదా? ఆ స్పందనకు ఒక అర్థం ఉండదా?
మనకు ఏడుపొస్తే చెక్కిళ్ల మీద కన్నీళ్లు కనిపిస్తాయి.
చెరువుకు ఏడుపొస్తే దాని కన్నీళ్లు నీళ్లలోనే కలిసి ఉండడంవల్ల కనిపించవు. గుర్తుపట్టలేము.
భాగ్యనగరం చెరువులు దశాబ్దాలుగా రోడ్లమీద పడి గుండెలు బాదుకుంటున్నాయి. మనం ఆక్రమించినమేర ఖాళీ చేయాలని చెరువులు మూసీ పక్కనే ఉన్న కోర్టును న్యాయం అడగలేవు.

మొన్ననే వయనాడ్ లో ఊళ్లకు ఊళ్లను వరద ముంచెత్తి దాదాపు 300 పైగా ప్రాణాలను మింగేసింది. ప్రకృతిని, పంచ భూతాలను చెరబడితే దాని పద్ధతిలో అది హెచ్చరిస్తూ ఉంటుంది. మనం ఆ హెచ్చరికలను విని కూడా…విననట్లు నటిస్తుంటాం. శిక్షలు అనుభవిస్తూ ఉంటాం. ప్రకృతి పాఠాలను పాఠ్యపుస్తకాలకే పరిమితం చేస్తూ ఉంటాం. ఆచరణలో వికృతి గీతాలనే పరవశించి పాడుకుంటూ ఉంటాం.

ఇది గుండె చెరువైన కథ కాదు!
మనం చెరువును చెరబట్టి… చెరువు గుండెను చెరిపిన కథ!! – పమిడికాల్వ మధుసూదన్  9989090018 (ఇందులో హైడ్రా రంగనాథ్ గురించి గానీ, దానం నాగేందర్ గురించి గానీ ఏమీ అనలేదని గమనించగలరు…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘అనగనగా..’ ఓ సుమంతుడు… మరొక్కసారి అదే ఫెయిల్యూర్ అడుగు…
  • సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి అత్యంత కీలకమైన రాజ్యాంగ ప్రశ్నలు..!
  • అది సరే గానీ… మరి రేవంత్ రెడ్డి ఏమైపోతాడో చెప్పలేదేమిటి..?
  • ఫాఫం, తెలంగాణ వాళ్లు ఎవరూ దొరకడం లేదా సారూ..!!
  • దిక్కుమాలిన, తలకుమాసిన మర్యాద… వీటినే బానిస ధోరణులు అంటారు…
  • ఏ కులమైతేనేం… బలుపు చూపే కులంపై తిరగబడేవాడే,.. కర్ణన్…
  • సినిమా టైటిల్‌లో మొనగాడు ఉంటే చాలు… మనోళ్లకు ఖుషీ…
  • అంతే… ఆ స్పీచ్ తరువాత కాంగీ, సీపీఎం మొహాలు మాడిపోయాయ్…
  • యుద్ధంకన్నా క్లిష్టం… సింధు జలాల వాటాలు… దిక్కుతోచని పాకిస్థాన్…
  • వావ్ మద్రాస్..! అప్పట్లోనే ఆంధ్రాలీడర్లు ఇంకాస్త గట్టిగా పట్టుపట్టి ఉంటే..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions