ఓ ఇంగ్లిష్ మెయిన్ స్ట్రీమ్ సైటులో ఓ వార్త చదివి నిజమే కదా అనిపించింది… ఇప్పుడంటే తెలుగు సినిమాలంటే హిందీ వాళ్లకు బాగా తెలిసిపోయింది… తెలుగు హీరోల గురించీ తెలిసింది… ఆస్కార్ దాకా వెళ్లిన తెలుగు సినిమా, హీరోలు, పాటల గురించీ తెలిసింది… కానీ బాహుబలికి ముందు..? హిందీ వాళ్లకు ఎవరూ తెలియదు…
వాళ్లకు తెలుగు అంటే జితేంద్ర సినిమాలకు ముడిసరుకు ఇచ్చే ఏదో ఓ అనామక ఫిలిమ్ ఇండస్ట్రీగానే తెలుసు… రేఖ, హేమమాలిని, జయప్రద, శ్రీదేవి ఎట్సెట్రా ఎవరైనా సరే వాళ్లకు ఇడ్లీ సాంబార్‌గానే తెలుసు… అంటే చెన్నై సరుకు అని..! చివరకు బాలసుబ్రహ్మణ్యం కూడా తమిళుడనే అనేవాళ్లు… అఫ్ కోర్స్, తమిళులూ అలాగే ఓన్ చేసుకున్నారు…
బాహుబలితో ప్రభాస్ తెలిశాడు, రాజమౌళి తెలిశాడు… రానా కూడా తెలిశాడు… పుష్ప, కార్తికేయ, ఆర్ఆర్ఆర్, సాహో సహా రాబోయే పెద్ద ప్రాజెక్టులు కూడా తెలుగు సినిమా అంటే ఏమిటో హిందీ ఫీల్డ్‌కు బాగా తెలిసింది… ఈనేపథ్యంలో రానా ఓ పాత సంభాషణను గుర్తుచేసుకున్నాడు ఏదో ఇంటర్వ్యూలో… తప్పేమీ లేదు… ఆలోచనాత్మకంగానే ఉంది…
Ads
నటుడు రానా దగ్గుబాటి తన వెబ్ సీరీస్ రిలీజు కోసం ఎదురుచూస్తున్నాడు… అందులో తన అంకుల్ వెంకటేశ్ కూడా నటించాడు… ఈ నేపథ్యంలో ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… సౌత్ సినిమాల గురించి కొన్నేళ్ల క్రితం వరకూ హిందీ ఫీల్డ్ ఎలా భావించేదో చెప్పుకొచ్చాడు… తెలుగు సినిమా ఇండియన్ సినిమా తెర మీద ఎలా బలంగా ఎమర్జయిందో చెప్పాడు…
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ‘‘తెలుగు సినిమా ఈరోజు దేశంలోని ప్రతి మూలల్లోనూ ప్రదర్శించబడుతోంది… విదేశాలకూ వెళ్తోంది… ఈ సందర్భంగా బాహుబలికి ముందు ముంబైలోని ఓ మిత్రుడితో జరిగిన ఓ సంభాషణ గుర్తొస్తోంది… బాహుబలి షూటింగ్ జరుగుతున్న రోజులవి… ఓ ఫ్రెండ్ కలిశాడు… నేను బాహుబలి గురించి చెప్పాను…
టైటిల్ రోల్ ఎవరు పోషిస్తున్నారని అడిగాడు… ప్రభాస్ అని చెప్పాను… ప్రభాసా..? ఎవరాయన..? అనడిగాడు ఆయన… నాకు ఏమని చెప్పాలో అర్థం కాలేదు… ప్రభాస్ చేసిన కొన్ని సినిమాల పేర్లు చెప్పాను… ఏమోనబ్బా, ఇవేవీ నాకు తెలియవు, చినూ భర్త మాత్రమే నాకు తెలుసు అన్నాడు తను… అసలు ఏం చెబుతున్నాడో నాకు అర్థమే కాలేదు… ఆశ్చర్యంలో మునిగిపోయాను… తరువాత గుర్తొచ్చింది, చినూ అంటే నమ్రత శిరోద్కర్, భర్త అంటే మహేశ్ బాబు… నవ్వుతూ నేను నా ఫ్రెండ్‌కు చెప్పాను… మూడునాలుగేళ్లు ఆగు, మా సైన్యం ఇక్కడ ఎలా కదం తొక్కుతుందో నువ్వే చూస్తావు అని…’’
ఈ ఇంటర్వ్యూ చదువుతుంటే… నిత్యామేనన్ వివాదం కూడా గుర్తొచ్చింది… తెలుగు సినిమాలేమీ చేయని రోజుల్లో ఏదో సినిమా ప్రెస్‌మీట్ జరుగుతోంది… నిజంగానే ఆమెకు ప్రభాస్, ఇతర తెలుగు హీరోలు తెలియదు… ప్రభాస్ నాకు తెలియదు అన్నట్టుగా ఏదో సందిగ్ధంగా చెప్పింది… ఇంకేముంది..? ఆమెను వివాదంలోకి లాగి, ప్రభాస్ తెలియకపోవడం అంటే జాతిద్రోహంలా చిత్రీకరించేశారు… నిజంగానే బాహుబలికి ముందు ప్రభాస్ ఎవరు..? తెలుగువాళ్లకు తెలుసేమో… అందరికీ తెలియాలని ఏముంది..?! ఇప్పుడు కూడా హిందీ ప్రేక్షకులకు రానా, ప్రభాస్, జూనియర్, రాంచరణ్, బన్నీ తెలుసు… ఇంకెవరైనా తెలుసా..?!
Share this Article