Prabhakar Jaini……… ఈ సినిమా కమర్షియల్ గా విజయం చెందింది కూడా. ధనరాశులు కురవకున్నా బ్రేక్ ఈవెన్ అయింది, ott వల్ల. ఒక గొప్ప దర్శకుడికి ఇది చాలు అనే సంతృప్తి ఉంటుంది. కృష్ణవంశీ గారు హాయిగా, ఆనందంగా ఉన్నారు.
కాకపోతే, సినిమాల గురించి నేనెప్పుడూ నకారాత్మక మాటలు చెప్పను. ఏ సినిమా తీయడానికైనా ఎంత కష్టపడాలో నాకు తెలుసు. పెళ్ళీడుకొచ్చిన కూతురు గుండెల మీద కుంపటిలా ఉన్న మధ్యతరగతి తండ్రిలా, డైరెక్టర్ కూడా నిద్రలేని రాత్రులే గడుపుతాడు. బిడ్డను పంపి ఉండలేడు. పంపకుండా కూడా ఉండలేడు. సినిమా విడుదలయిన తర్వాత దాని భవిష్యత్తు ఎలా ఉంటుందోనని, ఒక ఆడపిల్ల తండ్రిలా, క్షణక్షణం రంపపు కోతకు గురవుతాడు. కృష్ణవంశీ గారిలో కూడా ఆ బాధను నేను గమనించాను, ఎఫ్బీ పోస్టుల్లో.
కానీ, కృష్ణవంశీ గారికి తెలియదా? ఒక రొడ్డకొట్టుడు, ఫార్ములా సినిమా తీస్తే చాలా డబ్బులు వస్తాయని తెలియదా? తెలుసు! కానీ, ఎందుకు ‘రంగమార్తాండ’నే తీసారంటే, అది ఆయన వ్యక్తిత్వం. సమాజానికి ఏదో చెప్పాలనే తపన ఆయనను నిలువనీయక పోవచ్చు. ఆ ఆర్తిని ప్రజలతో పంచుకోక పోతే ఆయనకు ఊపిరి ఆడదు. అందుకే #రంగమార్తాండ.
Ads
ఒక వైపు ట్రిపుల్ ఆర్ వంటి సినిమాలు ఘనవిజయం సాధించి కాసుల వర్షం కురిపిస్తుంటే, అలా అభూత కల్పనలు కాదని, సమాజంలోని ఒక సంక్లిష్ట, యదార్థ పరిస్థితిని దృశ్య రూపంలో తేవాలని తాపత్రయపడడం, నిజానికి సాహసమే. ఆ సాహసమే, అతన్ని ఈ మంచి సినిమాను తీయడానికి పురిగొల్పింది.
కానీ, సినిమా ఇంకా ఎందుకు గొప్పగా సక్సెస్ కాలేదంటే, నాకు కొన్ని కారణాలు గోచరించాయి.
(1) ఈ రోజుల్లో, సినిమాను థియేటర్లలో చూసే ఆడియెన్స్ 15 నుంచి 30 మధ్య వయసున్న వారే. వాళ్ళు థియేటరుకు వెళ్ళి చూడాలంటే వారు, సినిమాలో తమను తాము ఐడెంటిఫై చేసుకునే ఒక హీరో ఉండాలి. ఈ సినిమాలో లేడు. రివ్యూలు రాసే మనమంతా ott లో వచ్చే వరకు ఆగి,(నాతో సహా) ఇప్పుడు సినిమాలోని గొప్పతనాన్ని చెబుతున్నాము. దాని వల్ల సినిమాకు కలిగే ఉపయోగమేమీ లేదు. ఈ targetted audience కి పిచ్చి రొమాన్స్, రొడ్డకొట్టుడు డైలాగులు, డాన్సులు, పాటలూ, ఫైట్లూ ఉండాలి. ఇవన్నీ చేసే తమకు నచ్చిన హీరో ఉండాలి.
(2) ఈ సినిమాలో అవునన్నా కాదన్నా యువతరాన్ని విమర్శించడం జరిగింది. దానివల్ల యువతీయువకులకు కంటగింపుగా మారింది.
(3) ప్రకాష్ రాజ్ గొప్ప నటుడే కావచ్చును కానీ, ఈ మధ్య అతని రాజకీయ వ్యాఖ్యలు, సిద్ధాంతాలను వ్యతిరేకించే, ఒక వర్గం ప్రజలు సినిమాను troll చేసి, బాగా నెగటివ్ పబ్లిసిటీ చేసారు. ప్రకాష్ రాజ్ ఉచ్ఛారణలో చాలా తప్పులున్నాయని, కొంత మంది పోస్టులు పెట్టారు.
(4) బ్రహ్మానందంను చాలా మంది పొగిడారు ఓటీటీలో చూసిన తర్వాత. కానీ, సినిమాలో బ్రహ్మానందం కనిపిస్తే కామెడీ మాత్రమే చూసే యువతరానికి, ఆయన పాత్ర నచ్చలేదు. ముసలి కంపు అన్నారు.
(5) తరాల అంతరం గురించి చెబుతూ, పాత తరం వైపు మొగ్గడం, యంగ్ జనరేషన్ కు నచ్చలేదు.
(6) కృష్ణవంశీ గారు సినిమాను ఓవర్ expose చేసారేమోననిపించింది. వేల మందికి సినిమా చూపించాల్సిన అవసరం ఏముంది? ఒక మంచి డిస్ట్రిబ్యూటరును కన్విన్స్ చేస్తే బాగుండేది. సారు, ఫేస్బుక్కు రివ్యూలనే నమ్ముకున్నారు. ఫేస్బుక్కులో వహ్వా వహ్వా అన్నవారెవ్వరూ మళ్ళీ థియేటరుకు వెళ్ళి చూడరు కదా? ప్రీవ్యూలు చూసిన వాళ్ళు మొహమాటానికి సినిమా బాగుందనే చెప్తారు. అక్కడ కృష్ణవంశీ గారి distressness నాకు కనిపించింది.
(7) మన ప్రేక్షకులు ప్రస్తుతం సినిమా థియేటరులో హెవీ సినిమాలు చూడడానికి ఇష్టపడడం లేదు.
ఇంత చెప్పిన నేను కూడా, అవకాశం వస్తే ఇటువంటి సినిమానే తీస్తాను. తీస్తున్నాను కూడా. కృష్ణవంశీ గారిలా నాకూ మార్కెటింగ్ రాదు. ఏం జరుగుతుందో చూడాలి.
కృష్ణవంశీ గారి ‘అన్నం’ కోసం ఎదురు చూస్తూ…
డాక్టర్ ప్రభాకర్ జైనీసినీ దర్శకుడు,’నంది’ అవార్డు గ్రహీత
(మన గురించి మనమే చెప్పుకునే, దరిద్రపు మార్కెటింగ్ వ్యవస్థలో ఉన్నాం మరి)
Share this Article