Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చిన్న సింగిల్ కాలమ్ వార్త కాలేకపోయిన ఓ జర్నలిస్టు కన్నీటి గాథ

August 13, 2024 by M S R

ఇది సగటు జర్నలిస్టు కథ. అందరి కష్టాలను కథలు కథలుగా రాసే జర్నలిస్టు బాధ సింగిల్ కాలమ్ వార్తగా కూడా కాకుండాపోయిన కన్నీటి వ్యథ.

తన బాధను తను మీడియా ద్వారా చెప్పుకోలేని జర్నలిస్టు మౌన రోదన అతడి/ ఆమె మాటల్లోనే:-

“నా పేరు జర్నలిస్టు. మా అమ్మా నాన్న పెట్టిన పేరు వేరే ఉంది. మా ఆఫీసులో నేనేమి రాసినా పేరు లేకుండానే రాయాలి. పేరు లేకుండానే బతకాలి. దాంతో నా పేరు నాకే అంత అవసరం లేనిదయ్యింది. అలాంటిది ఇక నా పేరుతో మీకేమి పని? మా ఊరిలో తప్ప దేశంలో నేను ఎక్కడయినా పని చేయడానికి పనికివస్తాను అన్న మా మేనేజ్మెంట్ జర్నలిజం వృత్తిగత ప్రాథమిక సూత్రాల ప్రకారం నా ఊరు నాది కాదు.

Ads

కాబట్టి దానితో మీకు కూడా పనిలేదు. జర్నలిజం చదువుకుని… ఉస్మానియా, కాకతీయ చెట్ల కింద అర కప్పుల చాయ్ తాగుతూ పోటీ పరీక్షలు రాసి రాసి అలసి సొలసి జర్నలిజంలోకి వచ్చానా? ఇష్టపడి జర్నలిజంలోకి వచ్చానా? వచ్చాక కష్టపడి జర్నలిజం నేర్చుకున్నానా? నేర్చుకోక కష్టపడుతున్నానా? అన్న ప్రశ్నలకు నేనిప్పుడు సమాధానాలు వెతుక్కునే స్థితిలో లేను.

అందరూ పడుకుంటే నేను మేల్కొన్నాను. అందరూ మేల్కొంటే నేను పడుకున్నాను. అక్కడే నేను ప్రపంచానికి దూరమయ్యాను. ప్రపంచం కళ్లు తెరిపించే పనుల్లో నా కళ్లు మూసుకుపోతున్న విషయం నేను గ్రహించలేదు. గ్రహించే జ్ఞానం వచ్చేసరికి చేతులే కాకుండా మొత్తం శరీరం కాలుతోంది. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకుని ప్రయోజనం లేదు. అలాంటిది శరీరమంతా కాలుతుంటే ఏ చెట్టూ నన్ను రక్షించలేదు. మానులుగా ఎదిగిన యజమానుల నీడలో ఇక ఏ చెట్టూ ఎదగదు. ఎదగకూడదు. పెరటి చెట్టు ఎలాగూ నా వైద్యానికి పనికిరాదు. “నాకు ఉగాదులు లేవు. ఉషస్సులు లేవు. నేను అనంత లోక శోక భీకర తిమిరైక పతిని”.

ఇన్నాళ్లూ ప్రపంచం బాధ నా బాధ. ఇప్పుడు నా బాధ ప్రపంచం బాధ కాకుండా పోయింది. నా ఉద్యోగం ఉంటుందో? పోతుందో? తెలియదు. జీతం నెల నెలా వస్తుందో? రాదో? తెలియదు.

మా పిల్లలు పెద్దవారయ్యారు. కాలేజీలు. డొనేషన్లు. ఫీజులు. ఇంటి లోన్, వెహికిల్ లోన్ ఈఎంఐ లు. అనారోగ్యాలు. ఆసుపత్రుల ఖర్చులు. అంతా అగమ్యగోచరంగా ఉంది. నేను జర్నలిస్టును కాకుండా ఉంటే బాగుండేది అని ఇప్పుడు నన్ను నేను రద్దు చేసుకుంటున్నాను. నేను మనిషిగా మిగిలి ఉండడానికి దారులు వెతుక్కుంటున్నాను. నన్ను నమ్ముకున్న నా కుటుంబాన్ని నిలబెట్టుకోవడం తప్ప నాకిప్పుడు ఏ ఆదర్శాలూ లేవు. ఉన్నా నాకవసరం లేదు.

ఉసురు తగిలి పోతారని తెలుగులో చేతకానివారు అనుకోవాల్సిన చేతకాని మాట. మా మనసులో మౌనంగా తిట్టుకున్నా దాన్ని అక్షరాల్లోకి అన్వయించే నిగూఢ గూఢచర్య సాఫ్ట్ వేర్ మీదగ్గరుందన్న ఎరుక మాకుంది. కాబట్టి స్వగతంలో కూడా కసితీరా తిట్టుకోలేని దీనులం. పేద జర్నలిస్టు కోపం పదవికి చేటు.

అక్షరం అంటే నాశనం లేనిది అని చాలా లోతయిన అర్థమేదో ఉన్నట్లుంది. మేము క్షయమవుతూ మేము రాసే అక్షరం మాత్రం క్షయం కాకుండా ఉండడం ప్రకృతి సహజన్యాయ సూత్రాలకు విరుద్ధం కాదా? అయినా నోట మాట లేని నిర్-వచనంగా పడి ఉండాల్సిన వాళ్లం. మాటల నిర్వచనాలు మాకెందుకు?

నేను ఎన్నో వార్తలు రాశాను. హెడ్డింగులు పెట్టాను. అనువాదాలు చేశాను. ఎడిటింగులు చేశాను. సంపాదకీయాలు కూడా రాశాను. నా వార్త ఇప్పుడు నాకు అర్థం కావడం లేదు. నా వార్తకు శీర్షిక లేదు. ముగింపు ఉందో లేదో తెలియదు. ఎలా అనువదించుకోవాలో అంతుపట్టడం లేదు. నా జీతం ఎడిటింగ్ ఒక్కటే గుర్తొస్తోంది. నెల సంపాదన లేకుంటే సంపాదకీయం ఎలా రాయగలను?

లోకంలో ఎన్నెన్నో బాధలకు, కన్నీళ్లకు…కన్నీళ్ళకే కళ్లల్లో రక్తం వచ్చేలా రాశాను. నేను చలించి, గుండె బరువెక్కి రాసిన ఏయే విషాదాలు నాకిప్పుడు అన్వయం అవుతాయో నాకే తెలియడం లేదు.

ఇప్పుడు నామీద నేనే రాసుకోలేని, నాకు నేనే అర్థంకాని ఒకానొక వార్తను”.

(పాత కథనం. జర్నలిస్టుగా పనిచేస్తున్న యూ ట్యూబ్ ఛానెల్లో ఉన్నట్లుండి ఉద్యోగం ఊడబెరికిన నేపథ్యంలో బతుకు శూన్యమై కన్న కూతురితోపాటు ఆత్మహత్య చేసుకున్న వరంగల్ యోగి రెడ్డి మృతికి నివాళిగా పునర్ముద్రణ. చావలేక బతుకుతున్న యోగి రెడ్లు ఇంకా ఎందరో!)

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘అనగనగా..’ ఓ సుమంతుడు… మరొక్కసారి అదే ఫెయిల్యూర్ అడుగు…
  • సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి అత్యంత కీలకమైన రాజ్యాంగ ప్రశ్నలు..!
  • అది సరే గానీ… మరి రేవంత్ రెడ్డి ఏమైపోతాడో చెప్పలేదేమిటి..?
  • ఫాఫం, తెలంగాణ వాళ్లు ఎవరూ దొరకడం లేదా సారూ..!!
  • దిక్కుమాలిన, తలకుమాసిన మర్యాద… వీటినే బానిస ధోరణులు అంటారు…
  • ఏ కులమైతేనేం… బలుపు చూపే కులంపై తిరగబడేవాడే,.. కర్ణన్…
  • సినిమా టైటిల్‌లో మొనగాడు ఉంటే చాలు… మనోళ్లకు ఖుషీ…
  • అంతే… ఆ స్పీచ్ తరువాత కాంగీ, సీపీఎం మొహాలు మాడిపోయాయ్…
  • యుద్ధంకన్నా క్లిష్టం… సింధు జలాల వాటాలు… దిక్కుతోచని పాకిస్థాన్…
  • వావ్ మద్రాస్..! అప్పట్లోనే ఆంధ్రాలీడర్లు ఇంకాస్త గట్టిగా పట్టుపట్టి ఉంటే..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions