అబ్బే… వాళ్ల తప్పేమీ లేదండీ… దక్షిణాఫ్రికా ఎప్పుడూ అంతే… దాని దురదృష్టం… డెస్టినీ… దానికి ఎప్పుడూ నాకౌట్ గండమే… ఇప్పుడూ అదే కాటేసింది… దాని ఫలితమే ఆస్ట్రేలియాతో ఓటమి…. ఇవన్నీ ఒక కోణంలో కరెక్టే కావచ్చుగాక… కానీ ప్రత్యర్థి ఆస్ట్రేలియా ఏమీ ఓడించలేనంత గొప్ప జట్టు ఏమీ కాదు… కాకపోతే పక్కా ప్రొఫెషనల్స్, చివరి బంతి వరకూ పోరాటాన్ని ఆపరు ఆ ఆటగాళ్లు… అదీ వాళ్ల పెద్ద ప్లస్ పాయింట్…
దక్షిణాఫ్రికా దురదృష్టాన్ని కాసేపు పక్కన పెట్టండి… అది ఆస్ట్రేలియాతో ఆడిన సెమీ ఫైనల్స్ నుంచి ఇండియా ఓ పాఠం నేర్చుకోవాలి… లీగ్ దశ నుంచి నాకౌట్ దాకా అన్నీ గెలిచాం, అందరూ భీకరమైన ఫామ్‌లో ఉన్నారు, అదృష్టం మన వైపే ఉంది అని ఏమరుపాటుతో ఉంటే ఆస్ట్రేలియాతో కుదరదు… అది అల్లాటప్పా జట్టు కాదు, అసలు సిసలు ఫైనలిస్టు క్వాలిటీ ఉన్న జట్టు… ఏమాత్రం అవకాశం వచ్చినా కప్పు ఎగరేసుకుపోయే మెరిట్ ఉన్న జట్టు… న్యూజిలాండ్‌కు ఇచ్చినట్టు 400 రన్స్ భారీ స్కోరు టార్గెట్ ఇచ్చినా సరే ఆస్ట్రేలియా ‘కంగారూ’ పడిపోదు… అవకాశం దొరికితే దాన్నీ దంచగలదు…
వోకే, మరి దక్షిణాఫ్రికా- ఆస్ట్రేలియా మ్యాచ్ ఏం చెప్పింది మనకు..? బ్యాటర్ల ప్రతిభ, బౌలర్ల ప్రతిభ మాత్రమే కాదు… ఫీల్డింగ్‌లో అశ్రద్ధ కూడదు అని చెప్పింది… దక్షిణాఫ్రికా దాదాపు 21 ఎక్సట్రా రన్స్ ఇచ్చింది… అసలే తక్కువ స్కోర్… 212 అనేది ఆస్ట్రేలియాకు చాలా తక్కువ టార్గెట్… ఐనా సరే, ఆ పిచ్ మీద ఆ స్కోర్‌తో దక్షిణాఫ్రికాకు పోరాడే అవకాశం మాత్రం ఉండింది… ఎక్సట్రా రన్స్‌కుతోడు ఒక కీలకమైన రనౌట్ మిస్… దాదాపు ఏడో ఎనిమిదో క్యాచులు మిస్… (డెస్టినీ అదే కాబట్టి, అదే తప్పులు చేయించింది అనకండి… తప్పులే దాని డెస్టినీని డిసైడ్ చేశాయి…)
Ads
ఆ తక్కువ స్కోర్ టార్గెట్ ఇచ్చి కూడా దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియాకు అంత తేలికగా బ్యాచ్ అప్పగించలేదు… బాగానే పోరాడింది… ఏడు వికెట్లు తీసి 47వ ఓవర్ దాకా ఆడించింది… ఈ స్థితిలో ఆ ఎక్సట్రా రన్స్ లేకుండా, క్యాచులు విడిచిపెట్టకుండా ఉండి ఉంటే కథ వేరేలాగా ఉండేది… సరిగ్గా ఇండియా జాగ్రత్త వహించాల్సింది కూడా ఈ అంశాలే… ఒక్క క్యాచ్ మిస్ మొత్తం ఫలితాన్నే డిసైడ్ చేయవచ్చు… వన్డే ఆట అంటేనే అది… ఏదైనా జరగొచ్చు…
అన్నింటికీ మించి మితిమీరిన ఆత్మవిశ్వాసం కూడా కొన్నిసార్లు పొరపాట్లు చేయిస్తుంది… గతంలో మనల్ని ఓడించిన ఆస్ట్రేలియా మీద 20 ఏళ్లనాటి ప్రతీకారం అనే ఫ్యాన్స్ ఎమోషనల్ భావన, ఈసారి కప్పు తప్పదనే నమ్మకం, సాక్షాత్తూ ప్రధాని ఫైనల్ ఆట చూడటానికి స్టేడియానికి రావడం, ఫైనల్ మీద బాగా హైప్ క్రియేట్ కావడం, ప్రముఖులెందరో ఆట వీక్షణానికి వస్తుండటం వంటివి ఇండియన్ జట్టు మీద ఒత్తిడిని పెంచుతాయి… షమి తప్ప మిగతా బౌలర్లు ఎక్కువ రన్స్ ఇస్తున్నారు… అది సరిచేసుకోవాల్సిన అంశం… లైన్ అండ్ లెంత్ బాల్స్ ప్రత్యర్థిని కట్టడి చేస్తాయి…
ఫీల్డింగ్ వరకు ఇండియా జట్టు బాగానే ఉంది… ఎవరూ కేర్‌లెస్‌గా ఉండటం లేదు… బ్యాటర్లు మంచి ఫామ్‌లోనే ఉన్నారు… ఎటొచ్చీ ఇలాంటి కీలకమైన మ్యాచుల్లో ఎవరు తక్కువ తప్పులు చేస్తే వాళ్లే విజేతలు… అదే ఇండియా గమనంలోకి ఉంచుకోవాల్సిన బలమైన పాయింట్… అంతే…
Share this Article