మొన్నోసారి ఓ మిత్రురాలు ‘‘జామకాయతో బజ్జీలు ఏమిట్రోయ్’’ అంటూ ఫేస్బుక్కులో బాగా కోప్పడిపోయింది… ఆశ్చర్యమేసి, యూట్యూబ్ వాడిని కదిలిస్తే, నిజంగానే ఓ వీడియో ఉంది… అసలు జామకాయతో బజ్జీలు వేయడం అనే ఆలోచనే కాదు, దానికి 20 లక్షలు దాటిన వ్యూస్ మరీ మిక్కిలి ఎక్కువ ఆశ్చర్యపరిచాయి… కొత్త రుచుల కోసం మన జిహ్వారాటం అంత బలంగా ఉందన్నమాట… సో, రేపురేపు అరటిపండు బజ్జీలు, డ్రాగన్ ఫ్రూట్ బజ్జీలు కూడా వేస్తారేమో… ఏమో, ఆల్ రెడీ వేస్తూనే ఉన్నారేమో… ఇక వాటికోసం సెర్చించలేదు… ఐనా శెనగపిండి జారుగా కలుపుకుంటే చాలు, చేతికి ఏది దొరికితే దాన్ని ముంచేసి, మూకుట్లో గోలించేయడం, వెరైటీ బజ్జీలు అని లొట్టలు వేయడం మనవాళ్లకు అలవాటే కదా అంటారా..? అవున్లెండి… అదీ నిజమే…!! లోకోభిన్న రుచి… అంటే లోకంలో ఒక్కొక్కరి రుచి, అభిరుచి ఒక్కోలా ఉంటుంది, ఎవరు దేన్ని ఎందుకు ఇష్టపడతారో మనమేం చెప్పగలం..? పైగా లోకం ఎప్పుడూ భిన్న రుచుల్ని కోరుకుంటుందాయె… ఆ భిన్న రుచుల కోసం నిత్యప్రయత్నం, తపన లేకపోతే ఇన్నిరకాల ఫుడ్ కల్చర్స్, ఫుడ్ ఐటమ్స్ ఉండేవా..? దొరికిందే తిందాంలే అనుకుంటే ఇంకా ఆదిమవాసుల్లా పచ్చిమాంసాన్ని కొరుకుతూ ఉండేవాడేమో మనిషి..? సో, బజ్జీలు వేయాల్సిన మిర్చిల్లో ఆ మ్యాగీ నూడుల్స్ కూరావేమిట్రా వెధవాయ్ వంటి తిట్లు మానేయండి…
అసలు చైనీయుల ఫుడ్ వీడియోలు చూశారా ఎప్పుడైనా..? తిండి మీద వైరాగ్యం వచ్చి, నాలుగు రోజులు ఫుడ్డు సహించదు..! ప్రపంచంలోని సకల జంతుజాలాన్ని నమిలేస్తారు చైనీయులు… ఒక్క మనుషుల్ని తప్ప..! కనిపించక వదిలేశారు గానీ వైరసులు, బ్యాక్టీరియా కూడా వదలరు…!! మరి మనకెందుకు నచ్చదు అంటే… మనం అలా ట్యూన్ కాలేదు కాబట్టి..! ఆమధ్య ఓసారి అమరావతిలో బౌద్ధుల కాలచక్ర నిర్వహించినప్పుడు తూర్పుదేశాల నుంచి బోలెడు మంది వచ్చారు… ఆ ఉత్సవాలు అయిపోయే టైంకు ఆ పరిసరాల్లో ఒక్క కుక్క కూడా మిగల్లేదు..! మనకు వాయిక్… వాళ్లకు కసక్…. అన్నట్టు మీకు గుర్తుందా..? ఆమధ్య ఎవడో ఓ కొక్కిరాయి ‘ఛట్, ప్రపంచంలోకెల్లా వరస్ట్ ఫుడ్ ఇడ్లీయే’ అని పోస్టాడు… అసలే ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన భారతీయులు, ప్రత్యేకించి దక్షిణ భారతీయలుు రోజూ ఎన్నికోట్ల ఇడ్లీలు తింటారో ఎవరూ లెక్కవేయలేరు… అలాంటిది ఎవడో కోన్ కిస్కా ఇడ్లీని తిడితే ఊరుకుంటారా..? అందరూ విరుచుకుపడ్డారు… అసలు ఇడ్లీల్లో ఉన్నన్నిరకాలు ఏ ఫుడ్లోనైనా ఉంటాయా..? ఆ పోస్టర్ ఎవరో గానీ, పాచిపోయిన ఇడ్లీ గొంతులో ఇరుక్కున్నట్టు… ఇక మాటపెగిలితే ఒట్టు… అన్నట్టు ఇడ్లీ (ఇడ్డెన్లు) అంటే గుర్తొచ్చింది…
Ads
ఈమధ్య బెంగుళూరులో ఒక హోటలాయన కస్టమర్లను ఆకర్షించడం కోసం ఓ ప్రయోగం చేశాడు… పుల్ల ఐస్క్రీంలాగే… పుల్ల ఇడ్లీ… అంటే పుల్లగా ఉండే ఇడ్లీ అని కాదు… ఎక్కువ పులిసిన ఇడ్లీ అని కాదు… మామూలు ఇడ్లీల బదులు, పుల్లల్ని గుచ్చేసి ఓ డిఫరెంట్ సైజు, షేప్ ఇడ్లీల్ని వండేయడం… జస్ట్, అలా చేతికి తీసుకుని, పక్కనే ఉండే సాంబారులోనో, చట్నీలోనో అద్దుకుని నోట్లోకి జారవేయడమే… సోషల్ మీడియాలో ఫుల్ ప్రశంసలు… మనమూ మెచ్చేసుకుందాం… ఆహార ప్రయోగాలను ఆహ్వానిద్దాం… కానీ ఏమాటకామాట… అసలు ఇడ్లీ అంటే… ధవళం, మృదుత్వం, పరిమళం, కమ్మదనం… రా… అనగా రా విస్కీ అని కాదు, అసలు ఏ అధరువూ లేకుండా ఇడ్లీని తింటూ ఆస్వాదించేవాళ్లు బోలెడు మంది… పైగా దాన్ని అలా చేతులతో తుంచుతూ రకరకాల పొడులు, సాంబార్లు, చట్నీలు, నెయ్యి గట్రా అద్దుతూ, ముంచుతూ తింటుంటే వచ్చేంత ఆత్మారాముడి తృప్తి… అబ్బే, ఈ పుల్ల ఇడ్లీలతో వస్తుందా..? చేత్తో టచ్ చేస్తేనే, మన భారతీయ ఆహారానికి ఆ రుచి.., అదీ మన అభిరుచి… దానికి ఇలా పుల్లలు పెట్టడం అంత రుచికరంగా అనిపించడం లేదు ఎందుకో…!
అంతెందుకు..? ఇప్పటికీ అనేకచోట్ల అనేకమంది ఇడ్లీని ఎలా తింటారో తెలుసా..? ప్లేటులో ఇడ్లీలు పెట్టేసి, దానిపై సాంబార్ గుమ్మరించేసి, ఈ ఇడ్లీలను చేత్తో మెత్తగా అందులో ఎంచక్కా పిసికేసి… ఒక్కొక్క ముద్దనూ గ్రోలుతారు… అదే వాళ్లకు అమితానందం… పొడులూ, చట్నీలు వాళ్లకు ఏమాత్రం జరూరత్ నై… ప్రపంచంలో అయిదురకాల ఆహారం ఉంటుంది… పంచభక్ష్యాలు… అంటే… లేహ్యం అంటే ముద్దలా ఉంది. చోష్యం అంటే పీల్చదగ్గది లేదా జుర్రుకోడానికి వీలైనది. పానీయం అంటే తాగేది. భక్ష్యం అంటే కొరికి తినేది (గారె, అప్పము వంటివి), భోజ్యం అంటే కొరకకుండా నమలి మింగేది (పులిహోర, దధ్యోదనం వంటివి)… ఒకే ఆహారాన్ని పంచభక్ష్యాల తరహాలో ఎలాగైనా ఆస్వాదించగలిగేది ప్రపంచంలో కేవలం ఇడ్లీ మాత్రమే… ఇడ్లీకి సాంబారు కాస్త కలిపితే అది లేహ్యం, ఎక్కువగా కలిపితే ఇక చోష్యం, ఇడ్లీలు తిన్నాక మిగిలే సాంబార్ లేదా ఇడ్లీలు నిండా సాంబారులో కనిపించనంతగా మునిగి మాయమైపోతే అది ఓ పానీయం, రా ఇడ్లీ తినాలనుకుంటే భక్ష్యం, చక్కగా చట్నీ అద్దుకుని నమిలి మింగే ఇడ్లీ మంచి భోజ్యం… అంతటి ఇడ్లీల్ని ఈ పుల్లకు గుచ్చేయడమా..? అంటీఅంటని చట్నీ, సాంబారుతో అరకొరగా ఆస్వాదించడమా..? అబ్బే… కాలపరీక్షకు ఈ పుల్ల ఇడ్లీ నిలుస్తుందంటారా..?!
Share this Article