తమిళనాడు… తిరుప్పూర్… పి.అరుళ్ సెల్వం ఓ వ్యాపారి… రకరకాల ప్లాస్టిక్ సామాగ్రి, వాటర్ ట్యాంకులు గట్రా విక్రయిస్తుంటాడు… కొడుకు పేరు అరుల్ ప్రాణేష్… తండ్రి వ్యాపారంలో సాయం చేస్తుంటాడు… జి.అను అనే అమ్మాయితో పెళ్లి ఖాయమైంది… ఓ మ్యారేజీ హాల్ బుక్ చేశారు… మొత్తం 50 లక్షల దాకా పెళ్లి ఖర్చు అంచనా వేసుకున్నారు… పెళ్లి పనులు ప్రారంభించేశారు… పెద్ద కుటుంబం, పెద్ద సర్కిల్… పెళ్లికి వస్తారని అంచనా వేసుకున్న మిత్రులు, బంధుగణానికి భోజనాలు, ఇతర పెళ్లి ఖర్చులకు ఆ ఖర్చు సరిపోతుంది… మొన్నటి 14 వ తేదీన పెళ్లి… ఈలోపు ప్రభుత్వం సెకండ్ వేవ్ ఉధృతి రీత్యా కరోనా ఆంక్షల్ని కఠినతరం చేసింది… పెళ్లిళ్లకు అతిథుల సంఖ్యకు పరిమితి విధించింది… సేమ్, మన రాష్ట్రాల్లోలాగే 50 మంది గరిష్ట పరిమితి…
ఈ కరోనా పీడదినాలు పోయేవరకూ పెళ్లిని వాయిదా వేసుకుని, తరువాత మంచి రోజు చూసుకుని పెళ్లి చేద్దాం అనుకున్నారు మొదట్లో పెద్దలు… కానీ ఈ కరోనా వేవ్ తగ్గేదెప్పుడు..? ఈలోపు థర్డ్ వేవ్ అని కూడా భయపెడుతున్నారు అందరూ… అందుకని అదే ముహూర్తానికి కార్యక్రమం పూర్తి చేసేయాలని నిర్ణయించారు… అతిథుల సంఖ్యను కట్ షార్ట్ చేసేశారు… మరీ ముఖ్యులయితేనే ఆహ్వానం… మ్యారేజీ హాల్ కేన్సిల్… పాపం, వీళ్ల ప్రతిపాదన విని, మెచ్చుకుని ఆ హాల్ ఓనర్ కూడా అడ్వాన్స్ వాపస్ ఇచ్చాడు… వత్తమలై అంగాలమ్మన్ గుడిలో సంప్రదాయబద్ధంగా, కొందరు అతిథులతో పెళ్లి జరిపించేశారు… ఏముంది ఇందులో వార్త అంటారా..? ఉంది…
Ads
ఈ పెళ్లికి అంచనా వేసిన ఖర్చు 50 లక్షలు కదా… అమ్మాయి వైపు ప్లస్ అబ్బాయి వైపు కలిపి ఖర్చు… కానీ 13 లక్షల్లో పెళ్లయిపోయింది… ఆ డబ్బు సరిపోయింది… ఎలాగూ ఆడంబరంగా పెళ్లి చేస్తే ఆ 37 లక్షలు కూడా ఖర్చయ్యేవి కదా, అవి ఖర్చయినట్టేనని భావించి, ఏదైనా మంచి కార్యక్రమానికి ఖర్చు పెడదాం అనుకున్నారు… ఈ అరుళ్ సెల్వం తిరుప్ఫూర్ స్మార్ట్ సిటీ రోటరీ క్లబ్ మెంబర్… అది కరోనా బాధితుల కోసం తిరుప్పూర్, పెరుందురై, పల్లడం తదితర ప్రాంతాల్లో హెల్ప్ సెంటర్లు నడిపిస్తోంది… తమ డబ్బుకు ఇంతకుమించిన సార్థకత ఏముందనుకుని, పెద్దలు కూడబలుక్కుని ఆ 37 లక్షలనూ కరోనా హెల్ప్ సెంటర్ల నిర్వహణ కోసం రోటరీ క్లబ్‌కు ఇచ్చేశారు… పైన కనిపిస్తున్న ఫోటో అదే… క్లబ్‌కు ఇచ్చిన చెక్… అమ్మాయి వైపు వాళ్లు, అబ్బాయి వైపు వాళ్లు ఎవరూ వ్యతిరేకించలేదు, అందరూ స్వాగతించారు… బాగుంది… అసలు కరోనా చీడ లేకపోయినా… ఈ స్ఫూర్తి ఇలాగే కొనసాగితే బాగుండు..!! అట్టహాసాల, అధిక వ్యయాల పెళ్లిళ్ల నుంచి విముక్తి… సకార్యాలకు వినియోగం… ఈ ఔదార్యం తాలూకు పుణ్యఫలం రెట్టింపు సిద్దించుగాక..!!
Share this Article