.
. ( రమణ కొంటికర్ల ) .. ….. పట్టణాలెన్నటికీ భారతదేశ ముఖచిత్రం కావు… గ్రామాలే భారతదేశ నాడీవ్యవస్థ అంటాడు మహాత్ముడు. కానీ, 2011 జనాభా లెక్కల ప్రకారం 70 శాతం గ్రామీణ భారతంలో నివశిస్తున్నవారిలో చాలామంది పట్టణాలకు వలసలబాట పడుతున్నారు. దాంతో ఇటు గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. పట్టణాలు జనాభాతో నిండిపోతున్నాయి. రెండింటికి రెండూ ఆందోళనకరంగా మారాయి.
పట్టణ మౌలిక సదుపాయల కల్పనకూ ఈ వలసల ప్రక్రియ అంతరాయంగా మారిపోతోంది. చిల్లికుండలో నీళ్లు పోసినట్టు ప్రభుత్వాలెన్ని చేసినా సరిపోనంత కొత్త కొత్త సమస్యలు పుట్టుకురావడం, వాటికి పరిష్కారాలు వెతకడంతోనే సరిపోతోంది. అందుకోసం గ్రామీణ భారతం బలోపేతం కావాలి. తనను తాను శక్తివంతంగా మల్చుకోవాలి. అందుకు గ్రామాల అభివృద్ధిపై పాలకులు దృష్టి పెట్టాలి. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చే ప్రక్రియపై సీరియస్ గా చర్చ జరగాలి.
Ads
ఇదిగో ఇవన్నీ చేస్తుందే కాబట్టే మనం పున్సారీ వైపు ఓసారి తొంగి చూడాలని చెప్పుకుంటున్నాం. ఈ స్మార్ట్ విలేజ్ లోని ఫీచర్స్ అన్నీగనుక ప్రతీ పల్లెలో కల్పించే సంకల్పం తీసుకుంటే.. మహాత్ముడు చెప్పినట్టు గ్రామాలన్నీ పట్టుగొమ్మలుగా నిలవడం ఖాయం.
గుజరాత్ రాష్ట్రం సబర్ కాంత జిల్లాలో.. రాష్ట్ర రాజధాని గాంధీనగర్ కు 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పున్సారీ. 6 వేల మంది జనాభా కల్గిన ఈ గ్రామంలో మంచి నీటి శుద్ధి కర్మాగారాలు, ఎయిర్ కండీషన్డ్ స్మార్ట్ క్లాస్ రూమ్ పాఠశాలలు, వైఫై కనెక్టివిటీ, ప్రతీ ఇంటికీ ఓ వెహికిల్.. అర్బన్ ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల కనిపించని సౌకర్యాలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. రోడ్లు, ప్రజారవాణా ఏదీ తగ్గేదేలే అన్నట్టుగా తీర్చిదిద్దారు.
ఇక్కడి గ్రామపంచాయితీ ఎంత చురుకుగా పనిచేస్తుందంటే.. స్థానిక సంస్థలంటే ఎలా ఉండాలి.. స్థానిక సంస్థల్లో నాయకులైనవారు ఎలా ఉండాలో కళ్లకుగట్టేలా ఇక్కడి క్రమశిక్షణ కనిపిస్తుంది. ఊరంతా వినిపించే స్పీకర్స్ సాయంతో పండుగలు, ప్రభుత్వ పథకాలు, అత్యవసర పరిస్థితుల్లో ప్రజల్ని అప్రమత్తం చేసే ప్రకటనలన్నీ గ్రామపంచాయితీ ఎంతో బాధ్యతతో చూసుకుంటుంది.
ఊళ్లో మినీ బస్సులు తిరుగుతుంటాయి. పాడికి చిరునామాగా నిల్చే ఈ ఊళ్లోని పాడి రైతులు, బళ్లకు వెళ్లే విద్యార్థులకు ఈ మినీ బస్సులెంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఇప్పుడంటే ప్రభుత్వాలు రాజకీయాల కోసం.. తమ ప్రాపకం కోసం మహిళలకు ఉచితబస్ పథకాన్ని ప్రవేశపెట్టాయేమోగానీ… ఈ ఊళ్లో ఎప్పట్నుంచో మహిళలతో పాటు, పిల్లలకూ ఈ మినీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించారు.
ఊరు చూస్తే అద్దంలా కనిపిస్తుంది. చెత్త సేకరణలో ఎప్పటికప్పుడు పారిశుధ్య కార్మికులు పనిచేస్తూనే ఉంటారు. షిఫ్టులవారీగా డ్యూటీస్ తో.. ఊరంతా పరిశుభ్రతకు పర్యాయపదంలా కనిపిస్తుంటుంది. సేకరించిన వ్యర్థాలను విద్యుత్తుగా మార్చే బయో ప్లాంట్ నూ ఏర్పాటు చేసుకున్నారు.
నీటిశుద్ధి కర్మాగారాల నుంచి ప్రతీ ఇంటికీ క్యాన్స్ లో 20 లీటర్ల తాగునీటిని కేవలం 4 రూపాయలకొక క్యాన్ చొప్పున ఇంటింటికీ పంపిణీ చేస్తారు. ఏ ఇంట్లో చూసినా మరుగుదొడ్లు కచ్చితంగా కనిపించాల్సిందే. అంతేకాదు, ఎక్కడా ఇష్టానుసారం మురుగునీరు మోర్లల్లోంచి బయటకు పోకుండా.. పకడ్బందీ డ్రైనేజీ సిస్టమ్ ను ఏర్పాటు చేసుకున్నారు. ఆ మురుగునీటిని కూడా శుద్ధి చేస్తారు. ఈ గ్రామంలో కరెంట్ కోతలుండవు. అందుకోసం ఏకంగా ఈ ఊళ్లోనే 24 గంటల పాటు కరెంట్ ఇచ్చేలా ఒక సబ్ స్టేషన్ ను ఏర్పాటు చేసుకున్నారు.
కాంక్రీట్ తో వేసిన అంతర్గత రోడ్లన్నీ అద్దాల్లా మెరుస్తుంటాయి. రోడ్ల వెంబడీ పగలంతా సౌరశక్తిని సంగ్రహించుకుని రాత్రంతా వెలుగునిచ్చే సోలార్ లైట్స్ ఏర్పాటుతో పాటు.. విద్యకు అత్యంత ప్రాధాన్యతనివ్వడం ఈ గ్రామంలో మరీ మరీ చెప్పుకోవాల్సిన విశేషం.
స్మార్ట్ లెర్నింగ్ కోసం కంప్యూటర్స్, ప్రొజెక్టర్స్ తో పాటు, ఎయిర్ కండీషన్డ్ తరగతి గదులతో విద్యార్థులకు క్లాస్ నుంచి అడుగు బయటపెట్టాలనుకోని వాతావారణం, అందుకు తగ్గ గురువులతో.. పున్సారీ చదువులు కూడా ఊరికి వెలుగునిచ్చేవి. పిల్లలకు సురక్షిత తాగునీటి కోసం పాఠశాలల్లోనే ఆర్వో ప్లాంట్స్ ఏర్పాటు, ఆధునిక పద్ధతుల్లో కనిపించే వాష్ రూమ్స్ తో.. ఇక్కడ డ్రాపవుట్స్ మాటే వినిపించదు.
చక్రాల లైబ్రరీ కూడా పున్సారీలో మరో ప్రత్యేకత. రోజుకో వీధి చొప్పున వారం రోజుల పాటు.. ఒక్కో ప్రాంతానికి వెళ్లి ఈ లైబ్రరీ ఆ రోజు అక్కడి వీధివాసులకు కావల్సిన జ్ఞానాన్ని పుస్తకాల రూపంలో అందిస్తుంది. ఈ పుస్తకాలకు నామమాత్రపు కిరాయిచ్చి చదువుకోని మళ్లీ అప్పజెప్పవచ్చు.
ఇక నేటి సాంకేతిక యుగంలో ఇంటర్నెట్ అవసరాన్ని గుర్తించిన గ్రామపెద్దలు.. వైఫై సౌకర్యంతో పాటు, నైపుణ్యాభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఓ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉపాధి పొందాలనుకునేవారికి కంప్యూటర్, టైలరింగ్, ఇతర వృత్తి కళల్లో తర్ఫీదునిస్తుంటారు.
ఇక్కడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రమూ ఎంత ఆరోగ్యంగా పనిచేస్తుందంటే… ఊరందరికీ ఉచిత వైద్యంతో పాటు, అవసరమైన టీకాలను వందశాతం ఇచ్చిన ఘనత ఇక్కడి వైద్యసిబ్బందిది. అంతేకాదు, ఇక్కడ నివశించే ప్రతీ వ్యక్తిపైనా, కుటుంబంపైనా గ్రామపెద్దలు దృష్టి పెట్టారు.
6 వేల కుటంబాలవారికి ఎవరైనా దురదృష్టవశాత్తూ చనిపోతే వర్తించేలా ప్రతీ ఒక్కరికీ లక్ష రూపాయల చొప్పున, ఏదైనా వైద్య అవసరాల కోసం 25 వేల చొప్పున అందించేలా 25 లక్షల రూపాయల మెడిక్లెయిమ్ పాలసీని గ్రామపంచాయితీనే కడుతోంది.
డ్రిప్ ఇరిగేషన్ వంటి వ్యవసాయ సాంకేతికతతో నీటి వృథాను అరికట్టడం, మొక్కలు, పంటలను శాస్త్రీయ విధానంలో ఆర్గానిక్ పద్ధతుల్లో పండించండంలోనూ ఇక్కడి రైతులు భేష్ అనిపించుకున్నారు. సామాజికంగా ఊళ్లో ఏవైనా ఇబ్బందులుంటే నేరుగా గ్రామపంచాయితీలో ఫిర్యాదు చేసేలా టోల్ ఫ్రీ నంబర్ నూ ఏర్పాటు చేశారు. గ్రామపంచాయితీకి వెబ్ సైట్ నూ రూపొందించారు. ఊరంతా నిఘా కెమెరాలుంటాయి. వాటిని గ్రామపంచాయితీ నుంచి పర్యవేక్షిస్తుంటారు.
ఇదంతా బలమైన నాయకత్వం వల్లే సాధ్యమైందంటారు అక్కడివారు. 23 ఏళ్ల యుక్తవయస్సులోనే గ్రామసర్పంచైన హిమాన్షు పటేల్ దార్శనికత, స్ఫూర్తితో ఈ గ్రామం వడివడిగా అభివృద్ధికి కేరాఫ్ గా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్లను సమర్థవంతంగా ఉపయోగించుకుంది ఈ గ్రామం.
అవినీతిరహిత వ్యవస్థ, ప్రజల భాగస్వామ్యం, అంకితభావంతో పాటు.. ఒక స్మార్ట్ ప్లానింగ్ తోనే తమ గ్రామం ఇవాళ దేశంలోనే ఓక రోల్ మాడల్ గా నిల్చిందంటారు హిమాన్షు పటేల్. చాలా గ్రామాల్లోని జనం పట్టణ ప్రాంతాలకు వలసలు పోతుంటే.. ఈగ్రామంలో అలాంటి వలసలు కనిపించకపోగా.. ఇక్కడి జీవన విధానానికి ఆకర్షితులైనవారు ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి ఉల్టా వలసలు వస్తుండటం ఈ గ్రామ ప్రత్యేకత.
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం రూపకల్పన చేసిన Providing Urban Amenities to Rural Areas అనే PURA పథకాన్ని ప్రతిబింబించేందుకు ఈ పున్సారి గ్రామం ఓ గొప్ప ఉదాహరణ. అందుకే ఇప్పుడిక్కడి విధానాల గురించి తెలుసుకోవడానికి… కేంద్ర, రాష్ట్రాల మంత్రులతో పాటు.. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు.
Share this Article