Gurram Seetaramulu…….. తక్షణ అవసరాల మీద, సమస్యల మీద వచ్చే స్పందన లేదా ఆసక్తి ఎక్కడో ప్రాచీన అంశాల మీదనో, మధ్య యుగాల మీదనో చూపలేము. వర్తమాన అంశాల మీద మాట్లాడటానికి, దానికి సంబంధించిన మనుషులో, సమాచారమో తాజాగా మాత్రం మనకు దొరికే అవకాశం ఉంది కదా.
అది ఒకరకంగా తేలికైన పని కూడా. శిలాజాల, శిథిలాల, రాతప్రతుల, శాసనాల, నాణేల వెంటపడే వారి శోధన లోకం వేరు. చరిత్ర నిర్మాణం అంటే వర్తమాన భావోద్వేగాల మీద పేర్చుకునే కాల్పనిక కట్టడం కాదు కదా.
మన పూర్వీకులు ఇచ్చిన పరంపరను నిష్పాక్షికంగా తడిమి నిలబెట్టే కృషి చేయగలగాలి. అలా ఎంతో ఓపికతో, నిబద్ధతతో పని చేసే ఒక సీరియస్ స్కాలర్ నన్ను ఎఫ్లూ లో కలిసాడు. అమెరికా నుండి తనది కాని దేశానికి వచ్చి ఒక ఆసరా కోసం నన్ను కలిసాడు. అతను నన్ను కలిసినప్పుడు తెలంగాణ ఒక నిప్పుల కుంపటి. అంతటా యుద్ద వాతావరణం. లాఠీలు, తూటాలు, మిస్సింగ్ లు, టియర్ గాస్ షెల్స్ తో విశ్వవిద్యాలయ ప్రాంగణాలు పోరాట క్షేత్రాలుగా మండుతున్న కాలంలో కుదిరింది మా కలయిక
Ads
.
రాయ్ ఫిసల్ స్కూల్ అఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ యూనివర్సిటీ ఆఫ్ లండన్ లో (SOAS) మిడీవల్ స్థడీస్ లో అధ్యాపకుడు. ఎక్కడో ఇజ్రాయెల్ లో పుట్టి, జెరూసలెంలో చదువుకున్న రాయ్ ఫిసల్ పూర్వీకులు మన బెంగాల్ వాళ్ళు. నేను ఎఫ్లూ లో డాక్టరేట్ చేసే రోజుల్లో ఆసఫ్ జాహీల మీద పరిశోధన చేసే క్రమంలో నాకు అతను పరిచయం.
మధ్య యుగాలలో కులం, పురాణం, సంస్కృతి మీద పరిశోధన నాది అవడం మూలంగా మేము మిడీవలిస్ట్ దోస్తులం అయ్యాము. నిజానికి యాంటిక్ అంశాల మీద పరిశోధన అంటే ఎంతో సీరియస్ నెస్ ఉండాలి. నాకు తెలిసి తెలంగాణ గడ్డ మీద సీరియస్ పరిశోధకులు తయారుకావలసే వుందింకా.
పరిశోధన అంటే అబిడ్స్ ఫుట్ పాత్ ల మీదనో, పాడుబడ్డ గ్రంధాలనో లేదా దొరికిన దుమ్ము బట్టిన పాత పుస్తకాలను పునర్ ముద్రణ చేసో ఎడిటర్ అని అట్ట మీద పేరు వేసుకొని చేసే ఎత్తిపోతల పని కాదు కదా? చరిత్ర నిర్మాణం అంతే కొత్త చరిత్ర- పాత రాళ్ళ వాసన కాదు.
మేమే మొదలు, మేమే తుది అని చేసే నిర్ధారణలూ చెల్లవు. పుస్తకాల అట్ట మీద కాటలాగ్ లిస్ట్ కాదు. చరిత్రలో కోల్పోయిన పేజీల కోసం వెతుకులాట కదా శోధన అంటే.
రాయ్ అనేవాడు బెంగాల్, ఇజ్రాయిల్, జెరూసలెం, హైదరాబాద్ , అమెరికా చికాగోల మీదుగా యూనివర్సిటీ ఆఫ్ లండన్, ఎడిన్ బరో దాకా నడిచిన పది, పదకొండేళ్ళ శ్రమ ఫలితం ఈ పుస్తకం. Local States in An Imperial world : Identity, Society and Politics in the Early Modern Deccan.
ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే పదేళ్ల విలువైన పునర్ నిర్మాణ కాలంలో తెలంగాణ చరిత్ర ఆనవాళ్లు కనీసం వాక్యం కూడా నిర్మాణం చేయలేక పోయింది . కేసీయార్ పాలనలో తరించిన అల్పత్వం… ఇలాంటి లక్షలాది పేజీలు చెదలు పట్టి పోతున్నాయి.. ఆ శిధిల కవిలె కట్టెలు తగలబడి పోతున్నా తాదాత్మ్యంలో బుద్ది జీవులు, ఒకప్పుడు మనకు ప్రెస్ అకాడమీ ఆర్కైవ్స్ అందుబాటులో ఉండేది, దొరవారి పాలనలో కనీసం వెబిసైట్ కూడా మిగలలేదు…
Share this Article