.
Subramanyam Dogiparthi ……. వేజెళ్ళ- పరుచూరి గోపాలకృష్ణ- శివకృష్ణల ఎర్ర సినిమా 1983 ఫిబ్రవరిలో వచ్చిన ఈ ఇది కాదు ముగింపు . వేజెళ్ళని , గోపాలకృష్ణని ఆనాటి కొన్ని సామాజిక రుగ్మతలను , సమస్యలను చాలా విపులంగా సాధారణ ప్రేక్షకునికి కూడా అర్థం అయ్యేలా తీసినందుకు మెచ్చుకోవలసిందే .
సినిమా ముగింపులో వచ్చే కోర్టు సీనే సినిమా అంతటికి గుండెకాయ . మధ్య/ మిధ్య తరగతి వ్యక్తి డాంబికాలకు పోయి ముగ్గురిలో ఇద్దరు కొడుకులు దారి తప్పేలా చేసుకుంటాడు . కుటుంబం అంతా ఛిన్నాభిన్నం అవుతుంది . ఒక కొడుకు ప్రజా కంటకుడు , తమ కుటుంబ కంటకుడు అయిన ప్రజాపతిరావు అనే ఒక మాజీ MLA ని చంపి జైలుకు వెళతాడు . భార్య చనిపోతుంది . అత్త గారింటికి వెళ్ళిన కూతురు నిస్సహాయ స్థితిలో ఉంటుంది .
Ads
ఒంటరి అయిపోయిన ఆ మిధ్య తరగతి మనిషి ఆకలికి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడతాడు . పోలీసులు కేసు నమోదు చేస్తారు . కేసు విచారణలో ఆనాటి సామాజిక సమస్యలను ఉతికి ఆరేస్తారు . స్త్రీలకు ఆస్తి హక్కులో వాటా లేకపోవడం వంటి అంశాలను లేవనెత్తారు . సత్యనారాయణ పాత్ర ఒక గొప్ప ప్రశ్నను దేశానికి సంధిస్తాడు . ఉద్యోగులకు ఉన్న రిటైర్మెంట్ వయసు పరిమితి రాజకీయ నాయకులకు లేదు కదా అని అడుగుతుంది ఆ పాత్ర .
పరుచూరి గోపాలకృష్ణ అమృత గుళికలు మరి కొన్ని ఉన్నాయి . మాజీ MLA అయిపోయిన నూతన్ ప్రసాద్ డైలాగ్ . మొగుడు పోయిన ఆడది ఎలక్షన్లలో ఓడిపోయిన రాజకీయ నాయకుడు జనం లోకి పోకూడదు అని . ఇప్పుడయితే ఆ డైలాగుని మహిళా సాధికారికత సంఘాలు ఉతికి ఆరేస్తాయి . నలభై ఏళ్ల కింద కాబట్టి ఎవరూ ఎగబడలేదు .
మిధ్య తరగతి వ్యక్తిగా సత్యనారాయణ , ఆయన భార్యగా డబ్బింగ్ జానకి చాలా బాగా నటించారు . ఎర్ర కుర్రాడిగా శివకృష్ణ తన మార్క్ నటనని ఇరగతీసాడు . నరసింహరాజు , రాజేంద్రప్రసాద్ , జ్యోతి , గీత , రాజ్యలక్ష్మి , నూతన్ ప్రసాద్ , పి యల్ నారాయణ , తాతినేని రాజేశ్వరి , గుమ్మడి , వేజెళ్ళ సైన్యం నటించారు .
ఈ సినిమాతో నాకు ఓ అనుబంధం కూడా ఉంది . నాకు మంచి మిత్రుడు , గుంటూరులో చార్టర్డ్ ఎకౌంటెంట్ బాబాయి ఈ సినిమాకు నిర్మాత . గుంటూరులో ప్రదర్శన హక్కులను తీసుకుందాం అని ప్రపోజ్ చేసారు . ఆయన , నేను , మరో ఇద్దరు కామన్ మిత్రులు కలిసి గుంటూరు హక్కులు వరకు తీసుకున్నాం . లిటిల్ కృష్ణా థియేటర్లో ఆడింది . ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి . మా డబ్బులు మాకు తిరిగొచ్చాయి . చెప్పుకో తగ్గంత లాభం కాకపోయినా కాస్త లాభం వచ్చింది . మళ్ళా సినిమా లోకి వద్దాం .
శివాజీ రాజా సంగీత దర్శకత్వంలో పాటలన్నీ బాగుంటాయి . విశాల భారత స్వప్నాలం విప్లవ జ్యోతుల కిరణాలం అనే విద్యార్ధుల గ్రూప్ డాన్స్ పాట ఈ సినిమాకు ఐకానిక్ సాంగ్ . అందాల బొమ్మకు కళ్యాణమంట పాట చాలా శ్రావ్యంగా ఉంటుంది .
పైసా పైసా చెయ్యర జల్సా పాట హుషారుగా ఉంటుంది . ఏ జయమాలినో , జ్యోతిలక్ష్మో వేసే డాన్సుని తాతినేని రాజేశ్వరి వేసింది . వాశ్ళతో సమానంగా వేసింది . రంగా రంగ కృష్ణా కృష్ణ అనే పాట సత్యనారాయణ , కుటుంబ సభ్యుల మీద ఉంటుంది . చక్కటి చిత్రీకరణ . పాట శ్రావ్యంగా కూడా ఉంటుంది .
ఈ సినిమాలో డా శివప్రసాద్ పాత్ర చాలా బాగుంటుంది . సత్యనారాయణకు ప్రాణమిత్రుడు . గయ్యాళి భార్యకు తెలవకుండా మిత్రుడికి అప్పిస్తూ ఉంటాడు . మరో మరచిపోలేని పాత్ర గుమ్మడిది . కోర్ట్ సీన్లో లాయరుగా చాలా బాగా నటించారు .
ఆనాటి సామాజిక సమస్యలు , రుగ్మతల్లో కొన్ని ఈనాడు లేవు . ఈనాటి కళ్ళద్దాలతో కాకుండా చూస్తే ఈనాడు కూడా సినిమా చాలా బాగుంటుంది . By the way , 2014 వరకు ఆత్మహత్యా ప్రయత్నం IPC సెక్షన్ 309 కింద నేరం . 2014 చివర్లో ఈ నేరాన్ని decriminalise చేసింది ప్రభుత్వం . సినిమా యూట్యూబులో ఉంది . చూడతగ్గ సినిమా . ముఖ్యంగా మిధ్య తరగతి బేచ్ తప్పకుండా చూడాలి . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమాకబుర్లు #తెలుగుసినిమాలు
Share this Article