Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రేయ్, ఫుడ్ బ్లాగర్లూ… నా మొహం కూడా మాడింది ఆ మసాలా దోశలాగే…

June 4, 2025 by M S R

.
ఇందాక యూ ట్యూబ్ చూస్తుంటే ” అప్పుడు ఆ కుర్రాడు ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు” అని థంబ్ నెయిల్ ఏసాడు ఓ యూ ట్యూబర్
ఏడిసాడు

“ఆ కుర్రాడు ఏదో చేస్తే నేను షాక్ అవడం ఏంటి నాన్సెన్స్ ” అని అక్కినేని స్టైల్లో అనుకుని ట్యూబ్ మూసేసి వాట్సాప్ ఓపెన్ చేశా
” తెల్లవారి మూడు గంటలకు అందరూ అక్కడికి వెళ్తారు.. ఎందుకో తెలుసా? చదవండి అని ఓ వాట్సాఫ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ తోసిన మెసేజ్ కనిపించింది

“తెల్లారి మూడు గంటలకు ఎవడెక్కడికి వెళ్తే నాకేంటి డబుల్ నాన్సెన్స్.. నేను దుప్పటి ముసుగేసుకొని హాయిగా పడుకుంటా..” ఇంతోటి దానికి ఇది చదవడం కూడా దండగ అనుకుని వాట్సాప్ కూడా కట్టేసా
ఫేస్ బుక్ చూసినా.. ఇన్స్టాగ్రామ్ చూసినా అవే రీళ్లు గిర్రున తిరుగుతున్నాయి

Ads

MBA చదివిన ఆ కుర్రాడు చేసిన పని చూస్తే మీరు ఆశ్చర్యంతో నోరు తెరుస్తారు
ఇవే కొటేషన్లు
ఇక లాభం లేదని స్టోరీ చదివా

MBA చదివిన రామ్ అనే కుర్రాడు ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసి చేసి విసిగి వేసారి నాంపల్లి దగ్గర ఓ దోశ బండిలో అసిస్టెంట్ గా చేరాడట
‘అట్టు వేయడం ఎలా?’ అని 30 రోజుల రేపిడెక్స్ కోర్స్ చదివి మెల్లిగా సొంతంగా దోశ బండి పెట్టుకున్నాడట

ఇక అక్కడ్నుంచి స్వయంకృషిలో చిరంజీవిలా అతడి దశ తిరిగి రామ్ దోశల కోసం జనాలు మొహం వాచిపోయి ఎగబడి తోసుకువస్తే ఆ ఫ్లోటింగ్ తట్టుకోలేక.. ట్రాఫిక్ జాములకు ఇబ్బంది లేకుండా తెల్లవారి మూడు గంటలకు బండి మీద దోశలు వేయడం మొదలు పెట్టాడట
ఆశ్చర్యం

తెల్లారి మూడు గంటలకు కూడా అతడి దోశ బండి దగ్గర విపరీతమైన క్యూ
దెబ్బకు మరింతమందికి దోశలు అందించాలన్న మహోన్నతమైన ఆశయంతో ఇంకో రెండు బండి బ్రాంచీలు ఓపెన్ చేసాడట
అయినా జనం.. జనం.. కుమారి ఆంటీని మించి

రోజుకు వెయ్యి రూపాయలతో మొదలైన వ్యాపారం లక్ష రూపాయలకు చేరుకుంది
జూబ్లీ హిల్స్.. బంజారాహిల్స్ లాంటి ఏరియాలలో ఖరీదైన రెస్టారెంట్లు ఓపెన్ అయ్యాయి
బండి రెస్టారెంట్ అయ్యింది కానీ దోశలు అవే
ఇదీ రామ్ కీ బండి రామ్ సక్సెస్ స్టోరీ

***
MBA కుర్రాడి సక్సెస్ స్టోరీ మొత్తం చదివి కళ్ళంబడి వస్తున్న ఆనంద భాష్పాలను తుడుచుకుంటూ కొత్తపేటలో ఉన్న రామ్ కీ బండి దగ్గరకు, సారీ రెస్టారెంట్ కు సకుటుంబ సపరివారంగా వెళ్ళాం
లోపలికి వెళ్లగానే గోడమీద రాసిన రామ్ కీ జీవిత చరిత్ర కనిపించింది

2011 లో దోశ బండి
2015 రెండు బ్రాంచీలు
2020 లో ఆరు బ్రాంచీలు
2022 లో పన్నెండు బ్రాంచీలు
2023 నుంచి కౌంటింగ్
అంటూ ఘనంగా ఆ కుర్రాడి జీవిత చరిత్ర రాశారు

వెరీ ఇన్స్పిరేషనల్ స్టోరీ.. ఇటువంటి వాళ్ళని మనం ప్రోత్సహించాలి అని భారతీయుడిలో కమలాసన్ లా ఆవేశపడుతూ ఆర్డర్ పెడదామని వెయిటర్ కోసం చూస్తే సెల్ఫ్ సర్వీసు అంటూ కౌంటర్లో ఆయన మూగ సైగలు చేశాడు
సరే అని కౌంటర్ దగ్గరకెళ్తే ఓ లామినేషన్ చేసిన అట్ట చేతిలో పెట్టాడు

అందులో ,
Ghee కారం దోశ 99/-
బటర్ కారం దోశ 99/-
బటర్ మసాలా దోశ 129/-
అన్నీ బాటా రేట్లే

సరే, టేస్ట్ చేద్దామని
ప్లెయిన్ దోశ.. బటర్ మసాలా దోశ.. బటర్ చీస్ దోశలకు పైకం చెల్లించి వారిచ్చిన టోకెన్ తీసుకుని సెల్ఫ్ కౌంటర్ చేతిలో పెడితిమి

పావు గంటకు జైళ్లో గంట కొట్టినట్టు పళ్ళెం మీద టంగ్ టంగ్ అంటూ గంట కొట్టాడు కౌంటరుడు
మా ఆర్డర్ వచ్చినట్టుంది కాబోలు అనుకుంటూ వెళ్ళి ప్లేట్లు అందుకున్నాం
ఆశ్చర్యం విశాలమైన ప్లేట్
అందులో ఈవెనింగ్ డైలీ సైజు న్యూస్ పేపర్

అందులో 777 మద్రాస్ వారి చిన్న అప్పడం సైజులో దోశ
ఆ విశాలమైన ప్రపంచంలో దోశ పిపిలీకం అయిపోయింది
ఇంట్లో దోశలు వేసేటప్పుడు గరిటలోనుంచి జారిపోయిన దోశ పిండి సైజులో ఉంది దోశ
ప్లేట్లో తడిమితే దోశ స్పర్శ తెలిసింది
నేను చేసిన దోషం ఏంటో తెలిసొచ్చింది

వాట్సాప్ యూనివర్సిటీ జ్ఞాన గుళికలు చదివి ఎమోషన్ అవకూడదనే జీవిత సత్యం తెలుసుకున్నా
కించిత్తు కోపం వచ్చింది
ఇందులో బటరేదీ అనడిగా
అందులోనే ఉంది అంటూ వెన్న పలుకులు పలికాడు
మసాలా కూరేదీ ? కారంగా అడిగా
దోశ మధ్యలో లీలగా కనిపిస్తున్న రెండు ఆలు ముక్కలు చూపించాడు వెటకారంగా
ఇదా రామ్ కీ బండి దోశ అంటే నాన్సెన్స్ అంటూ లేచి వచ్చేసా

***.
ఫలహారంలో ఉప సంహారం
ఈ మధ్య రీరిలీజ్ అయిన ఖలేజా సినిమాలో మహేష్ బాబు అంటాడు
“వార్నీ, కాఫీకి అదేదో పేరు పెట్టేసి డబ్బులు భలే దొబ్బేస్తున్నారు భయ్యా” అని
అట్లుంది రామ్ కీ బండి వ్యవహారం………….. పరేష్ తుర్లపాటి

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మీ రామజ్ఞానం ఎంత..? 108లో కనీసం 80 జవాబులు తెలిస్తే మీరు గొప్పే..!
  • ఓహ్… వెన్నుపోటుపై మాగంటి చంద్ర బాబు వ్యతిరేక సినిమా ప్లాన్ చేశాడా..?!
  • పాటలు బాగుంటాయి… కానీ అసలు కథే సైకో ప్రేమలకు గ్లోరిఫికేషన్…
  • బుల్‌డోజింగ్ పాలసీకి ఆద్యుడే కేసీయార్… కేటీయార్ మరిచినట్టున్నాడు…
  • ఎంతసేపూ బాహుబలి ప్రమోషనే… మహాశయా, ఇస్రో రాకెట్ పేరు అది కాదు…
  • బంగారు తల్లులు..! ప్రత్యర్థులనూ ఓదార్చి, కన్నీళ్లు తుడిచిన వైనం..!!
  • ఒక్కసారి లిటిగెంట్ ముద్ర పడితే… ఎంతటి ప్రశాంత్ వర్మకైనా దెబ్బే..!!
  • అయ్యో ఉషాపతి..! సంసారంలో మంటబెట్టి, ఎగదోస్తున్న మీడియా..!!
  • స్మృతి మంధాన..! కప్ గెలుపు ప్రచారంలో ఎందుకో దక్కని ప్రాధాన్యత ..!!
  • వరల్డ్ కప్ గెలుపు సంబురాల్లో… ఈ వీల్ చైర్ భాగస్వామి ఎవరో తెలుసా..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions