ఒక ఈటీవీ లేదా ఒక మల్లెమాల యాజమాన్యాలకో… లేదా ఇంకెవరో టీవీ చానెల్ ప్రబుద్ధుడికో… అంత లోతయిన అవగాహన ఉంటుందని అనుకోలేం కానీ…. పండుగపూట కాసిన్ని మంచి ముచ్చట్లు చెప్పుకోవాలనే మినిమం సోయి మాత్రం ఉండాలి కదా…! ఈమాట అనడానికిముందు ఓ సంగతి చెప్పాలి… ప్రపంచవ్యాప్తంగా పత్రికలు ఇప్పుడు ఓ ట్రెండ్ పాటిస్తున్నయ్… ఓ పెద్ద పేలుడో, ప్రమాదమో, విపత్తో… వంద మంది మరణించవచ్చుగాక, రక్తం ఏరులైపారవచ్చుగాక… ఫస్ట్ పేజీలో ఆ నెత్తుటివాసన కనిపించకూడదు… మనిషిని డిస్టర్బ్ చేయగల ఫోటోలు వేయకూడదు… ఎందుకంటే..? పొద్దున్నే మైండ్ డిస్టర్బ్ అయితే, ఆ నెగెటివిటీ తన మైండ్‌ను, తనను రోజంతా వెంటాడుతూనే ఉంటుంది…
ఇక విషయానికొద్దాం… పండుగ అంటే ఏమిటి..? మరీ ప్రత్యేకించి సంక్రాంతి అంటే..? తెలంగాణలో దసరా ఎలా పెద్ద పండుగో, ఆంధ్రాలో సంక్రాంతి అంత పెద్ద పండుగ… భోగి, సంక్రాంతి, కనుమ… పండుగ వెనుక పురాణ విశేషం పక్కన పెట్టండి… ఇది రైతుల పండుగ ప్రధానంగా…! సంక్రాంతి అంటే… ఎక్కడెక్కడో బతకడానికి వెళ్లిన కుటుంబసభ్యులు కూడా ఒకచోటకు చేరడం… కష్టసుఖాలు వెల్లబోసుకోవడం… ఓసారి చూసుకోవడం… ఆ మూడు రోజులు సంబరంగా గడిపి, మళ్లీ బతుకు వెతల్లోకి ప్రయాణం కావడం…
Ads
రైతుల పండుగ రోజు… రైతాంగంలో కాస్త పాజిటివిటీని పెంచాలి… సంక్షోభంలో ఉన్న రైతుల బతుకుల్ని పదే పదే ఇంకా కెలికి పండుగల రోజు కూడా వ్యాకులం చేయొద్దు… ఇంతటి సంక్షోభంలోనూ అనేకమంది కొత్త పద్దతుల్లో వ్యవసాయానికి కొత్త దశను చూపిస్తున్నారు… ఏక్‌సేఏక్ ఫలితాలు సాధిస్తున్నారు… కనీసం అలాంటివి చూపించినా బాగుండు… మరీ ఈటీవీలో అయితే గెటప్ సీను బ్యాచ్ కొడవళ్లతో మెడలు సామూహికంగా కోసుకోవడం ఏం బాగాలేదు… స్కిట్ ఉద్దేశం, నటుల అభినయం బాగున్నా సరే… అది సంక్రాంతి షోలో ఉండాల్సిన స్కిట్ కాదు… మరీ డిస్టర్బింగుగా ఉంది…
సేమ్, అదే పండుగ స్పెషల్లోనే ఎవరో లవర్లు పెద్దలు కాదన్నారని విషం తాగి ఆత్మహత్య చేసుకునే స్కిట్ ఉంది… ఏం చెబుతున్నారు స్వామీ యువతకు ఈరోజుల్లో కూడా…! ఎందుకు చావాలి పిల్లలు..? మన టీవీ క్రియేటివ్ టీమ్స్‌లోనే ఏదో మందులేని వైరస్ బలంగా పాతుకుపోయి ఉన్నట్టుంది… సరే, ఇవి పక్కన పెడదాం…
సంక్రాంతి అంటే… గొబ్బెమ్మలు, సకినాలు, పల్లీల ముద్దలు, భక్ష్యాలు, ముగ్గులు, పతంగులు, నవధాన్యాల నడుమ పాలపొంగు, ఎడ్లపందేలు, కోళ్లపందేలు, ప్రత్యేక వంటకాలు… వాట్ నాట్..? అల్లుళ్లకు మర్యాదలు సరేసరి…! కానీ ప్రస్తుతం అందరికీ ఏకైక ఉమ్మడి వినోదం కాబట్టి, టీవీలు పెడతారు… ఆ పండుగపూట టీవీలు చూసే కొత్త తరం పిల్లలు ఏం చూస్తున్నారో తెలుసా..?
యాంకర్ల వెకిలి వేషాలు, బూతు పాటలు, మాటలు, వెగటు స్కిట్లు….. నిజం… ఈటీవీ, స్టార్‌మాటీవీ, జీతెలుగు… ఈ మూడు చానెళ్లూ ఈ సంక్రాంతి డబ్బు కుమ్ముకోవడానికి పోటాపోటీగా రంగంలోకి దిగాయి… పండక్కి పదీపదిహేను రోజుల ముందు నుంచే ప్రోమోలు కుమ్మేస్తున్నయ్… ఆమధ్య ఏదో పండక్కి ఇలాగే ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేసి, రేటింగుల్లో దారుణంగా చేతులు కాల్చుకున్న జెమిని ఈ సంక్రాంతికి బరిలోకి రావడం లేదేమో… ఇప్పటికి ఒక్క ప్రోమో కూడా లేదు… ఐనా పండుగ స్పెషల్స్ చేయాలంటే సీరియళ్ల నటీనటులు, ఓ కామెడీ బ్యాచ్ అవసరం… సరే, దీన్ని వదిలేస్తే…
ఇన్ని ప్రొమోలు చూస్తే… అసలు ఇవి సంక్రాంతి స్పెషల్సేనా అన్నట్టున్నయ్… సంక్రాంతి రంగురుచివాసనచిక్కదనం ఏమీలేవు… ఈటీవీలో పూర్ణ ముసుగు వేయొద్దు వయస్సు మీద అంటూ నడుమొంపుల్లోకి రారమ్మంటోంది… ఇక మాటీవీలో ఆమె ఎవరో గానీ… ఎక్కడెక్కడో చేయి వెయ్రా, అక్కడేదో చేసెయ్రా అంటూ కసికసిగా కన్నుకొడుతోంది… ఈటీవీలో కామెడీ అంటేనే బూతు కదా… ఓ కొత్త బిచ్చగాడు ఇంకో కొత్త బిచ్చగత్తెను పట్టుకుని హైపర్ ఆదితో అంటున్నాడు… మీరు బయట పండుగ చేసుకుంటుంటే, నేను లోపల పండుగ చేసుకుంటున్నా… ఇక ఆది, అనసూయ సరేసరి…
కార్తీకదీపం లిటిల్ స్టార్ హిమను ఆడపిల్ల పుట్టిందనే సాకుతో ఆ తండ్రి చూడడానికి కూడా రాలేదు తన నిజజీవితంలో… పిటీ… అవును గానీ రోజా… మీ టీంలో ఒక కమెడియన్ రాకేష్ తమ్ముడికి పెళ్లయితే… వాళ్లను తీసుకొచ్చి మళ్లీ పెళ్లి చేయాలా ఇక్కడ..? పోనీ, ఈటీవీ కార్యక్రమాలతో ఆ పిల్లాడికి ఏమైనా సంబంధం ఉందా..? ప్చ్, చివరకు ఈటీవీ స్పెషల్స్‌ను మరీ ఇలా తయారు చేయడమేంట్రా బాబూ… అవునులే, సుధీర్‌ను పక్కన పెట్టడమే దానికి పెద్ద తార్కాణం… పైగా అదే రాకేష్ యాంకర్ ప్రదీప్‌ను భజిస్తూ బుర్రకథ…
ఒక అవినాష్, ఒక అరియానా లవ్ ట్రాకు… అమ్మతో వచ్చి సరదాగా గడిపిన అభిజిత్… వోకే, వాళ్లు మొన్నమొన్నటివరకూ రోజూ వార్తల్లో ఉన్నవాళ్లు కాబట్టి, జనం ఆసక్తిగా చూస్తారు కాబట్టి వోకే… లాస్య, రవి కూడా కొట్టుకుని, చాలా ఏళ్ల క్రితం విడిపోయి, మళ్లీ కలుస్తున్నారు కాబట్టి అదీ వోకే… అసలు టీవీ లవ్ ట్రాకులకు ఆద్యులు వాళ్లు… ఏ బెల్లంకొండ సీనయ్యో, ఏ పోతినేని రామయ్యో వచ్చి హీరోవేషాలు వేస్తారు, అదీ వోకే… సినిమా సెలబ్రిటీలు కదా… ఎటొచ్చీ… పండుగపూట ఆ ఆత్మహత్యల స్కిట్లేమిటో… వెగటుపాటల సంస్కృతి ఏమిటో… కచ్చితంగా ఈటీవీ, మల్లెమాల సంస్థలకే ఏదో వైరస్ సోకినట్టుంది… అఫ్ కోర్స్, మిగతా చానెళ్లు శుద్ధపూసలని కాదు…!!
Share this Article