.
Director Devi Prasad.C.
కొన్నేళ్ళక్రితం మా ఏరియాలోవున్న ఓ డి.వి.డి.ల షాప్ ముందు సాయంకాలాలు దాదాపు ఓ పదిమంది నుంచొని కబుర్లాడుకుంటూఉండేవారు. సినిమాలు రాజకీయాలు మొదలుకొని ప్రధానమంత్రి ప్రవర్తన వరకూ అన్నివిషయాలనూ చీల్చి చండాడుతూ వుండేవారు.
వాళ్ళలో ఓ విచిత్రమైన వ్యక్తి ఉండేవాడు. అతనిపేరు “X” అనుకుందాం. (అసలు పేరు చెప్పటం మర్యాద కాదు గనుక) ఓసారి మా ఏరియాకి కొత్తగా వచ్చిన ఓ మిత్రుడికి దూరం నుండి ఆ బ్యాచ్ ని చూపించి “ఆ పదిమందిలో “X” అనే ఓ వ్యక్తి ఉన్నాడు. అతనెలాఉంటాడో, ఎలాంటి బట్టలు వేసుకున్నాడో, ముఖ కవళికలెలావుంటాయో ఏమీ నీకు చెప్పను. ఒకే ఒక్క క్లూ మాత్రం ఇస్తాను. దాన్ని బట్టి నువు అక్కడికి వెళ్ళి నుంచుని వాళ్ళ సంభాషణలు వింటే పదేపది నిమిషాలలో ఆ “X” ఎవరో నీకు ఇట్టే తెలిసిపోతుంది” అన్నాను.
Ads
అదెలాసాధ్యం? ఏంటా క్లూ? అన్నాడు మిత్రుడు. “సింపుల్. ఆ పదిమందిలో ఎవరు ఏ టాపిక్ గురించి ఒక అభిప్రాయాన్ని చెప్పినా వెంటనే అతను రివర్స్ లో అది తప్పు అన్నట్లు ఖండిస్తూ మాట్లాడతాడు…
ఉదాహరణకి…. ఒకడు: అదిగో ఆ తెల్ల బిల్డింగ్ వెనకే నేనుండేది.
X : భలే జెప్పావే తెల్ల బిల్డింగ్ అని. మరా బిల్డింగ్ కి చుట్టూ వున్న ఎర్ర రంగు బోర్డర్ ఎవుడికిస్తావ్? కిటికీలకున్న నల్లరంగు ఎవుడికిస్తావ్?
మరో సందర్భంలో…
ఒకడు: ఆ ఎర్ర రంగు బోర్డరున్న తెల్ల బిల్డింగ్ వెనకే నేనుండేది.
X : నీయవ్వ మరీ చిన్నపిల్లలకి జెప్తున్నట్టు చెప్తున్నావ్‌గా….. ఇంకా జెప్పు. ఆ గడపలకేసిన రంగులు కిటికీ కర్టెన్ల రంగులూ….
ఒకడు: చంద్రబాబు ఒచ్చినాక కొంచం రోడ్లు బాగు పడ్డట్టే అనుకుంటా….
X : ఏందయ్యా బాగుపడిందీ? మొన్న బీమవరం కారులోపోతే నడాలిరిగినంత పనైంది. భలే జెప్పొచ్చావ్లే….
మరో సందర్భంలో…
ఒకడు: చంద్రబాబు వొచ్చాక కూడా పెద్దగా రోడ్లు బాగుపడిందేం లేదురా ….
X : ఏందిరా బాగుపడేది… అసలే ఆడ నిధుల్లేక సత్తంటే… నోరుంది గదాని ఓ విమర్శించేయడమే… ఇంకా ఆపురా సామీ ….
అలా ఉంటుంది అతని ధోరణి అని చెప్పి పంపించాను వాళ్ళ దగ్గరికి…
కొంచెం దూరంలో నిలబడి వాళ్ళ సంభాషణలు విన్న మా మిత్రుడు పది నిమిషాలలోపే పరిగెట్టుకొచ్చి “ఫలానా తెల్ల చొక్కావాడే కదూ ఆ “X “గాడు” అని కరెక్ట్ గా చెప్పాడు. “వాడేంట్రా బాబూ మరీ ప్రతి దానికీ ఎడ్డెమంటే తెడ్డెమంటున్నాడు, ఎలా భరిస్తున్నారో వాడిని” అన్నాడు నవ్వుతూ…
అక్కడే కాదు, ప్రతీ చోటా అలాటి “ఎడ్డెమంటె తెడ్డెం”గాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. మరీ ముఖ్యంగా ఫేస్‌బుక్ లో రెగ్యులర్‌గా తగులుతుంటారు చూడండి.
ప్రతీ మనిషికీ వారివారి నేపధ్యాలు, వారివైన అనుభవాలు, వారి విచక్షణా జ్ఞానాలవ ల్ల కొన్ని సొంత భావాలు ఏర్పడతాయి. ఎవరు ఏకీభవించకపోయినా వాటిని వ్యక్తపరచడమూ, చర్చించటమూ తప్పు కానేకాదు.
కానీ ఈ “ఎడ్డేమంటె తెడ్డెం”గాళ్ళు ఆ కోవకు చెందినవారు కారు.
కువిమర్శలతో వెక్కిరింతలతో ఏవో పిచ్చి కామెంట్స్ పెట్టి ఎదుటివాడిని గిల్లి గిచ్చి స్వయంతృప్తిని పొందుతున్నామనుకొనే భ్రమలో ఉంటారు వాళ్ళు. చివరకు పిచ్చి బూతులు, కూతలతో…
అలాంటివాళ్ళలో దాదాపు 90% మంది వారి ప్రొఫైల్స్ లాక్ చేసుకొనే ఉండటం గమనించవచ్చు.
సద్విమర్శకు కువిమర్శకు తేడా తెలిసినవాళ్ళు వాళ్ళ కవ్వింపులకు లోబడి వాళ్ళతో వాదనలకు దిగి విలువైన కాలాన్ని వృధా చేసుకోరని వాళ్ళకు తెలియదు.
నేనైతే ఎవ్వరైనా పరిధి దాటి శృతి మించితే జ్యూకర్‌బర్గ్ ఇచ్చిన బ్లాక్, డిలీట్ ఆప్షన్స్‌ని వెంటనే వాడేస్తాను.
ఎవడో ముక్కూమొహం తెలియనివాడు మురికిబంతిలాటి ఓ మురికి కామెంట్‌ని మనమీదికి విసిరితే దాన్ని పట్టుకుని , మనకి కూడా మురికి అంటించుకుంటామా… పట్టుకోకుండా అసలు పట్టించుకోకుండా ఉంటామా అనేది మన విజ్ఞత…
మన జీవితపు ఎక్కౌంట్ లో మనకింకా ఎంత మిగిలివుందో ఏమాత్రం తెలియని “కాలాన్ని” వ్యర్ధమైన అంశాలపై ఖర్చు చేయటం వ్యర్ధం… _____ దేవీ ప్రసాద్…. ఆ జుకర్‌బర్గ్‌కు ఎవరైనా తన ఇంగ్లిషులో చెబితే బాగుండు….
Share this Article