Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పర్ సపోజ్… మన బాలయ్యే బోయపాటితో నీరజ్ చోప్రా బయోపిక్ తీస్తే…!

August 10, 2021 by M S R

ఒలింపిక్ స్వర్ణుడు నీరజ్ చోప్రా పేరు దేశమంతా మారుమోగిపోతోంది కదా… సోషల్ మీడియా అయితే పండుగ చేసుకుంటోంది… ‘సంఘీ’ అని హఠాత్తుగా తిట్టిపోసే కేరక్టర్లు ఎలాగూ ఉంటాయి కదా, వాళ్లను వదిలేస్తే సరదాగా తన మీద మీమ్స్, జోక్స్ వేస్తున్నవాళ్లు బోలెడు మంది… @Maurya Mondal అని ఒకాయన ఏకంగా నీరజ్ చోప్రా బయోపిక్‌ను అక్షయ్ కుమార్ హీరోగా తీస్తే ఎలా ఉంటుందో ఓ కథ రాసేశాడు… ఇప్పుడు నడుస్తున్నది బయోపిక్కుల ట్రెండే కదా… భలే ఉంది… అసలు బయోపిక్ అంటే మనవాళ్లు ఎప్పుడూ ఉన్నదున్నట్టు తీయరు కదా… రకరకాల సినిమాటిక్ ట్విస్టులు, కంటెంటు, కమర్షియల్ ఎలిమెంట్స్ గట్రా బోలెడు దట్టిస్తారు… ఇక అదే సినిమా మన తెలుగు హీరోలు తీస్తే అంతకు పదీఇరవై రెట్లు హీరోయిజాన్ని కుక్కుతారు… అకస్మాత్తుగా దాన్ని నీరజ్ చోప్రాకు చూపిస్తే, అది నేనేనా అని జుత్తు పీక్కొని, కిందపడి కొట్టుకుంటాడు… అలా ఉంటుందన్నమాట… వాళ్లూవీళ్లూ అని ఏమీలేదు, మహేషుడు, రామచరణుడు, జూనియర్ ఎన్టీయారుడు, ప్రభాసుడు, అల్లు అర్జునుడు… ఎవరైనా అంతే… ఇక చిరంజీవి, బాలయ్య, పవన్ కల్యాణ్ అయితే చెప్పనక్కర్లేదు… మనం మన బాలయ్యనే తీసుకుందాం… పోనీ, అఖండ సినిమా తరువాత బోయపాటి కాంబినేషన్‌లో దీన్ని స్టార్ట్ చేస్తారని అనుకుందాం… కుర్ర హీరోయిన్లు బాలయ్య పక్కన చేయడానికి భయగౌరవభక్తితో ఎవరూ రావడం లేదు కాబట్టి, అందరికీ అందుబాటర్ వెటరన్ కాజల్ హీరోయిన్ అనుకుందాం… అప్పుడు కథ ఎలా ఉంటుంది..? సరదాగా…

balayya

ఓపెనింగ్ సీన్… రాయలసీమలోని ఓ చిన్న పల్లెటూరు… పిల్లలు ఊరి బయట క్రికెట్ ఆడుతున్నారు… ఓ బ్యాట్స్‌మన్ సిక్స్ కొట్టాడు… ఆ బాల్ వెళ్లి సమీపంలోని పొలాల్లో పడింది… అక్కడ శెనగ చేనులో పనిచేసుకుంటున్నాడు ఓ పిల్లాడు, తన తండ్రి… పిల్లలు అరిచారు, ‘‘ఏయ్, తమ్ముడూ, ఆ బాల్ ఇటు విసురు’’ అని..! ఆ పిల్లాడు బాల్ చేతుల్లోకి తీసుకున్నాడు… క్రికెట్ ఆడుతున్న మరో పిల్లాడు అరిచాడు… ‘‘విసరకు, నీ బలం సరిపోదు, ఇక్కడి దాకా రాదు, తీసుకొచ్చి ఇవ్వు’’ అని… ఈ పిల్లాడు వినిపించుకోలేదు, తన పెదాలపై ఓ నవ్వు… విసిరాడు… అది ఈ పిల్లలు ఆడుతున్న ప్లేసులోకి రావడమే కాదు, నేరుగా వచ్చి మిడిల్ స్టంప్ ఎగురగొట్టింది… అందరూ నిశ్చేష్టులైపోయారు… జైవీర్ చౌదరి అనే అథ్లెటిక్స్ కోచ్ అదే సమయంలో అటుగా వెళ్తూ దీన్ని గమనించాడు… ఆశ్చర్యపోయాడు… గతంలో బోలెడన్ని చేదు అనుభవాలున్న ఆయన ఈ పిల్లాడి థ్రో కెపాసిటీ చూసి… చాటుగా వెంబడిస్తాడు… ఆ పిల్లాడు మామిడి చెట్ల కాయల్ని రాళ్లతో గురిచూసి కొట్టి కిందపడేయడం, తండ్రి పనిచేస్తుంటే ఇటుకలు విసిరే తీరు గట్రా చూస్తుంటాడు… ఈయనకు కూడా ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, బోలెడు కుట్రలు, అవమానాలపాలై తాగి తిరుగుతూ, రోడ్డు మీద కాళ్లతో రాళ్లను తంతూ, విషాదగీతాలు పాడుతూ ఉంటాడన్నమాట…

ఈ పిల్లాడిని చూడగానే తనలో ఎమోషన్… వీడిని నా అంతవాడిని చేస్తాను… ఈ లోకానికి నేనేమిటో చూపిస్తాను అనుకుంటాడు… శపథం చేస్తాడు… ఆ పిల్లాడి తండ్రిని కన్విన్స్ చేస్తాడు… తను కడపలో నడిపే స్పోర్ట్స్ అకాడమీలో చేర్చుకుంటాడు… ‘అన్నా, నా దగ్గర డబ్బు లేదు, కనీసం షూస్ కొనాలన్నా దిక్కులేదు… పైగా రోజూ నా తండ్రికి నేను పొలం పనుల్లో సాయం చేయాలి’’ అంటూ మొదట్లో నిరాకరిస్తాడు, కానీ తండ్రి ‘‘మన జాతి పరువు నిలపాలి నాన్నా..’’ అని తనే ఎంకరేజ్ చేస్తాడు… ముతక బట్టలు, విరిగిన స్లిప్పర్లతో అకాడమీలో చేరిన ఈ పిల్లాడిని చూసి అక్కడున్న డబ్బు బలిసిన పిల్లలు నవ్వుతారు, గేలిచేస్తారు… కానీ తను జావెలిన్ విసిరిన దూరం చూసి ఒక్కసారిగా వాళ్ల నోళ్లు మూతపడతాయి, ప్రాక్టీస్ స్టార్టవుతుంది… ‘‘ఒకటే జననం, ఒకటే మరణం, గెలుపు పొందువరకూ, అలుపు లేదు మనకు’’ స్టయిల్‌లో అనంత శ్రీరామ్ రాసి, థమన్ ట్యూన్ చేసిన ఏదో ఓ కాపీ సాంగ్ ఒకటి వెనుక నుంచి వినిపిస్తూ ఉంటుంది…

ఆ పిల్లాడే పెరుగుతూ పెరుగుతూ ఉంటాడు… తనే బాలయ్య… జాతీయ స్థాయిలో జావెలిన్ విసిరేస్తూ బోలెడు బొచ్చెడు అవార్డులు కొట్టేస్తూ ఉంటాడు… ఆర్మీ చీఫ్ వాళ్ల ఇంటికి వచ్చి బాలయ్య తండ్రిని, కోచ్‌ను ఒప్పించి బాలయ్యను ఆర్మీలో చేర్చుకుంటాడు… మోడీ, అమిత్ షా, అజిత్ ధోవల్, నరవాణె పదే పదే బాలయ్య ఆర్మీలో చేరాలని అడుగుతున్నారు అని కూడా చెబుతాడు… ఒకరోజు బాలయ్య ఓ కంటోన్మెంట్ బయట ఫ్రెండ్స్‌తో కలిసి ముచ్చట్లు చెబుతూ ఉంటాడు… కాజల్ అటుగా వెళ్తుంటే కొందరు రౌడీలు ఆమె వెంటపడతారు… బాలయ్య విసిరిన జావెలిన్ వాళ్ల మధ్యలో పడి ఖబడ్దార్ అన్నట్టుగా ఊగుతూ ఉంటుంది… వాళ్లంతా భయంతో పరార్… ఆమె కనీసం థాంక్స్ కూడా చెప్పకముందే అక్కడి నుంచి ప్రాక్టీస్‌కు వెళ్లిపోతాడు బాలయ్య… బాలయ్య వైపే ఆరాధనగా చూస్తూ ఉండిపోతుంది కాజల్… ఓ రొమాంటిక్ సాంగ్…

Ads

తరువాత రోజు కంటోన్మెంట్‌లో ఓ మేజర్ ఫంక్షన్ జరుగుతుంది… మార్చ్ పాస్ట్ జరుగుతూ ఉంటుంది, బాలయ్య లీడ్ చేస్తుంటాడు… ఓ కమాండింగ్ ఆఫీసర్ పక్కన కూర్చున్న కాజల్‌ను చూస్తాడు… కళ్లూకళ్లూ కలుస్తాయి తొలిసారిగా… పరిచయం పెరుగుతుంది… తనతో ‘‘ఒలింపిక్స్‌లో స్వర్ణం నా కల, అదయ్యాకే మన పెళ్లి’’ అంటాడు… ‘‘బాలూ, నీ కల వేరు, నా కల వేరు కాదుగా, ఆ బంగారం గెలిచేదాకా వేచిచూస్తా బంగారం’’ అని హగ్ చేసుకుంటుంది… బాలయ్య బోలెడు అంతర్జాతీయ పోటీలకు వెళ్తుంటాడు… ఎక్కడికెళ్లినా గెలుపే… ఈలోపు పాకిస్థాన్‌తో మనకు యుద్ధం వచ్చిపడుతుంది… బాలయ్య నేను యుద్ధానికి వెళ్తాను అంటాడు… ‘‘వద్దు బాలూ, నీకేమైనా అయితే మనకు దక్కబోయే స్వర్ణం ఏమైపోవాలి..? మేమొప్పుకోం’’ అని కాళ్లావేళ్లా పడుతుంటారు… వారిస్తుంటారు… నో, నాకు ‘‘దేశంకన్నా’’ ఏదీ ఎక్కువ కాదు అంటాడు బాలయ్య, ఇక అందరూ స్టిఫ్‌గా నిలబడి సెల్యూట్ చేస్తారు… సీన్ కట్ చేస్తే సరిహద్దుల్లో జోరుగా యుద్ధం… పాకిస్థానీ సైనికులు చుట్టుముడతారు, తనతోపాటు ఉన్న సైనికులు తలోదిక్కూ చెల్లాచెదురై ఉంటారు… బుల్లెట్లు పడుతుంటయ్, బాలయ్య కదా, బుల్లెట్‌కూ బుల్లెట్‌కూ నడుమ పరుగు తీస్తుంటాడు… ఓ పెద్ద చెట్టు కనిపిస్తుంది, ఎక్కేస్తాడు… ఒక్కో కొమ్మ విరిచి, జావెలిన్‌గా విసురుతుంటాడు… అవి తగిలి ట్యాంకులు సుమోల్లాగా పేలి, గాలిలోకి ఎగురుతుంటయ్… సైనికుల గుండెల్లోకి దూరుతూ ఉంటయ్… ఎట్టకేలకు ఆ కీలకమైన పోరులో గెలుపు మనదే అవుతుంది, కానీ బాలయ్యకు తీవ్ర గాయాలు… స్పృహ తప్పి అక్కడే కూలిపోతాడు… ఇంట్రవెల్…

ఆర్మీ హాస్పిటల్… నువ్వు ఇక జీవితంలో జావెలిన్ పట్టుకోలేవు, విసరలేవు అని చెబుతుంటారు డాక్టర్లు… కోచ్ ప్రకాష్ రాజ్ నిశ్శబ్దంగా ఏడుస్తుంటాడు… కాజల్ గోడకు తలను కొట్టుకుంటూ ఉంటుంది… అక్కడికి వచ్చిన జాతీయ క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ హతాశుడై చూస్తుంటాడు… కానీ బాలయ్య నిరుత్సాహపడడు… నాకేమీ కాదు, స్వర్ణం కోసం ప్రాణాలైనా ఇస్తానంటాడు… ఎమోషన్, వెనుక వంద వయోలిన్లు మోగుతుంటయ్… అందరూ కళ్ల నీళ్లు తుడుచుకుంటారు… బాలయ్యను కాజల్ మెల్లిగా నడిపించుకుంటూ స్టేడియంలోకి తీసుకువస్తుంది… ఒకవైపు ప్రార్థనాలయాల్లో పూజలు, ఇటు కోచ్ శ్రమ… బాలయ్య కిందామీదా పడుతుంటాడు… డాక్టర్లు వచ్చి కాటన్‌తో రక్తాలు తుడుస్తూ ఉంటారు… ఈలోపు ఓ టెలిగ్రామ్ వస్తుంది, బాలయ్యను ఒలింపిక్స్‌కు క్వాలిఫై చేసినట్టు…

ప్రధాన పోటీ జర్మనీ క్రీడాకారుడితో అన్నమాట… అప్పటిదాకా అందరినీ బెదిరిస్తూ, కొడుతూ, పోటీ నుంచి తప్పిస్తూ, తనే స్వర్ణాలు కొడుతూ, పెత్తనం చేస్తుంటాడన్నమాట… తనతో దోస్తీ చేసే మరో ఆఫ్రికన్ జావెలిన్ థ్రోయర్ రజతం గెలుస్తూ ఉంటాడు… ఆ రౌడీ జర్మనీయుడి తండ్రి జగపతిబాబు పెద్ద గ్యాంగ్‌స్టర్… చుట్టలు తాగుతూ, హోస్టెస్‌ల చెంపలు నిమురుతూ, ఛాపర్లలో, స్పెషల్ ఫ్లయిట్లలో దేశదేశాలు తిరుగుతూ ఉంటాడు… ఈ ఆఫ్రికన్, ఈ జర్మన్ కలిసి అడవుల్లో జావెలిన్లను సింహాల పైకి విసురుతూ క్యాంప్ ఫైర్లు గట్రా ఎంజాయ్ చేస్తుంటారన్నమాట… ఇక్కడొక ఐటం సాంగ్ పడుతుంది… ‘దిగు దిగు దిగు నాగా’ శైలిలోనే ఉంటుందన్నమాట… వీలయితే… నీ బంగారు జావెలిన్ ఏదిరా, ఇంకా త్వరగా కస్సున దింపవేమిరా అని రీతూవర్మతో డాన్స్ పెడతారు… బాలయ్యను చూసి ఓరోజు క్వాలిఫై పోటీల దగ్గర జా ‘ విలన్ ‘ పకపకా నవ్వుతాడు… ‘‘ఎక్కడి నుంచి వచ్చావుబే’’ అంటాడు… బాలయ్య సహిస్తాడు, తను క్వాలిఫయర్లలో టాపర్‌గా నిలుస్తాడు… అప్పుడు ఈ జర్మనీ విలన్ తొలిసారిగా ఆందోళనకు గురై జర్మనీ నుంచి గ్యాంగును పిలిపిస్తాడు… వాళ్లంతా కరాటే, కుంగ్‌ఫూ, కిక్ బాక్సింగ్ నేర్చినవాళ్లు… స్పోర్ట్స్ విలేజీలో బాలయ్యను అటాక్ చేస్తారు… బాలయ్య సింహనాదం చేసి అందరినీ మట్టికరిపిస్తాడు… అందరూ గాలిలోకి ఎగిరిపోతారు, కొందరు అంతరిక్షంలోకి, ఇంకొందరు అంగారక గ్రహంలోకి…

ఈలోపు బాలయ్యకు తోడుగా హాకీ టీం తమ స్టిక్కులను పట్టుకుని వస్తుంది… మిగిలిన నలుగురైదుగురు రౌడీలను చితగ్గొట్టేస్తుంది… మళ్లీ బాలయ్యకు గాయాలు… ఈ హాకీ టీం సభ్యులు జోకులు వేస్తూ, చికిత్సలు చేయిస్తూ బాలయ్యలో ఉత్సాహాన్ని ప్రేరేపిస్తూ ఉంటారు, ఈలోపు ఊళ్లో తన తండ్రి పొలంలో కాపుకొచ్చిన పంట కాలిపోయినట్టు సమాచారం వస్తుంది… బాలయ్య కుప్పకూలతాడు… తండ్రి తనవైపు ఆక్రందనతో చూస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది… అదేసమయంలో ఫైనల్స్… పదే పదే తండ్రి, పొలం గుర్తొచ్చి డిస్టర్బ్ అవుతుంటాడు… దేశమంతా నీవైపే చూస్తోంది అని కోచ్ చెబుతుంటాడు… తను ఒలింపిక్స్‌కు వచ్చేటప్పుడు ప్రధాని చెప్పిన స్పూర్తివాక్యాలు ఇంకోవైపు గుర్తొస్తుంటయ్… మీడియా ఫోకస్ చేస్తుంది… గుళ్లల్లో, చర్చిల్లో, మసీదుల్లో ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి… వరుసగా మూడు థ్రోలు ఫ్లాప్… జర్మనీ విలన్, ఆఫ్రికా సెకండ్ విలన్ నవ్వుతూ ఉంటారు… జనం టీవీలకు అతుక్కుపోతారు… బాలయ్య కళ్లల్లో ఒక్కసారిగా జాతీయపతాకం మెరుస్తుంది… జావెలిన్ పట్టుకుని విసురుతాడు… వంద మీటర్లు… తిరుగులేని రికార్డు… జాతీయ గీతం వినిపిస్తూ ఉంటుంది వెనుక నుంచి… దేశవ్యాప్తంగా సంబరాలు… హీరోయిన్ కాజల్ వచ్చి హత్తుకుంటుంది… ఇద్దరూ స్టేడియం నుంచి బయటికి వస్తుంటారు… ‘‘ఒరే, నా బంగారం.., ఒసే, నా నయగారం.., చేస్తానురా గారాం.., వదిలెయ్యవే మారాం..’’ అని ఏదో హమ్మింగ్ బ్యాక్ గ్రౌండ్‌లో వినిపిస్తూ ఉంటుంది… శుభం… (కాపీ రైట్స్ ఏమీ లేవు, ఎవరైనా సరే వాడుకోవచ్చు కథను… సినిమా, సీరియల్, వెబ్ సీరీస్ ఏదైనా సరే… చివరకు ఆస్కార్ అవార్డు వచ్చినా సరే, ఈ కథ నాది అని గొడవ చేయను…, కానీ కథ నచ్చితే దిగువన డొనేట్ బటన్ ఉంటుంది, ఓసారి ఉదారంగా వాడండి…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions