Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ శంకరాభరణంలో శంకరశాస్త్రి భార్యే గనుక బతికే ఉండి ఉంటే..?

January 30, 2024 by M S R

శంకరశాస్త్రి భార్య బతికే ఉంటే? ‘శంకరాభరణం’ చూశారుగా! అందులో శంకరశాస్త్రి భార్య బిడ్డను కనే సమయంలో మరణిస్తుంది. ఆయన మరో పెళ్లి చేసుకోకుండా కూతుర్ని పెంచుతాడు. ఆ సమయంలో వేశ్యా వృత్తి చేసుకునే ఇంట పుట్టిన తులసి ఆయన ఇంట్లో ఆశ్రయం పొందుతుంది. జనం అనుమానపడతారు. ఆయన్ని అవమానాలపాలు చేస్తారు. ఇదంతా గ్రహించిన తులసి ఆయనకు చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్లిపోతుంది. ఆపై కథ మనకు తెలుసు!

ఒకవేళ శంకరశాస్త్రి భార్య బతికే ఉంటే ఆయన తులసిని ఇంటికి తీసుకొచ్చేవారా? భార్య ఒప్పుకునేదా? ఒకవేళ ఒప్పుకుంటే అప్పుడూ జనం ఆయన్ని అనుమానించి, అవమానించేవారా? లేక భార్య ఉందిలే, ఆమె చూసుకుంటుంది అని ఊరుకునేవారా? ఆ ఇంట్లోనే తులసి బిడ్డను కని, అతణ్ని శంకరశాస్త్రి శిష్యుణ్ణి చేసేదా? ఇవన్నీ కాసేపు ఆలోచించదగ్గ ప్రశ్నలు. వీటి గురించి లోతైన చర్చ ఈ సినిమా విడుదలైన మూడేళ్ల తర్వాత జరిగింది. అదీ సినిమా రూపంలో దొరికింది. దాని పేరు ‘మేఘసందేశం’.
jayaprada
‘ప్రేమాభిషేకం’ వంద రోజుల వేడుక విజయవాడలో జరిగినప్పుడు అక్కడున్న జనంలో ఎవరో “ఎంతకీ ఇలాంటి కమర్షియల్ సినిమాలే తప్ప విశ్వనాథ్ లాగా ‘శంకరాభరణం’ లాంటి క్లాసిక్ సినిమా తీయడం రాదురా దాసరి నారాయణరావుకి” అన్నారట. దాంతో దాసరిలో ఆలోచన మొదలైంది. విశ్వనాథ్ 1966లో ‘ఆత్మగౌరవం’ సినిమాతో దర్శకుడిగా మారితే, ఆపై ఆరేళ్లకు 1972లో ‘తాత-మనవడు’తో దాసరి దర్శకుడిగా మారారు. వయసులోనూ, అనుభవంలోనూ విశ్వనాథ్ దాసరి కంటే పెద్దవారు.
jayaprada
శంకరాభరణం సినిమా ఎవరూ చేరుకోలేనంత అత్యున్నత స్థాయికి చేరింది. దాన్ని మించిన సినిమా తీయడం కష్టం. కనీసం ఆ స్థాయి సినిమా అయినా తీయాలని నిశ్చయించుకున్నారు దాసరి. అదే సమయంలో అక్కినేని నాగేశ్వరరావు 200వ సినిమా తీయమని పిలుపు వచ్చింది. అంత ప్రతిష్ఠాత్మకమైన సినిమా అంటే భారీ హంగులతో తీయాలని అనుకుంటారంతా! కానీ ఆయన మాత్రం ఏమాత్రం కమర్షియల్ ఎలిమెంట్స్ లేని కథతో ముందుకు వెళ్దాం అనుకున్నారు. అలా తీసిందే ‘మేఘసందేశం’.
meghasandesam
శంకరాభరణం & మేఘసందేశం సినిమాల మధ్య చాలా పోలికలు కనిపిస్తాయి. కథ కూడా దాదాపు ఒకేలా ఉంటుంది. శంకరాభరణంలో శంకరశాస్త్రి సంగీత విద్వాంసుడు. మేఘసందేశంలో అక్కినేని పోషించిన రవీంద్రబాబు పాత్ర కవి, కళారాధకుడు. శంకరశాస్త్రికి ఒకే కూతురు, రవీంద్రబాబుకూ ఒకే కూతురు. అక్కడ తులసి పాత్ర వేశ్యా వృత్తి చేసే కుటుంబంలో పుట్టింది. ఇక్కడ పద్మ(జయప్రద) దేవదాసీ వ్యవస్థలో పుట్టిన స్త్రీ. అక్కడ తులసికి సంగీతం, నాట్యం ఇష్టం, ఇక్కడ పద్మకూ సంగీతం, నాట్యం ఇష్టం. శంకరశాస్త్రి ఇంట్లో నుంచి తులసి వెళ్లిపోతే, రవీంద్రబాబు ఉన్న ఊరిలోంచి పద్మ వెళ్లిపోతుంది. శంకరాభరణం సినిమా ఎండింగ్‌లో శంకరశాస్త్రి, తులసి చనిపోతారు. మేఘసందేశంలోనూ చివరకు రవీంద్రబాబు, పద్మ చనిపోతారు.
dasari
శంకరాభరణంలో లేనిది, మేఘసందేశంలో ఉన్న కీలకమైన తేడా రవీంద్రబాబు భార్య పార్వతి(జయసుధ) పాత్ర. సినిమా కథ విన్నప్పుడు అందరూ ఆ సినిమాలో జయప్రదకు చాలా పేరొస్తుంది అనుకున్నారు. ఎందుకంటే సినిమా అంతా రవీంద్రబాబు & పద్మ పాత్రల చుట్టూనే తిరుగుతుంది. జయసుధ గారికి ఉండే సన్నివేశాలు తక్కువ.
sankarabharanam
సినిమాలో జయప్రద నాట్యానికి, అందానికి, అభినయానికి తగ్గ సన్నివేశాలున్నాయి. జయసుధ మాత్రం మౌనంగా ఉండాలి. అణకువగా మెలగాలి. ఇలాంటి స్థితిలో ఆమెకేం పేరొస్తుంది అనుకున్నారంతా. కానీ అందరి అంచనాలు తారుమారు చేసి, సినిమాలో ఎక్కువ పేరు జయసుధకే వచ్చింది. ఉత్తమ నటిగా నంది అవార్డు దక్కింది. జాతీయ ఉత్తమ నటి పురస్కారానికి ఆమె నామినేట్ అయినా చివరి నిమిషంలో హిందీ సినిమా ‘అర్థ్’కు గానూ షబానా ఆజ్మీ ఆ అవార్డు దక్కించుకున్నారు.
sankarabharanam
‘మేఘసందేశం’ ఆ కాలానికి చాలా ప్రయోగాలు చేసిన సినిమా. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గొంతు లేకపోతే తెలుగు సినిమా పాట లేదు అనే స్థితిలో, ఆయన లేకుండా హీరోకి యేసుదాస్ చేత పాటలు పాడించారు. శంకరాభరణం సినిమాలో పాడిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి, వాణీ జయరాం లాంటి వారెవరూ ఈ సినిమాలో పాటలు పాడలేదు.
Sankarabharanam_Movie
అప్పటికి గ్లామరస్ హీరోగా ఉన్న అక్కినేని చేత గడ్డంతో ఉండే డీగ్లామర్ రోల్ చేయించారు. సినిమాలో ఎక్కడా క్రెయిన్ వాడలేదు. ఈ సినిమాను దాసరే సొంతంగా నిర్మించారు. ఈ సినిమాకుగానూ అక్కినేని, దాసరి నారాయణరావు పారితోషికాలు తీసుకోలేదు. అంతకు రెండేళ్ల ముందే మరణించిన దేవులపల్లి కృష్ణశాస్త్రి ఎప్పుడో రాసిన పాటలు ఇందులో వాడారు. ప్రముఖ రచయిత పాలగుమ్మి పద్మరాజు రాసిన కవితలనూ సందర్భానుసారం ఉపయోగించారు.
mangalampalli
శంకరాభరణంలో జంధ్యాల మార్కు మరచెంబు కామెడీ ఉంటుంది. దానికితోడు చంద్రమోహన్, రాజ్యలక్ష్మిల లవ్ ట్రాక్, డ్యుయెట్ ప్రేక్షకులకు రిలీఫ్ ఇచ్చింది. కానీ మేఘసందేశంలో ఎక్కడా కామెడీ ఉండదు. ప్రత్యేకమైన ఎలివేషన్ సీన్లు ఉండవు. డైలాగులు కూడా తక్కువే! కానీ శంకరాభరణం స్థాయిలో మేఘసందేశం నిలవలేకపోయింది. ఆర్థికంగానూ ఆ స్థాయి విజయం అందుకోలేక పోయింది. ఎందుకో మరి?
PS: ‘శంకరాభరణం’ సినిమాకు నాలుగు జాతీయ అవార్డులు వచ్చాయి కాబట్టి, తను తీసిన సినిమాకూ అవే అవార్డులు రావాలని దాసరి పట్టు పట్టారని ఒకానొక మాట వినిపిస్తూ ఉంటుంది. ఆ పైరవీ కారణంగానే ‘మేఘసందేశం’ సినిమాకు జాతీయ స్థాయిలో ‘ఉత్తమ ప్రాంతీయ చిత్రం, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ నేపథ్య గాయకుడు, ఉత్తమ నేపథ్య గాయని’ పురస్కారాలు వచ్చాయని అంటారు. నిజానిజాలు నిగ్గు తేలడం కష్టం. కానీ అర్హత కలిగినవారికే అందిన అవార్డులు అవి… – విశీ

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions