విశ్వనాథ్ జ్ఙాపకాలకు జనం నీరాజనం పడుతున్నారు… అంతగా అందరి హృదయాలను గెలుచుకున్నాడు తను… అనేకానేక అణిముత్యాలను అందించిన విశ్వనాథ్ కెరీర్‌లో శంకరాభరణం తరువాత చెప్పుకోదగ్గ సూపర్ హిట్ సాగరసంగమం… మళ్లీ విశ్వనాథ్ పుట్టి, మెగాఫోన్ చేతపట్టినా ఆ సినిమాను మళ్లీ తీయలేడేమో… సిరివెన్నెల మరో మెచ్చుతునక… ఏ సినిమా ఎలా ఉన్నా బాగా బాగా గుర్తుండిపోయేది మమ్ముట్టి హీరోగా… కాదు, కాదు, మాస్టర్ మంజునాథ్ హీరోగా తీసిన స్వాతికిరణం…
తనను మించి ఎదుగుతున్న ఓ కుర్రాడి మీద ద్వేషాన్ని, కుట్రను ప్రయోగించిన ఓ గురువు కథ… మమ్ముట్టి, రాధిక మొహాల్లో భావోద్వేగ వ్యక్తీకరణ చాలా బాగుంటాయి… పదకొండు పాటలు… వాణీజయరాం విశ్వరూపం… సిరివెన్నెల, సినారె, వెన్నెలకంటి పాటలకు అబ్బురపరిచే ట్యూన్లు… సరే, చెబుతూ పోతే ఒడవదు… కానీ తన సినిమాల్లో కొన్ని ఫ్లాపులు కూడా ఉన్నాయి… వాటిల్లో చెప్పదగింది జననీజన్మభూమి సినిమా… ఎవరిని దృష్టిలో పెట్టుకుని చేశాడో గానీ ఆకట్టుకునే ట్యూన్లతో మంచి పాటలు రెడీ అయ్యాయి… ఓ ఆదర్శ యువకుడి కథ… తనకు బాగా నచ్చిన సుమలత, రాజ్యలక్ష్మి పాత్రధారులు…
హఠాత్తుగా బాలకృష్ణ హీరోగా అందులోకి జొప్పించబడ్డాడు… అప్పుడప్పుడే నటుడిగా పాపులర్ అవుతున్న బాలకృష్ణను కేవలం మాస్ హీరోగా గాకుండా, భిన్నమైన హీరోగా కూడా జనానికి పరిచయం చేయాలని ఎన్టీయార్ విశ్వనాథ్ మీద ఒత్తిడి తెచ్చి ఒప్పించారని అంటారు… పైగా ప్రతి విషయంలోనూ వేళ్లు, కాళ్లు… ఇక తన నెత్తి మీద కత్తిపెడితే ఏ క్రియేటివ్ డైరెక్టరయినా స్వేచ్ఛగా ఏం పని చేయగలడు… అందుకే నామ్‌కేవాస్తే తను దర్శకుడిగా ఉండి, తన సహాయకులకు విశ్వనాథ్ మొత్తం బాధ్యతల్ని అప్పగించాడని అంటారు… సినిమాకు ఓ దశ, ఓ దిశ లేకుండా పోయింది… తన్నేసింది… అసలు ఆ సినిమా వచ్చిందని కూడా చాలామంది గుర్తుకులేదు…
Ads
అలాగే విశ్వనాథ్ నటులతో తప్ప హీరోలతో, స్టార్లతో సినిమాలు చేయలేడు, వాళ్లు తను చెప్పినట్టు వినరు అనే ఓ అపోహ ఉంది… కానీ తప్పు… చిరంజీవితో మూడు, కమలహాసన్‌తో మూడో నాలుగో, వెంకటేశ్‌తో రెండు, అక్కినేనితో ఒకటి, మమ్ముట్టితో ఒకటి… చిరంజీవి హీరోగా ఉన్నప్పుడు రెండు, తను నటుడిగా ఉన్నప్పుడు శుభలేఖ… ఇక కమలహాసన్ అయితే విశ్వనాథ్‌కు దత్తపుత్రుడే… వెంకటేశ్‌తో స్వర్ణకమలం గుర్తుంటుంది కానీ చిన్నబ్బాయి మరో సినిమా… ఆ సినిమాను విశ్వనాథ్ ఎందుకు తీశాడో తనకు కూడా తెలియదేమో బహుశా…
విశ్వనాథ్ సినిమాలకు ప్రాణం… వేటూరి, సిరివెన్నెల, బాలు, ఇళయరాజా, కేవీమహదేవన్, కమలహాసన్… వీళ్లే గుర్తొస్తారు… ప్లస్ జయప్రద… నిజానికి మొదట్లో కమర్షియల్ సినిమాలు కూడా చేశాడు విశ్వనాథ్… కాలాంతకులు, అల్లుడు పట్టిన భరతం, ప్రెసిడెంట్ పేరమ్మ వంటి పిచ్చి సినిమాలు కూడా ఆయన ఖాతాలో ఉన్నాయి… తరువాత సంగీత, సాహిత్, నాట్య ప్రధానమైన సంప్రదాయ పోకడల సినిమాల వైపు మొగ్గుజూపించాడు… తన మీద కంప్లయింట్ ఏమిటంటే… సినిమాల్లో వస్తున్న ఆధునిక పోకడలకు ఆయన అడాప్ట్ కాలేకపోయాడు… పోనీ, దర్శకత్వం మానేసి, దానికే కట్టుబడ్డాడా… లేదు… అల్లరి నరేష్ హీరోగా శుభప్రదం తీశాడు… కొంత పరువు పోగొట్టుకున్నాడు… శ్రీకాంత్ నటించిన స్వరాభిషేకం కూడా అంతే… అదే శంకరాభరణం మూస… అసలు అది విశ్వనాథేనా తీసింది అనేలా ఉంటుంది… కానీ దానికి జాతీయ అవార్డులు రావడం విచిత్రం…
Share this Article