మీ మాట! మా అక్షరం!
———————-
సాంకేతిక విజ్ఞానం పెరిగేకొద్దీ అనుకూలతలు ఉంటాయి. దాన్ని దుర్వినియోగం చేస్తే దుష్ఫలితాలూ ఉంటాయి. వెబ్ సైట్లు, బ్లాగులు, ట్విట్టర్, ఫేస్ బుక్, వాట్సాప్, యూ ట్యూబ్ లు వచ్చాక అభిప్రాయ వ్యక్తీకరణ పెరిగింది. మంచో చెడో తమ అనుభూతులను ప్రపంచంతో పంచుకోవాలనే ఆరాటం పెరిగింది. సామాజిక మాధ్యమాల్లో ఎంత చెత్త వస్తూ ఉంటుందో- అంత గొప్ప కంటెంట్ కూడా వస్తోంది. మెయిన్ స్ట్రీమ్ రచయితలకంటే సొంత బ్లాగుల్లో సరదాగా రాసుకుంటున్నవారు గొప్పగా రాణిస్తున్నారు. కొన్ని యూ ట్యూబ్ వీడియోలు లక్షలు దాటి కోట్ల కళ్లను కట్టిపడేస్తున్నాయి. డిజిటల్ వేదికల మీద ఆడియోకు ఆడియో, వీడియోకు వీడియో, టెక్స్ట్ కు టెక్స్ట్ విడి విడిగా కాపీ చేసి పెట్టుకోవడం ఒక పద్ధతి. దీనివల్ల ఆ కంటెంట్ లో కేవలం ఆడియో వినదలుచుకున్నవారు ఆడియో మాత్రమే వినగలుగుతారు. అదే కంటెంట్ ను అక్షరరూపంలో చదవదలుచుకున్నవారు చదువుకోగలుగుతారు.
Ads
ఇంగ్లీషులో శబ్దరూపంలో ఉన్న మాటలను అక్షరాలుగా ఆటోమేటిగ్గా టైప్ చేసే- సాఫ్ట్ వేర్ ఎప్పటినుండో అందుబాటులో ఉంది. ఈ సాఫ్ట్ వేర్ ను ఆటోమేటిక్ స్పీచ్ రికగ్నిషన్- ఏఎస్ఆర్ అంటున్నారు. మాటలకు యాంత్రిక అక్షరీకరణ అని తెలుగులో కొత్తగా పారిభాషిక పదాన్ని కాయిన్ చేసుకోవచ్చు.
ఇంగ్లీషులో అనేక యాసలున్నాయి. ఒకరకంగా యూరోప్, అమెరికా ఇంగ్లీషు యాసనే ఈ సాఫ్ట్ వేర్ గుర్తించగలుగుతోంది. హైదరాబాద్ త్రిబుల్ ఐ టీ లో తెలుగు ఉచ్చారణను ఆటోమేటిగ్గా యాంత్రికంగా అక్షరీకరించే సాఫ్ట్ వేర్ కనుక్కునే ప్రాజెక్ట్ మొదలయ్యింది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయంతో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. తెలుగులో సఫలమయితే మిగతా పదిహేను భారతీయ భాషల్లో కూడా ఈ యాంత్రిక అక్షరీకరణ సాఫ్ట్ వేర్ ను ఆవిష్కరించాలని కేంద్రం ఉవ్విళ్లూరుతోంది. మంచిదే.
మాటకంటే రాత శాశ్వతం. శబ్దం గాల్లో కలిసిపోతుంది. రాసుకున్నదే మిగిలి ఉంటుంది. అక్షరం అంటేనే క్షయం, తరుగు, నాశనం లేనిది అని అర్థం. అక్షరరూపంలో రాతలో ఇవ్వకపోతే నన్నయ మొదలు నేటిదాకా మనకు ఏదీ మిగిలి ఉండేది కాదు.
తెలుగులో పేరుకు ఆరు మాండలికాలున్నాయి. ఇంకా లోతుగా వెళితే ఒక్కో జిల్లాలోనే మూడు మాండలికాలుంటాయి. అంటే ఒకే మాటకు కనీసం పది రకాల ఉచ్చారణ పద్ధతులు, మూడు నాలుగు రకాల రాత పద్ధతులు ఉంటాయి.
చేశారు
చేసారు
చేసినారు
చేషినారు
చేశినారు
చేసిన్రు
చేశిన్రు
చేషిన్రు
చేస్నారు
చేష్నారు
చేసిండ్రు
చేసింరు
చేసిణ్రు
ఇందులో ఏది కరెక్ట్? ఏది తప్పు? అంటే ప్రామాణిక భాషోచ్చారణను బట్టి ఒకటి కరెక్ట్ అని చెబుతాం. కానీ మాండలిక ఉచ్చారణ ప్రకారం శబ్దాన్ని ఎలా పలుకుతుంటే సాఫ్ట్ వేర్ అక్షరాలా అలాగే అనువదిస్తుంది.
పంపారు
పాలు
ఈ రెండు పదాల్లో రాస్తున్న పా ఒకటే అయినా పలికే పా వేరు. పంపారు అన్నపుడు పా శబ్దంలో యా యే కలిసిన ధ్వని రావాలి.
“నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు
నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు”
అన్న పాటలో తెలుగు ఉచ్చారణ తెలియదు కాబట్టే నేర్పావు నేర్పావు అని పావులో పా పలికినట్లు ఆ గాయకురాలు పాడితే అదే సరైనదనుకుని మనమూ అలాగే పాడుతున్నాం. తమిళ మూలాలతో అమెరికాలో పుట్టి తెలుగుపాటలకు సిద్ధి కలిగిస్తున్న సిధ్ శ్రీరామ్ నువ్వుంటే అనడానికి నువ్ ఉల్టే అని తమిళానికి సహజమయిన ళ, ణ ఉచ్చారణ కలిపి పాడుతుంటే- మనం కూడా ఉల్టాగా వింటూ పాడుతూ అదే నిజమనుకుంటున్నాం. ఇదంతా లిపి- ఉచ్చారణ గొడవ. తెలుగును ఇంగ్లీషులో రాసుకుని రాగంలో పాడి విమానమెక్కి వెళ్ళిపోతే- మనం ఉండిప్పోనీలే… అని డిప్పో ఉచ్చారణతో సరిపెట్టుకుంటున్నాం.
భాషలో మాట్లాడే మొత్తం శబ్దాలకు లిపి చాలదు. లిపి శబ్దానికి కేవలం సంకేతం.
మే నెల
మేక
ఈ రెండు మాటల్లో రాస్తున్నది మే అయినా రెండు చోట్ల మే అక్షరం ఉచ్చారణలో చాలా తేడా ఉంటుంది. ఉండాలి. మాతృభాష తెలుగు అయినవారికి ఇది తెలుస్తుంది. తెలుగులో-
శ
ష
సన
ణల
ళ
అక్షరాల మధ్య ఉచ్చారణలో భేదం పాటించే జాతి నెమ్మదిగా కనుమరుగవుతోంది. పెళ్లి పెల్లిగా పెళ్లలు పెళ్లలుగా పగుళ్లు వచ్చినా ఇప్పుడు పెద్ద పట్టింపు ఏమీ లేదు. భాషకు సొంతమయిన ఉచ్చారణ సంప్రదాయం, యాసల్లో పలికే పద్ధతులు తెలియకపోతే ఉల్టే ఉల్టేగానే పలుకుతుంటాం. ఆ పలుకుతున్నది తప్పని ఎవరయినా చెప్పినా ఒప్పుకోము.
తెలుగు శబ్దాలకు ఆటోమేటిగ్గా అక్షరాలు టైప్ అయ్యే సాఫ్ట్ వేర్ కనుక్కోవడం మంచిదే. కానీ- ఇన్ని మాండలిక ఉచ్చారణల్లో దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలన్నదే పెద్ద సమస్య. ఒకటిన్నర జిల్లా మాండలికం యావత్ తెలుగువారికి ఎలా ప్రామాణిక భాష అవుతుందని ప్రజాకవి కాళోజి అర్ధ శతాబ్దం క్రితమే ప్రశ్నించాడు. కాల్ సెంటర్లు ఇతర సేవల్లో కొంతవరకు ఇలాంటి ఉచ్చారణకు అక్షరాలు టైప్ అయ్యే సాఫ్ట్ వేర్లు పనికిరావచ్చు కానీ- భాషలో అందమయిన, సహజమయిన యాసలు కనుమరుగయ్యే ప్రమాదముంది. యంత్రం గుర్తించేదే తెలుగు-మిగతాది కాదు అని పొరబడే అవకాశం ఉంది. ఇప్పటికే చదవడం, రాయడం తగ్గిపోతోంది. ఇక మాట్లాడింది నేరుగా టైప్ అయ్యే పద్ధతి అందుబాటులోకి వస్తే- రాయడం మరింతగా తగ్గవచ్చు. చదవడం, రాయడం ఎంత తగ్గితే భాష జ్ఞాపకంలో ఉండడం అంతగా తగ్గిపోతుంది.
సాంకేతికంగా ఉచ్చారణకు అక్షరాలు ఆటోమేటిగ్గా టైప్ కావడాన్ని ఆహ్వానించాల్సిందే. తెలుగు మాండలికాల ఉచ్చారణ దేనికదే ఒక భాషతో సమానం. ఈ సమస్యను సాఫ్ట్ వేర్ ఎలా అధిగమిస్తుందో చూడాలి.
- పమిడికాల్వ మధుసూదన్
Share this Article