.
ఏటా కోటా కోచింగ్ వ్యాపారం:- మూడు వేల కోట్ల రూపాయలు
చిన్నా పెద్ద కోచింగ్ సెంటర్లు:- 100
Ads
బయటినుండి వచ్చి చదువుకునే విద్యార్థులు:-
ఏటా ఒకటిన్నర లక్షల మంది
ఒక్కొక్కరి ఫీజు:-
సంవత్సరానికి రెండు లక్షల దాకా
ఊళ్లో హాస్టల్స్:-
3,000
మెస్సులు, క్యాంటీన్లు:-
1,800
గది అద్దె:-
ఒక్కొక్కరికి 15,000/-
రాజస్థాన్ కోటా పోటీ పరీక్షలకు పెట్టని కోట. కట్టని కోట. ప్రత్యేకించి ఐఐటీ ప్రవేశ పరీక్షలకు కోటా పెట్టింది పేరు. కోటా కీర్తి ప్రతిష్ఠలకు సంబంధించినవే పై అంకెలు. పది లక్షల జనాభా దాటని కోటా పట్టణంలో లక్షల మంది పిల్లలు బయటి నుండి వచ్చి హాస్టళ్లలో ఉంటూ కోచింగ్ తీసుకుంటూ ఉంటారు.
ఏటా కోటాలో ఈ విద్యా వ్యాపారం మూడు వేల కోట్ల రూపాయలు దాటుతుంది. దేశవ్యాప్తంగా కోటా కోచింగ్ సెంటర్లకు డిమాండ్ పెరగడంతో దేశంలోని మిగతా నగరాల్లో కూడా కోటా విస్తరించిన కొమ్మల బ్రాంచులు వెలిశాయి.
ఐఐటీ ప్రవేశ పరీక్ష రాసేవారిలో నుండి ఎంపిక అయ్యేవారి శాతాన్ని లెక్కకడితే సరిగ్గా ఒక్క శాతం కూడా దాటదు. కానీ మిగతా 99 శాతం మంది ఖర్చు, శ్రమ, ఒత్తిడి, బాధలో తేడా ఏమీ ఉండదు. గెలిచిన ఒకరిని చూస్తూ మనమూ గెలవకపోతామా అని ఆశపడడమే కోచింగ్ సెంటర్లకు పెట్టుబడి.
రాజస్థాన్ కోటా పట్టణంలో ఇప్పుడు శూన్యం, నైరాశ్యం రాజ్యమేలుతోంది. ఆమధ్య కోవిడ్ దెబ్బకు కోచింగ్ సెంటర్లు తాత్కాలికంగా మూతపడి మళ్ళీ తెరుచుకున్నాయి. తరువాత రెండు, మూడేళ్ళుగా వరుసగా కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగాయి.
రోజుకు 18 గంటల కోచింగ్ ఒత్తిడి; నెలవారీ పరీక్షలు, సమీక్షల ఒత్తిడి; ఉన్న కోచింగ్ సెంటర్లోనే అత్యుత్తమ అధ్యాపకులు బోధించే క్లాసులో పడేంతగా మార్కులు తెచ్చుకోలేక సాధారణ తక్కువ స్థాయి అధ్యాపకులు(?) బోధించే క్లాసులో ఉన్నామే అన్న అవమానం; తల్లిదండ్రుల ఆశల ఒత్తిడి… ఇలా హాస్టల్ గదిలో ఫ్యాన్లకు ఉరివేసుకున్న ఒక్కో విద్యార్థిది ఒక్కో విషాదగాథ.
చదువు ఇప్పుడొక ఇష్టం కాదు-
కష్టం.
చదువు ఇప్పుడొక ఉపాధి కాదు-
వ్యాపారం.
చదువు ఇప్పుడొక విజ్ఞానం కాదు-
విలయం.
చదువు ఇప్పుడొక వికాసం కాదు-
విషాదం.
చదువు ఇప్పుడొక సంస్కారం కాదు-
సంక్షోభం.
చదువు ఇప్పుడొక ఆనందం కాదు-
ఆడలేని ఎత్తుల చదరంగం.
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ప్రభుత్వం కోటా కోచింగ్ పద్ధతులు, హాస్టళ్ళలో పరిస్థితులమీద దృష్టి పెట్టింది. వందశాతం మార్కులు సాధించలేని పిల్లలను వందశాతం ఆశల ఊబిలోకి కోచింగ్ సెంటర్లు ఎలా దించుతున్నాయో ప్రభుత్వానికి అర్థమయ్యింది.
అత్యుత్తమ, ఉత్తమ, సాధారణ, మొక్కుబడి పేరిట చేసిన క్లాసుల విభజనకు ప్రభుత్వానికి తలతిరిగింది. కోటా కోచింగ్ సెంటర్లలో వారం వారం; నెల నెలా విద్యార్థుల ఆత్మహత్యలు ఎన్ని జరుగుతున్నాయో, క్రమంగా ఎలా పెరుగుతున్నాయో దేశానికి తెలిసింది.
ఫలితంగా ఇతరప్రాంతాలనుండి కోటాకు వచ్చి కోచింగ్ సెంటర్లలో చేరే విద్యార్థుల సంఖ్య ఒకప్పటితో పోలిస్తే 40 శాతం తగ్గిపోయింది. దాంతో చాలా హాస్టళ్లు, పేయింగ్ గెస్ట్ అకామిడేషన్లు, మెస్సులు, క్యాంటీన్లు మూత పడ్డాయి. మరికొన్ని మూసివేత దారిలో ఆరిపోయే ముందు దీపంలా మిణుకు మిణుకుమంటున్నాయి.
కొన్ని కోచింగ్ సెంటర్లు ఆన్ లైన్ క్లాసులు మొదలు పెట్టినా ఆర్థికంగా సరిపోవడం లేదు. ఒక్కసారిగా వ్యవస్థ కుప్ప కూలినట్లుంది కోట కోచింగ్ సెంటర్ల పరిస్థితి. అంతా అగమ్యగోచరంగా ఉంది. ఐఐటీలకు పిల్లలను పంపగలిగేంత తెలివయిన కోటా…ఇప్పుడు తెలివి కోల్పోయి దిక్కులు చూస్తోంది. దశాబ్దాలుగా చదువులతో కళకళలాడిన కోటా చదువులు కోట గోడ దాటడం లేదు. చదువుల కోట బీటలువారింది. ఐఐటీ ప్రవేశ పరీక్షలకు పెట్టని కోటా…ఇప్పుడు ఎవరికీ పట్టని కోట అయ్యింది. అవ్వాలి కూడా.
అందుకే అంటారు. అతి చేస్తే గతి చెడుతుందని.
కోటా పెరిగింది.
కోటా వెలిగింది.
కోటా అతి చేసింది.
కోట తరిగింది.
కోట కూలింది.
దేశంలో ఇలా కూలనున్న, కూలకతప్పని కోటలు ఇంకా ఎన్నో? ఎన్నెన్నో?
రెక్కవిప్పి… ఆకాశమే హద్దుగా ఎగరాల్సిన, ఎదగాల్సిన ఎన్నెన్ని జీవితాలు ఫ్యాన్ రెక్కలకు ఉరివేసుకుని… ఊపిరాడక కోటాల పునాదుల్లో ఉన్నాయో! తెలుసుకోకపోతే, వినకపోతే, కళ్ళు తెరవకపోతే మనం చెవులున్న చెవిటివాళ్ళం. నోరున్న మూగవాళ్ళం. కళ్ళున్న కబోదులం. మనసున్న అమనుష్యులం.
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article