.
( రమణ కొంటికర్ల )… ఇప్పుడు మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ బాగా వినిపిస్తున్న కొత్త సినిమా పేర్లలో ఇక్కిస్ ఒకటి… (4 రోజుల్లో 30 కోట్లు వసూలు చేసింది…) అసలేంటి ఈ ఇక్కిస్..? ఈ సినిమా ఎవరి నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు..?
అపారమైన ధైర్యసాహసాలకు పర్యాయపదం అరుణ్ ఖేతర్పాల్. భారత చరిత్ర దిశనే మార్చే ఒక అపూర్వ ఘట్టంలో.. కేవలం 21 ఏళ్ల వయస్సుకే వీరమరణం పొందిన అభిమన్యుడు. 1971 యుద్ధంలోని అత్యంత కీలకమైన సంఘర్షణల మధ్య కేంద్రబిందువుగా నిల్చిన అరుణ్ కేతర్పాల్ నిజజీవిత కథే ఇక్కిస్.
Ads
సాధారణంగా అరుణ్ కేతర్పాల్ అంటే వీరత్వానికి చిహ్నంగా మాత్రమే చూసే క్రమంలో.. ఇక్కిస్ ఆయన క్రమశిక్షణ, కుటుంబ బంధాలకు ఆయనిచ్చే విలువ, అచంచల విశ్వాసంతో ఆయన ఎదిగిన తీరు చూపించేందుకు యత్నించిన సినిమా ఇక్కిస్.
అరుణ్ కేతర్పాల్ భారతదేశ అత్యున్నత సైనిక వీర పురస్కారం పరమవీర చక్ర పొందిన అతి పిన్న వయస్కుడిగా కూడా రికార్డుకెక్కాడు. సెకండ్ లెఫ్టినెంట్ గా పనిచేసిన అరుణ్ ఖేతర్పాల్ సినిమా కథను, కథనాన్ని కొంత భావోద్వోగాలతో ముడిపెట్టినా… మూలం మాత్రం ఆ చారిత్రక సత్యం నుంచే తీసుకున్నారు.
బసంతర్ యుద్ధం ఎప్పుడు జరిగింది..?
1971లో ఇండో – పాక్ యుద్ధ సమయంలో పంజాబ్ లో ఒక కీలక ట్యాంక్ కు సంబంధించిన యుద్ధమిది. ఈ యుద్ధంలో భారత సైన్యం శత్రువుల ముందడుగును గుర్తించి అడ్డుకుంది. జమ్మూ కశ్మీర్ కు వెళ్లే ఒక కీలక మార్గంలో కాపు కాసింది.
ఆ మార్గంలోనే రావి నదికి ఉపనది అయిన బసంతర్ నది ఉంది. ఇది ఉత్తర పంజాబ్ లోని షకర్ గఢ్ ప్రాంతం గుండా ప్రవహిస్తుంది. ఇక్కడే ఆ కీలక ట్యాంక్ ను చిన్న వయస్సులోనే నడిపి.. శత్రువులకు ఎదురొడ్డి పది యుద్ధ ట్యాంకులను మట్టికరిపించాడు. అలా సీనియర్ అధికారుల మన్ననలు, గౌరవాన్ని సంపాదించాడు ఖేతర్పాల్.
అరుణ్ ఖేతర్పాల్ భారత సైన్యంలో 17 పూనా హార్స్ రెజిమెంట్ కు చెందిన ఓ యువ అధికారి. 1971 ఇండో – పాక్ యుద్ధంలో ఆయన సెంచూరియన్ ట్యాంకును నడిపాడు. అసాధారణమైన ధైర్యసాహసాలతో నాయకత్వంతో పాటు.. యుద్ధ పరిజ్ఞానాన్ని ఆయన ప్రదర్శించిన తీరు నాటి ఆర్మీ అధికారులను ఆకట్టుకుంది. ఎందుకంటే, శత్రువులు పైపైకి వస్తున్నప్పటికీ ట్యాంక్ వదిలిపెట్టి రావాలని సీనియర్స్ కోరినా.. నో సర్, ఐ విల్ నాట్ అబాండన్ మై ట్యాంక్ అంటూ తెగేసి తెగువగా చెప్పిన ఆర్మీ అధికారి అరుణ్ ఖేతర్పాల్.
అసలా యుద్ధట్యాంకుకు ఏమైంది..?
యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుని అరుణ్ ఖేతర్పాల్ నడుపుతున్న యుద్ధట్యాంక్ మంటల్లో చిక్కుకుంది. ఆ సమయంలో ట్యాంకును వదిలి వెనక్కి రావాలని ఆదేశాలు అందాయి. కానీ, ఆయన వెనుదిరగడానికి ఇచ్చిన సమాధానం మాత్రం చరిత్రలో నిల్చిపోయింది. చివరి శ్వాస వరకూ పోరాడాలని నిర్ణయించుకున్న ఆయన మాటలు సహచరులకు గూస్ బంప్స్ తెప్పించాయి. అరుణ్ మాటలు తాను చేస్తున్న పని పట్ల ఆయన అంకితభావాన్ని చెప్పేవి.
ముందు శిక్షణ సమయంలో అహ్మద్ నగర్ లో ఆయన ట్యాంకును నవంబర్ లో యుద్ధం సమీపిస్తున్న సమయంలో సస్పెండ్ చేశారు. వద్దన్నారు. కానీ, ఆయన ప్రతిభ, అంతకుమించిన పట్టుదలను గుర్తించిన కమాండింగ్ ఆఫీసర్స్ మూడు సెంచూరియన్ ట్యాంకుల స్క్వాడ్రన్ బాధ్యతలను ఆయనకే అప్పగించారు.
అసలు అరుణ్ ఖేతర్పాల్ ఎవరు..?
ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో బాల్యంలో చదువుకున్న అరుణ్ ఖేతర్పాల్.. ఆ తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరాడు. ఇండియన్ మిలటరీ అకాడమీలో శిక్షణ పొంది ఉత్తీర్ణుడై, భారత సైన్యంలో నియమితుడయ్యాడు. అంతేకాదు, అరుణ్ ఓ తన జీవితంలో వివాహం చేసుకోని ఓ బ్రహ్మచారి.
ఆయన యుద్ధంలో వీరమరణం పొందినప్పుడు అరుణ్ ఖేతర్పాల్ వయస్సు కూడా 21 ఏళ్లే. అరుణ్ మరణం తర్వాత ఆయన తల్లి చెప్పిన మాటలు ఇప్పటికీ సైనిక కర్మాగారాల్లో స్ఫూర్తి పాఠాలు.
- సింహలా పోరాడు.. పిరికివాడిలా తిరిగిరాకు అని కొడుక్కి చెప్పి పంపిన తల్లి ఆమె. ఈ మాటలు యునైటెడ్ సర్వీస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రచురణలో కూడా ప్రస్తావించారు.
అరుణ్ ఖేతర్పాల్ నేపథ్యమేంటి..?
అరుణ్ ది సైనిక కుటుంబం. తండ్రి ఎం. ఎల్. ఖేతర్పాల్ లెఫ్టినెంట్ కల్నల్. చిన్నప్పట్నుంచీ దేశభక్తి.. సేవలు వంటివి వింటూ ఆయన బాల్యం గడిచింది. ఎం. ఎల్. ఖేతర్పాల్ ముందుతరం కూడా వివిధ రెజిమెంట్లలో పనిచేసిన దేశసేవకులు. అరుణ్ సొంతూరు పశ్చిమ పంజాబ్ లోని సర్గోధా. దేశ విభజనానంతరం శరణార్థులుగా భారత్ కు వచ్చిన కుటుంబం అరుణ్ ఖేతర్పాల్ ది.
బసంతర్ యుద్ధ సమయంలో ఆయన తీవ్రమైన గాయాలతోనే శత్రుమూకలతో పోరాటం చేశాడు. ట్యాంకుకు మంటల్లో చిక్కుకుని ప్రమాదం జరుగుతున్నప్పటికీ వెనుకడుగు వేయకుండా శత్రుమూకలు ముందుకు రాకుండా అడ్డుకున్నాడు. చివరకు ఆ యుద్ధంలోనే తన ప్రాణాలను కోల్పోయినప్పటికీ.. ఇంకెందరో భారతీయ సైనికుల ప్రాణాలను కాపాడిన త్యాగశీలి అరుణ్ ఖేతర్పాల్.
అరుణ్ ఖేతర్పాల్ అంత్యక్రియలు జరిగిన వారం రోజులకుగానీ ఆయన మరణవార్త కుటుంబ సభ్యులకు తెలియలేదు. 2009వ సంవత్సరంలో జమ్మూలో యుద్ధ స్మారకంగా నిర్మించిన బలిదాన్ స్థంభంపై ఆయన పేరును శాశ్వతత్వానికి గుర్తుగా చెక్కించి ఇండియన్ ఆర్మీ ఆయన మరణానంతరం కూడా ఆయన్ను గౌరవించుకుంది. అరుణ్ ఖేతర్పాల్ త్యాగం ఒక సైనిక విజయం మాత్రమే కాదు.. 1971 యుద్ధంలో భారత జాతీయ సంకల్పానికి ఓ ప్రతీక.
అయితే, అరుణ్ ఖేతర్పాల్ నిజజీవితంలో ఎలాంటి ప్రేమకథల్లేవు. కానీ, సినిమాటిక్ గా అలరించేందుకు ఇక్కిస్ లో సిమర్ భాటియా అనే కల్పిత పాత్రను సృష్టించారు…
Share this Article