Aranya Krishna…. ఇదేం బుద్ధి రాజా!
ఇళయరాజాకి అదేదో ఎక్కువైంది బాగా. లేకుంటే తాను కంపోజ్ చేసిన పాటల్ని ఎవరైనా ఓ ప్రదర్శనలో పాడాలంటే తన అనుమతి తీసుకోవాలని లేదా పరిహారం చెల్లించాలని చాలా కాలంగా షరతులు పెట్టడమే కాదు లీగల్ నోటీసులు కూడా పంపుతున్నాడు. ఇలా నోటీసులు అందుకున్న వారిలో గతంలో ఆయనకు అత్యంత ఆప్తుడైన, తనతోనే కలిసి ఎదిగిన, ఒరే అంటే ఒరే అని పిలుచుకునే ఎస్పీబి కూడా వున్నారు.
అప్పటి నుండి ఎస్పీబి ఇళయరాజా కంపోజ్ చేసిన పాటలని పాడటం మానేశాడు. ఇప్పుడు “మంజుమ్మల్ బాయ్స్” సినిమా (నేను చూడలేదు)లో తన పాటని ఉపయోగించుకున్నారని కూడా లీగల్ నోటీస్ పంపాడు. ఆ పాటని సందర్భోచితంగా, ఒక భావోద్వేగపరంగా ఉపయోగించినట్లుగా దాని యాడ్ చూస్తే అర్ధం అయింది నాకు.
Ads
ఒక సినిమా పాట ఎలా తయారవుతుంది? ఒక నిర్మాత రికార్డింగ్ స్టుడియోకి అద్దెల ఖర్చులతో, గాయకులకి, సంగీత దర్శకుడికి, గీత రచయితకి ఇచ్చే పారితోషికాలతో ఓ పాట తయారవుతుంది. అందరూ సొమ్ముల కోసం పని చేసే వారే కావచ్చు కానీ ఓ పాట తయారీలో కృషి, సృజనాత్మకత ఒక్క కంపోజర్ దే అయివుండదు. గీత రచయిత, గాయకులు దగ్గర నుండి వాద్య సహకారం అందించే వారి వరకు అందరిదీ వుంటుంది…
మరి మధ్యలో అంతా తానేనని, అన్ని హక్కులూ తనవేననీ ఈ గోల రాజా ఊళలేంది? ఒకరి ఖర్చులతో అనేకమంది సమిష్టి కృషి మీద హక్కు ఒక్క వ్యక్తి తనదేనని ఘీంకరించడమేంటి? కంపోజర్ ముఖ్యం అని ఎవరైనా అంటే మరి దానికి ప్రతిఫలం, పారితోషికం పొందాడుగా? అటు పారితోషికమూ కావాలి ఇటు భవిష్యత్తులో రిటర్న్స్ కూడా రావాలన్న మాట! ఏం సెపితిరి? ఏం సెపితిరి రాజావారూ!
ఇళయరాజాకి ఒక ఆడియో కంపెనీ వుంది “ఇకో” అనే పేరుతో. ఆయన తాను కంపోజ్ చేసే సినిమాల పాటలన్నింటి మీద హక్కుల్ని రాయించుకునే వాడు. ఇక్కడే అసలు ప్రశ్న వస్తుంది. ఒక ఆడియో కంపెనీ హక్కుల్ని కైవశం చేసుకున్నదంటే దానర్ధం ఏమిటి? ఇదే అసలు ప్రశ్న.
ఇళయరాజాకి ఆడియో కంపెనీ యజమానిగా ఆ సినిమాల పాటల హక్కులుంటాయా లేక కంపోజర్గానా? ఆడియో కంపెనీ యజమానిగా ఐతే అది అమ్మకాలకు సంబంధించిన హక్కే కానీ ఎవరైనా ఏ సందర్భంలో ఐనా పాడటం మీద కాదు. కంపోజర్గా ఐతే అతనికి పాట మీద హక్కులుండే ప్రసక్తి లేదు. ఎందుకంటే అది నిర్మాతల ఖర్చుతో, గీత రచయిత, గాయకులు, ఆర్కెస్ట్రా సభ్యుల కృషితో తయారయ్యేదే.
కొంతమంది ఎస్పీబి ఆ పాటల్ని పాడి సొమ్ము చేసుకుంటున్నాడు కాబట్టి ఇళయరాజా అడగటంలో తప్పేముంది అంటున్నారు. మరి ఇళయరాజా కూడా తన విభావరుల్లో ఎస్పీబి పాడిన పాటల్ని పాడించడం లేదా ఇతర గాయకులతో? ఎస్పీబికి లేని హక్కు ఇళయరాజాకి ఎక్కడ వుంటుంది ఓ సమిష్టి కళాత్మక కృషి మీద?
అందరూ ఎస్పిబి పేరు చెబుతున్నారు కాబట్టి నేనూ అదే పేరు ప్రస్తావించాను కానీ మనం దీన్ని ఇళయరాజాకి, ఎస్పిబి వంటి కమర్షియల్ సింగర్స్ కి మధ్య తగాదాగా చూడకూడదు. ఇంకొంచెం లోతుగా ఆలోచించాలి. ఎస్పీబి సొమ్ము చేసుకున్నాడనే పాయింట్ బలంగా తాకొచ్చేమో కొందరికి.
కాసేపు ఎస్పిబిని వదిలేయండి. అన్ని భాషలకూ సంబంధించిన కొన్ని వేల మంది చిన్న చిన్న ఎన్నో ట్రూపులకు చెందిన కళాకారులు సినిమా పాటలు పండగల్లో, సంబరాల్లో, జాతర్లలో, పెళ్లిళ్లల్లో పాడి పాడి పొట్టపోసుకుంటారు. రైల్లో గుడ్డి బిచ్చగాదు కూడా పాడి ముష్టి కోసం చేయి చాస్తాడు. సూత్రబద్ధంగా అదీ తప్పేనా? ఇళయరాజా సామాన్యులు పాడుకుంటే అభ్యంతరం పెట్టడం లేదుగా అనొద్దు. ఎందుకంటే అతను అభ్యంతర పెట్టలేడు కాబట్టి పెట్టడు. పెట్టగలిగితే అంతటి చీప్ మెంటాలిటీ, కక్కుర్తీ వున్నవాడే. (ఆ మాటకొస్తే ఆయన కాపీలు కొట్టిన అంతర్జాతీయ గీతాల సంగతేమిటి? ఓసారి “కోర”లో క్వెస్చన్ కొట్టి చూడండి, ఓ పెద్ద లిస్టు వస్తుంది.)
ఇళయరాజా పాటలంటే నాకు పంచ ప్రాణాలు. ఆయన పాటలు వినని రోజంటూ వుండదు నాకు. ఏ గొప్ప కళాకారుడైనా ఆ కళ కంటే, అంతకుమించి న్యాయం కంటే గొప్పోడు కాదు. ఆయన కంపోజ్ చేసిన పాటల కోసం వాడుకున్న రాగాల్ని కనిపెట్టిన వారికి లేని హక్కు వాటిని పట్టుకొని బాణీలు కట్టిన ఈయనకి ఎక్కడ వుంది? ఒకసారి గాలిలో కలిసిన మనోరంజకమైన సంగీతం పాడటం, వినడం మానవ హక్కు. కామర్స్ అన్ని చోట్లా జొరబడితే మనిషి జీవితం నిస్సారమై పోతుంది. ఆయనలోని కళాకారుడికి నా జేజేలు. ఆయనలోని సంకుచిత మనస్కుడికి నా నిరసనలు…
(ఇళయరాజా కొన్నాళ్లుగా కనబరుస్తున్న విపరీత పోకడల మీద ‘ముచ్చట’ పలు స్టోరీలు పబ్లిష్ చేసింది… తన అనుకూల కోణాల్లో కూడా… ఇదేమో తన పెడ ధోరణుల మీద, తన సంకుచిత- శృతితప్పిన తత్వం మీద మరొక స్టోరీ…)
Share this Article