అవి నేను కొత్తగా ఏసీటీవోగా జాయినయిన రోజులు. ఏసీటీవో బాధ్యతల్లో ఆ సర్కిల్లోని సినిమాలన్నింటికి ఎంటర్టైన్మెంట్ టాక్స్ ఆఫీసర్ గా పన్నులు చేయవలసిన బాధ్యత కూడా ఒకటి.
మీరంతా గమనించే ఉంటారు. టిక్కెట్ ధరలో కొంత మొత్తం వినోదపు పన్ను కూడా కలిపే ఉంటుంది. ఒక వారంలో వసూలయిన వినోదపు మొత్తాన్ని మరుసటి వారంలో, థియేటర్ యజమానులు, ప్రభుత్వానికి చెల్లించవలసి ఉంటుంది.
యన్టీరామారావు ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రతీ థియేటరుకు, ఆయా క్యాటగిరీలను బట్టి, అంటే ఏసీ, నాన్ ఏసీ, మున్సిపల్ కార్పొరేషన్, థర్డ్ గ్రేడ్ మునిసిపాలిటీ, గ్రామ పంచాయితీ, టూరింగ్ టాకీస్ వంటి అంశాల ఆధారంగా, పన్నును వినోదపు పన్ను అధికారి ప్రతీ సంవత్సరం సీట్ల సంఖ్యను బట్టి ఒక ఫార్ములా ఉపయోగించి నిర్థారిస్తాడు. ఆ పన్నును ప్రతీ వారం థియేటర్ల వాళ్ళు చెల్లించాలి. ఇది థియేటర్ల వారికి గుదిబండగా మారింది. ఆ కోపాన్ని వినోదపు పన్ను అధికారుల మీద చూపించేవారు.
Ads
అంతకు ముందు రాజభోగాలను అనుభవించిన సేల్స్ టాక్స్ వాళ్ళను, థియేటర్ల వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో నేను ETO గా చేరాను. నా సర్కిల్లో ఐదారు థియేటర్లు ఉండేవి. అందులో ఒక థియేటర్లో, అప్పుడే, ‘మైనే ప్యార్ కియా’ సినిమా విడుదలయింది. సూపర్ డూపర్ హిట్ కావడంతో టిక్కెట్లు దొరకడం లేదు.
మేము నివాసం ఉండేది వరంగల్ మునిసిపల్ ఆఫీసు పక్కనే ఉన్న మునిసిపల్ క్వార్టర్స్ లో. మా జనరేషన్ లో నేనే పెద్దవాణ్ణి. ఆ క్వార్టర్లలో అందరూ అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి ఇరవై మంది వరకు ఉండేవారు. వాళ్ళందరికీ నేను ‘బావ’నే. నన్ను బావా అనీ, మా ఆవిడను ‘అక్కా’ అని పిలిచేవారు. నేను కొత్తగా ఏసీటీవోగా జాయినయ్యాను. నా సర్కిల్లోనే ‘మైనే ప్యార్ కియా’ నడిచే సినిమా థియేటరు ఉండడంతో, వాళ్ళంతా, ఆ సినిమా చూపించమని అడిగారు. నేను ‘సరే’ ఇదే నా పార్టీ అని చెప్పి, టిక్కెట్ల కోసం, #డబ్బులు_ఇచ్చి బాబూరావును పంపించాను. ఆ థియేటర్ యజమాని తిక్క మనిషిలా ఉన్నట్టుంది. టిక్కెట్లు ఇవ్వక పోగా, బాబూరావునూ, నన్నూ, మా డిపార్టుమెంటును అవమానించి పంపాడు. నాకు తల కొట్టేసినట్టయింది. ఆ అవమానాన్ని మనసులోనే ఉంచుతున్నాను. మేం అంత కన్నా చేయగలిగింది ఏమీ లేదు. మాకు థియేటర్ల మీద ఎటువంటి అధికారం లేకుండా చేసారని అందరూ భావించేవారు.
నేను మాతో పాటే ట్రైనింగ్ అయిన డియస్పీ ద్వారా టికెట్లు తెప్పించుకుని సినిమా చూసాము. అప్పుడు నేనొక విషయం గమనించాను. మరునాడు ఆ థియేటర్ రిజిస్ట్రేషన్ ఫైల్ తెప్పించుకుని, స్టడీ చేసాను. యాక్ట్ లోని సంబంధిత సెక్షన్లను క్షుణ్ణంగా అవగాహన చేసుకున్నాను.
నేను అంతకు ముందు యూకో బ్యాంకులో స్టెనోగ్రఫీ పనిచేసాను కాబట్టి, నేనే స్వయంగా ఒక పెద్ద నోట్ టైప్ చేసుకుని, మా సీటీవో (స్వర్గీయ) పుల్లా జాన్ గారి దగ్గరకు వెళ్ళాను. నేను చెప్పాను కదా కొంత మంది మంచి అధికారులు మన పైన బాస్ లుగా ఉంటే, ఉద్యోగ జీవితం సాఫీగా జరుగుతుందని. జాన్ గారు నా నోట్ చదివి,
“నిజమేనా? ఆ థియేటర్ యజమాని అసలే కర్కోటకుడు. తప్పు జరిగితే, నీ మీద, నీతో పాటూ నా మీదా కమీషనర్ కు, మినిస్టరుకు కంప్లైంట్ చేస్తాడు. అప్పుడు నీదే బాధ్యత! మరి” అని, రాతపూర్వకంగా అనుమతి ఇచ్చాడు.
…
అదే రోజు మధ్యాహ్నం నుండి మా టీం ఫామ్ చేసుకున్నాను. ఎక్కడికీ వెళ్తున్నది ఎవరికీ తెలియకూడదని నేను ముందే సీటీవో గారికి చెప్పాను.
మ్యాట్నీ షో వదిలేసి సమయానికి, మేం ఆ థియేటర్ మీద రెయిడ్ ప్రారంభించాము. మెయిన్ గేట్లు మూసి మా అటెండరును అక్కడ నిలబెట్టాను. సినిమా అయిపోగానే, బయటకొస్తున్న ప్రేక్షకుల దగ్గర నుండి మొత్తం టిక్కెట్ల కౌంటర్ ఫాయిల్స్ ను కలెక్ట్ చేసి ప్రేక్షకులను రిలీజ్ చేసాము.
మొత్తం, థియేటర్ సీటింగ్ కెపాసిటీ ఉదాహరణకు 500 ఉంటే, 560 టికెట్ ఫాయిల్స్ కలెక్ట్ అయ్యాయి. అంటే 60 టికెట్లు, మాకు చూపించి అనుమతి తీసుకున్న సీట్ల కంటే, ఎక్కువగా అమ్ముతున్నాడు. ‘J’ ‘H’ అనే క్యాబిన్లను unauthorised గా నడుపుతూ వాటి మీద ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నాడు. ఒక ఇరవై టికెట్లు అదనంగా కుర్చీలు వేసి అమ్ముకుంటున్నాడు.
ఇదంతా అక్కడ మేనేజరుతో పంచనామా రాయించి, ప్రేక్షకులలో ఒక ఐదారుగురిని సాక్షులుగా గుర్తించి, వారి సంతకాలు పేర్లు, అడ్రస్సులు రాసుకున్నాము. మేనేజర్ గజగజ వణికిపోతున్నాడు. థియేటర్ యజమాని ఊళ్ళో లేడు. నేను సీటీవో గారికి ఫోన్ చేసి,
“సార్, నా అబ్జర్వేషన్ కరెక్ట్ సార్! అరవై సీట్లు అదనంగా, unauthorused గా sanctioned seating capacity కన్నా ఎక్కువగా అమ్ముతున్నాడు. కేసు పూర్తిగా కట్టుదిట్టంగా తయారు చేసాను.” అని చెప్పాను.
మా డిపార్టుమెంటులో ఎలా ఉంటుందంటే, అంత గుంభనంగా జరగాలి. పేర్లు బయటకి కావొద్దు. పేపర్లలో పేరు పడకూడదు అని అనుకుంటారు. కాబట్టే, సీటీవో గారు కర్ర విరగకుండా, పాము చావకుండా, “చట్టంలో ఏముందో దాని ప్రకారం చేయండి. నిర్ణయం నీదే!” అన్నారు. అంటే రేపు ఎటుపోయి ఎటు వచ్చినా తనకేం బాధ్యత లేదని చెప్పడమని నాకర్థమైంది.
నాక్కూడా తరువాత చర్య తీసుకోవాలంటే కొంచెం భయమయింది. ఎంతైనా, నేను చిన్నపాటి అధికారిని. ఎదురుగా తప్పు దొరికింది. కానీ, మన వ్యవస్థ ఎలా ఉంది? అధికారం ఉన్నవాడిదే రాజ్యాంగం ఇక్కడ. అప్పటికే ఫస్ట్ షోకు టయమయింది. బయట టిక్కెట్ల కోసం గోల మొదలయింది.
మా స్టాఫ్ కూడా, ‘ఇప్పుడేం చేస్తాడోనన్నట్టుగా’ నా వైపు తమాషాగా చూడసాగారు. నేను కేసు వదిలేసి పోతే డిపార్టుమెంటులో నవ్వుల పాలవుతాను. కేసును ముందుకు తీసుకు వెళ్తే పరిణామాలు తీవ్రంగానే ఉంటాయని కూడా తెలుసు. నేను ఒక ధృఢ నిశ్చయానికి వచ్చాను.
మేనేజరు రాసిన పంచనామా ఆధారంగా, నోటీసు తయారు చేసి, ‘థియేటర్ సీజ్ చేస్తున్నట్టుగా మేనేజరుకు, సీజర్ నోటీస్ ఇచ్చాను. థియేటరుకు తాళం వేసి లక్క సీల్ వేయించాను. దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషనుకు సీజర్ నోటీస్ కాపీ పంపి, సెక్యూరిటీ కోసం పోలీసులను రప్పించాను. నోటీసును జత పరుస్తూ, ఒక డీవో లెటరు రాసి, వరంగల్ జాయింట్ కలెక్టరుకు పంపించి, టైముతో సహా అక్నాలెడ్జ్మెంటు తీసుకోమని చెప్పాను. జాయింట్ కలెక్టర్ థియేటర్లకు లైసెన్సింగ్ అథారిటీ కాబట్టి, ఆయనకు తెలపడం నా బాధ్యత. అట్లాగే మా సీటీవోకు కూడా రాతపూర్వకంగా తెలిపి, థియేటర్ ముందు సీల్ వేసిన చోట కాపలాగా కుర్చీ వేసుకుని కూర్చున్నాను.
అప్పుడు ఆ వార్త కార్చిచ్చులా, అప్పటి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా వ్యాపించింది. సెల్ ఫోన్లు లేని కాలం. కాబట్టి నాకేం ఫోన్ రాలేదు. థియేటర్ లోపల ఫోన్ మోగుతూనే ఉంది కానీ బయట సీల్ ఉండడంతో, మోగుతూనే ఉంది. హైదరాబాదులో ఉన్న యజమాని కారాలూ మిరియాలూ నూరుతూ ఎవరెవరితోనో ఫోన్లు చేయిస్తున్నాడని మా ఆఫీసు నుండి అటెండర్ వచ్చి చెప్పాడు.
సినిమా ఫస్ట్ షో చూడ్డానికి వచ్చిన వాళ్ళు కూడా మమ్మల్ని తిట్టసాగారు. ఫస్ట్ షో టైమయిపోయేంత వరకు నేను అక్కడే కూర్చున్నాను. మా స్టాఫ్ అంతా వెళ్ళిపోయారు. నేనూ మరో ఇద్దరూ, పోలీసులు కాపలాగా ఉన్నాము.
సెకండ్ షో కూడా క్యాన్సిల్ అయిందనిపించి, మేనేజరును మరో మారు హెచ్చరించి నేను ఇంటికి వచ్చాను. గంట తరువాత, థియేటర్ యజమాని మా ఇంటికి వచ్చాడు. నేను అతన్ని కలవలేదు. మరునాడు ఆఫీసుకు రమ్మని చెప్పాను.
మూడు రోజుల తర్వాత సీల్ తీసాను. ఆ అరవై సీట్లకు, ఏప్రిల్ ఫస్ట్ నుండి, సుమారు 8 నెలల పాటు ఎంత పన్ను కట్టాల్సి ఉంటుందో కాలుక్యులేట్ చేసి, పరిహార రుసుముతో సహా వసూలు చేసి, పై అధికారులకు రిపోర్ట్ చేసాను. దాంతో, మా డిపార్టుమెంటులో 90% మంది నన్ను జెలసీతో చూసారు. వారిలో మా బ్యాచ్ ఏసీటీవోలు కూడా ఉన్నారు.
మనం తప్పు చేయనంత వరకు, ఎదుటి వాడు తప్పు చేస్తున్నంత వరకు, ఎవరికీ భయపడనవసరం లేదని నేను తెలుసుకున్నాను. ఎవ్వరు రికమెండ్ చేసినా ‘రాతపూర్వకంగా ఆదేశాలు ఇవ్వండి! పన్ను కట్టే బాధ్యత తీసుకోండి. సీల్ తీస్తాను.’ అని వినయంగా చెప్పాను. మీరేమంటారు?………… డాక్టర్ ప్రభాకర్ జైనీ
Share this Article