Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

I’m a Child of War… అవును! నేను యుద్ధానికి పుట్టిన బిడ్డని…

May 16, 2024 by M S R

Sai Vamshi…..   చుట్టూ ఇనుప కంచెలున్న జైలు – ఒక పాత్రికేయుడి వ్యథ

(ఇరానియన్-కుర్దిష్ పాత్రికేయుడు, రచయిత Behrouz Boochani వివిధ సందర్భాల్లో చెప్పిన విషయాలను ఇక్కడ అనువదించాను).

I’m a Child of War. అవును! నేను యుద్ధానికి పుట్టిన బిడ్డని. యుద్ధం, పేదరికం, కన్నీళ్లు, మరణాలు.. అన్నీ చూస్తూ పెరిగినవాణ్ని. కాసింత తిండి దొరకడాన్ని పండుగలా, కాసింత ఆశ్రయం దొరకడాన్ని వేడుకలా చూసినవాణ్ని. అనంతమైన ప్రేమ, అంతులేని ఆనందం కూడా నా జీవితంలో ఉంది. కానీ నేను వాటి గురించి చెప్పబోవడం లేదు. వాటి గురించి మరెప్పుడైనా చెప్పుకుందాం! ఇప్పుడు నేను మీకు నా జైలు జీవితం గురించి చెప్తాను. జైలంటే మీరూహించిందే! కానీ నేను చెప్పబోయే జైలు మీ ఊహకు అందనంత భయంకరమైనది.

Ads

మాది ఇరాన్ దేశం. కుర్ద్ జాతి. మొత్తం ఇరాన్‌లో మా జనాభా 10 శాతం. నేను 1983లో పుట్టాను‌. ఆ సమయంలో మా దేశం ఎలా ఉందో తెలుసా? ఇరానీ బాతిస్టులకీ, ఇరాకీ జీలట్స్‌కీ మధ్య యుద్ధం సాగుతోంది. అలాంటి సమయంలో నేను భూమ్మీద పడ్డాను. Tarbiat Moallem University నుంచి పొలిటికల్ సైన్స్, పొలిటికల్ జియోగ్రఫీ, జియోపాలిటిక్స్‌లో మాస్టర్ డిగ్రీ పొందాను. కొన్నాళ్ల పాటు ఓ విద్యార్థుల పత్రికలో పనిచేసి, ఆ తర్వాత Freelance Journalist‌గా మారాను. Kasbokar Weekly, Qanoon, Etemaad లాంటి పత్రికల్లో Middle East దేశాల రాజకీయాలు, మైనార్టీల హక్కులు, కుర్దిష్ సాంస్కృతిక పరిరక్షణ మీద వ్యాసాలు రాశాను. మరికొందరితో కలిసి ‘Werya’ పత్రిక ప్రారంభించాను. కుర్దిష్ సాంస్కృతిక, రాజకీయాల పరిరక్షణ కోసమే ఆ పత్రిక ప్రారంభించాం‌.

2013 ఫిబ్రవరిలో Werya పత్రిక కార్యాలయాన్ని Islamic Revolutionary Guard Corps సోదా చేశారు. ఆ సమయంలో నేను అక్కడ లేను. కానీ నాతోటి 11 మంది ఉద్యోగులను వాళ్లు అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఈ విషయం బయటి ప్రపంచానికి తెలిసింది. ఆ తర్వాత కొన్నాళ్లపాటు నేను అజ్ఞాతంలోకి వెళ్లిపోయాను. ఇక అక్కడ ఉండటం ప్రమాదకరం అని తెలిశాక ఇండోనేషియా వెళ్లిపోయాను. ఆ తర్వాత జులైలో 60 మంది శరణార్థులున్న ఓ పడవలో ఇండోనేషియా నుంచి ఆస్ట్రేలియా వెళ్తుండగా Royal Australian Navy అధికారులు మమ్మల్ని ఆపేశారు. మొదట మమ్మల్ని క్రిస్‌మస్ ద్వీపంలో ఉంచి, ఒక నెల తర్వాత 2013 ఆగస్టులో మానుస్ ద్వీపంలోని నిర్బంధ కేంద్రానికి తరలించారు. సముద్ర మార్గం ద్వారా వచ్చే మగశరణార్థులను బంధించేందుకు పసిఫిక్ మహాసముద్రం మధ్యలో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రం అది.

నేను బంధింపబడకూడదన్న ఆలోచనతోనే నా దేశం వదిలి మరో దేశానికి శరణార్థిగా వచ్చాను. కానీ వచ్చిన చోటే నేను బందీగా మారాను. నాలాగా దాదాపు రెండు వేల మంది అక్కడ బందీలుగా ఉన్నారు. మమ్మల్ని తీసుకెళ్లి జైల్లో ఉంచారని మీకు చెప్తే అది మామూలుగానే అనిపించొచ్చు. కానీ మమ్మల్ని ఉంచిన చోటు జైలు కాదు, జైలు కన్నా భయంకరమైనది. మాకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఫోన్లు వాడేందుకు అనుమతి లేదు. మా చుట్టూ ఇనుప కంచెలు, గార్డులు. అదే మా జీవితం. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అక్కడి నుంచి బయటకు రావాలని అనిపించే వాతావరణం అది. కానీ అదే చోట నేను నాలుగున్నరేళ్లు ఉండాల్సి వచ్చింది. 2017 దాకా మా అందరి జీవితాలు అక్కడే గడిచాయి. ఆ తర్వాత మమ్మల్ని అదే ద్వీపంలో మరో చోటికి మార్చారు. మా జీవితాల్లో ఏ మార్పూ లేదు. కేవలం ఒకే ఒక్క తేడా. ఇంతకుముందు మేం బయటికి వచ్చేందుకు అనుమతి లేదు. ఇప్పుడు పగటి పూట మేం బయటకి రావచ్చు. అంతే! చిన్న జైలు నుంచి పెద్ద జైలుకు ప్రమోషన్ రావడం లాంటిదది‌. చుట్టూ కంచెలు, గార్డులు యథాతథంగా ఉన్నారు.

ఆ సమయంలో ‘అమాయకులను నిర్భంధించడం చట్ట వ్యతిరేకం’ అని Supreme Court of Papua New Guinea (PNG) ఆదేశాలు జారీ చేసింది. అది మానవ హక్కుల ఉల్లంఘన అని తెలిపింది. మేం సెల్‌ఫోన్లు వాడేందుకు అనుమతి ఇచ్చింది. అంతకుముందు ఒకటి, రెండుసార్లు నేను ఆ జైల్లోకి దొంగతనంగా సెల్‌ఫోన్లు తెప్పించాను. అందుకోసం నా బట్టలు, వస్తువులు, సిగరెట్లు అక్కడుండే సిబ్బందికి ఇచ్చేశాను. కానీ అప్పుడప్పుడూ గార్డులు వచ్చి మా గదులు సోదా చేసేవారు. సెల్‌ఫోన్లు దొరికితే తీసుకెళ్లిపోయేవారు. అయినా ఎలాగోలా అక్కడి నుంచే నేను The Guardian, The Sydney Morning Herald లాంటి పత్రికలకూ, The Refugee Action Collective, United Nations లాంటి సంస్థలకూ సమాచారం అందించేవాణ్ని. దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు వేరే పేరుతో పత్రికలకు వ్యాసాలు రాశాను. ఆ తర్వాత నాకు ఎలాంటి ప్రమాదమూ జరగదు అని నమ్మకం కుదిరాక నా పేరుతో రాయడం మొదలుపెట్టాను.

మానుస్ ద్వీపంలోని నిర్బంధ కేంద్రం ప్రధాన లక్ష్యం శరణార్థుల సంఖ్య తగ్గించడం. వారి వ్యక్తిత్వాన్ని, వ్యకిగత గుర్తింపునూ నాశనం చేయడం. రాత దాన్ని ఎదుర్కొనేందుకు నాకు ఉపయోగపడింది. నా రాతే నాకు తోడుగా నిలిచి అలాంటి క్రూరమైన వ్యవస్థ నుంచి నా గుర్తింపు, గౌరవాన్ని నాశనం కాకుండా చేసింది. నా దృష్టిలో రాత ఒక ప్రతిఘటన. ఒక నిరసన. నిర్బంధ కేంద్రంలో ఉండగా నాకో విషయం అర్థమైంది. ఇక్కడ మేము ఎంత హింసాత్మక పరిస్థితిలో ఉన్నామో రాసేందుకు సాధారణ పాత్రికేయ భాష సరిపోదు. ఏ వ్యవస్థ మీద అయితే నేను పోరాడాలో ఆ వ్యవస్థే ఏర్పాటు చేసిన భాష అది. ప్రపంచంలో అతి దారుణమైన జైల్లలో ఒకటైన చోట మేం పడే బాధని ఎలా రాయాలి? ఎలా చెప్పాలి?

మేము మీలాంటి మనుషులమే. మావీ మీలాంటి జీవితాలే! మేం బాధపడుతున్నాం. జైలు గోడల మధ్య నలిగిపోతున్నాం. పిల్లలకు దూరమైన తండ్రి ఇక్కడ ఉన్నాడు. తల్లిదండ్రులకు దూరమైన కొడుకు ఇక్కడ ఉన్నాడు. తన వాళ్లు ఎలా ఉన్నారో, అసలు ఉన్నారో లేదో తెలియని స్థితిలో కొందరు ఇక్కడ బతుకుతున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకులు చదువులు లేక ఇక్కడే మగ్గిపోతున్నారు. వాళ్ల ఆశలు, ఆకాంక్షలు అన్నీ ఇక్కడే సమాధి అవుతున్నాయి. వీటిని రాయడానికి నేను సృజనాత్మక భాష (Creative Language)ని ఎంచుకున్నాను. నా ఫోన్‌లోనే చిన్నచిన్న భాగాలుగా ఒక నవల రాసి వాట్సాప్ ద్వారా ఆస్ట్రేలియాలోని నా అనువాదకుడికి పంపాను.

నేనున్నది ఒక జైలు. దాన్ని అలా పిలవడంలోనే ఆస్ట్రేలియా ప్రభుత్వం చెప్పే అబద్ధపు భాష ఆరంభమవుతుంది. నిజానికి జనాన్ని ఒక పద్ధతి ప్రకారం హింసించేందుకు ఏర్పాటు చేసిన స్థలం ఇది. మమ్మల్ని మనుషుల్లా కాక, ఉట్టి వస్తువుల్లా భావించే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకే నేను రాస్తున్నాను. అందుకు Literary Languageని ఒక సాధనంగా వాడుకున్నాను. మానుస్ ద్వీపంలోని నిర్బంధ కేంద్రంలో ఇంకా వందలమంది ఉన్నారు. వాళ్ల కోసం నేను ఇంకా ఇంకా రాస్తూ ఉండాలి. అదంత సులభం కాదు. కానీ రాయక తప్పదు. నా రాతలు ఎక్కడో ఎవర్నో తప్పక కదిలిస్తాయి అనే నమ్మకం నాకుంది. త్వరలో మాకు స్వేచ్ఛ అందుతుంది అనే విశ్వాసం ఉంది…….

(Behrouz Boochani జైల్లో ఉండగా చెప్పిన మాటలివి. ఆయన కోరిక ప్రకారం, అనేక సంస్థల పోరాటం కారణంగా 2017లో మానుస్ ద్వీపంలోని నిర్బంధ కేంద్రాన్ని మూసివేశారు. ఆ తర్వాత ఆయన్ని Port Moresby నగరానికి తరలించారు. ఒక నెల వీ‌సాతో 2019లో న్యూజిలాండ్‌లోని Christchurch నగరంలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆపైన పలు పరిణామాల అనంతరం ప్రస్తుతం న్యూజిలాండ్‌లోని Wellingtonలో ఉంటున్నారు. పలు విశ్వవిద్యాలయాలకు విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ‘Chauka, Please Tell Us The Time’ అనే సినిమాకు Behrouz సహదర్శకుడిగా వ్యవహరించారు. తన అనుభవాలను ‘No Friend But The Mountains: Writing From Manus Prison’ పేరిట పుస్తకంగా రాశారు. ఆ పుస్తకానికిగానూ 2019లో ‘Victorian Prize for Literature’ అందుకున్నారు. 23 దేశాల్లోని 18 భాషల్లో ఆ పుస్తకం అనువాదమైంది. అనంతరం 2022లో ‘Freedom, Only Freedom The Prison Writings of Behrouz Boochani’ అనే పుస్తకం రాశారు)…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions