చాలామంది చాలాసార్లు చదివే ఉంటారు… కానీ ఓ స్వానుభవం ఉంది… అది చాలామంది ఉపయుక్తమయ్యే చాన్సుంది… సో, ఓసారి ఒరిజినల్ కథ చదవండి… పర్లేదు, రోజూ వందల చెత్త థంబ్ నెయిల్ స్టోరీలు చూడటం లేదా ఏం..? ఓ పెద్ద మెగా షిప్… మళ్లి ఇక్కడ ఓ పంచాయితీ దేనికి..?సర్లేవయ్యా, మెగా కాదు… ఒక భారీ ఓడ… సముద్రం నడిమధ్యలోకి వెళ్లాక బ్రేక్ డౌన్ అయ్యింది…
ప్రయాణికులున్నారు… ఆందోళన… ఆలస్యం… ఆతృత… తమ షిప్ టెక్నికల్ స్టాఫ్ ఏవో తిప్పలు పడ్డారు కానీ కాలేదు… 40 ఏళ్ల అనుభవం ఉన్న ఓ మెకానికల్ ఇంజనీర్‌ను పిలిచారు… ఛాపర్‌లో తీసుకొచ్చారు… ఆయన ఓసారి థరోగా చూశాడు… అక్కడక్కడా చిన్న సుత్తితో కొడుతూ ధ్వని వినసాగాడు… మిగతా స్టాఫ్‌కు నమ్మకం లేదు, సోది ఇంజినీర్ అని జోకులు వేసుకుంటున్నారు అప్పటికే…
ఓచోట తనకు రోగం ఏమిటో అర్థమైంది… ఓ స్క్రూ బిగించి, ఆ చిన్న సుత్తితోనే గట్టిగా ఓ దెబ్బ తగిలించేసరికి ఇంజన్ స్టార్టయింది… ఇంజనీర్ సార్ ఇంటికి వెళ్లాక వారం రోజులకు 10 వేల డాలర్లకు బిల్ పంపించాడు… అరె, ఓ చిన్న స్క్రూ, ఓ చిన్న సుత్తిలో ఓ దెబ్బ… దీనికే పది వేలా అనడిగాడు ఓనర్…
Ads
ఎహె, నాకు డిటెయిల్డ్ బిల్లింగ్ కావాలీ అన్నాడు… సరే, అన్న సదరు ఇంజనీర్ చిన్న సుత్తిలో దెబ్బ కొట్టినందుకు 2 డాలర్లు, ఎక్కడ కొట్టాలో కనిపెట్టినందుకు 9998 డాలర్లు అని బిల్ ఇచ్చాడు రివైజ్డ్… ఇక్కడ పాఠం ఏమిటంటే…? రోగకారణాన్ని కనిపెట్టేవాడే తోపు… ఆ అనుభవం, ఆ జ్ఞానం రావడానికి తను ఎన్నో ఏళ్లపాటు వర్క్ చేస్తూనే ఉన్నాడు… దానికి బిల్లు చెల్లించాలి… ఆ చిన్న సుత్తి దెబ్బ సదరు ఓనర్‌కు ఎన్నిరకాల ఫాయిదాను కలిగించిందో తనకూ తెలుసు… సరే, ఇందులో ఎన్ని పాఠాలనైనా మనం చెప్పుకోవచ్చు…
కరోనా కదా… చాలా కార్లు బయటికి తీసేవారే లేరు… కొన్నాళ్లు కారు బయటికి తీసి, స్టార్ట్ చేసి, కాస్త దూరం నడిపించకపోతే బ్యాటరీ డౌన్ అవుతుంది… నిజంగా మనకు అత్యవసరం అయినప్పుడు అది కదలకపోతే అదొక నరకం… నా కారుకీ అదే రోగం… సాయంత్రం పార్కింగులో పెడితే తెల్లారేసరికి బ్యాటరీ డిశ్చార్జ్… దాన్ని స్టార్ట్ చేయాలంటే అదో ప్రయాస…
ఎలాగోలా మన కంభంపాటి వారి లక్ష్మి హుండై వాళ్లకు కాల్ చేస్తే… తెలుసు కదా, కరోనా కాలంలో గిరాకీ లేదు, ఎవడు బకరా దొరుకుతారా అన్నట్టు చూస్తున్నారు… ఆయన గారి టూవీలర్, ఫోర్ వీలర్ సర్వీసులన్నీ అంతే… తీరా కాస్త అటూఇటూ చూసినట్టు చేసి, ముందు సర్వీసింగ్ చేయించుకొండి, 8 వేల మినిమం… స్పేర్ పార్ట్స్ అదనం… తరువాత మొత్తం వైరింగ్ చెక్ చేస్తాం… అది 12 వేలు అన్నాడు మెకానిక్… సర్వీసింగ్ చేయించుకోకపోతే వైరింగ్ చెక్ చేయనుపో అన్నాడు… ఇదేం బ్లాక్ మెయిలింగో అర్థం కాలేదు… నావైపు ఓరకంగా జాలిగా కూడా చూశాడు… తనకే ఏమనిపించిందో ఫాఫం, కారు బయటికి తీసుకొస్తున్నప్పుడు ఓ బ్యాటరీ చూపించండి చాలు అన్నాడు, అటూఇటూ ఎవరూ చూస్తూ, ఎవరూ వినకుండా….
ఓసారి ఎందుకైనా మంచిదని బ్యాటరీ చూపిద్దామని తీసుకెళ్తే… ఈ పంచాయితీలన్నీ ఎందుకు సార్, కొత్తది వేసుకొండి, అని పాతది పీకేసి, కొత్తది బిగించి 7000 తీసుకున్నాడు… ఏం సుఖం..? సేమ్, ప్రాబ్లం… ఇదేందయ్యా సామీ అంటే… బ్యాటరీ బాగానే ఉంది, అని ఓ ప్రైవేటు మెకానిక్ నంబర్ ఇచ్చాడు… తనకు ఫోన్ చేస్తే వచ్చాడు… చూశాడు… నేనొకసారి వేరే ఎక్స్‌పర్ట్ దగ్గరకు వెళ్లొస్తాను సార్ అన్నాడు… కాసేపటికి ఫోన్ చేసి, అసలు కారణం చెప్పాడు…
ఆ రోగం ఏమిటంటే… రిమోట్ ఉంటుంది కదా, అందులో సెల్ లైఫ్ అయిపోయింది… వాచీల్లో వేస్తాం కదా, ఆ టైపు… 20, 30 రూపాయలు దాని ధర… కొత్త సెల్ వేశాడు… మా గురువు వేశాడు సార్ అంటూ తనకు ఓ 500 బిల్లు, తన కన్సల్టేషన్ ఫీజు 400… మరి ఇంకో రిమోట్ ఉంది కదా అనడిగితే మరో 300 తీసుకున్నాడు… సో, రోగకారణం అదీ… రెండుమూడు నెలలు తల తినేసింది… సర్వీసింగ్ స్టేషన్ వాళ్ల ధోరణి మరీ చిర్రెత్తించింది… మొత్తం 20, 25 వేల గేర్ పెట్టాడు వాడు… లక్షల బిల్లులతో రోగనిర్ధారణ పరీక్షలు చేయించి, కమీషన్లు దొబ్బే డాక్టర్లకన్నా రోగి పల్స్ చేసి జాతకం చెప్పే డాక్టర్లున్నారా ఇప్పుడు..?
Share this Article