Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

శ్రీమణికి ఒడుపు చిక్కింది… తెలంగాణ పదాల విరుపు, సొగసు పట్టుకున్నాడు…

February 15, 2023 by M S R

ఇప్పుడు ఓ సినిమాకు సంగీత దర్శకత్వం అంటే రికార్డింగ్ స్టూడియోలో దూరి, నాలుగు ట్రాకులు పాడించుకుని, అన్నీ మిక్స్ చేసుకుని, నిర్మాతకు అప్పగించేయడం కాదు… ట్యూన్ కట్టాలి, ట్రాకులు పాడించుకోవాలి, ఓ సింగిల్ సాంగుగా మార్చాలి, హీరోతో నాలుగు స్టెప్పులు వేయాలి, రిలీజ్ చేసిన సింగిల్స్‌లో తనే ప్రముఖంగా కనిపించాలి… వీలైతే పాట కూడా తనే రాసుకోవాలి, లేదంటే కొరియోగ్రఫీ కూడా చేయాలి…

ఎక్కడో తిరుచిరాపల్లిలో పుట్టిన సంతోష్ నారాయణన్‌కు కూడా ఈ విషయం బాగానే అర్థమైంది… దసరా సినిమాలో ఓ సింగిల్ రిలీజైంది కదా… అందులో సంతోష్ ఎగురుతున్నాడు, పాడుతున్నాడు, గిటార్ వాయిస్తున్నాడు, ఏవేవో ఉద్వేగాల్ని ప్రదర్శిస్తున్నాడు… మొత్తానికి ఆ వీడియోకు తనే హీరో… కానీ ఏమాటకామాట, ఎక్కడో పుట్టిన తను తెలంగాణ పదాల్ని, ఆ విరుపును బాగానే పట్టుకున్నాడు… అంతేకాదు, ట్యూన్ కూడా బాగుంది… ఆపాట పేరు ‘ఓరి వారి’…

రస్టిక్ స్టయిల్‌లో నాని ఈ సినిమాలో కొత్తగా కనిపిస్తున్నాడు… బహుశా పుష్ఫ హిట్టయ్యింది కదా, మనమూ అదే లుక్కు ట్రై చేద్దాం, కాస్త నెగెటివ్ షేడ్స్ కూడా పెట్టేద్దాం అనుకున్నారేమో… పుష్పలో ఎర్రచందనం అయితే దసరాలో బొగ్గు… అంతా సింగరేణి ఏరియాలోనూ షూటింగ్ చేస్తున్నట్టున్నారు… ఆమధ్య ఓ సింగిల్ రిలీజ్ చేశారు కదా, కాసర్ల శ్యామ్ రాశాడు… స్మిత బార్ దగ్గర 90 కొడుతూ నాని పాడే పాట… మంచి తెలంగాణ పదాలు పడ్డాయి… తను తెలంగాణవాడే కాబట్టి ఆ ఒడుపు, ఆ విరుపు పట్టుకున్నాడు… కానీ ఇప్పుడు చెప్పబోయే ఈ ఓరివారి పాట రాసింది శ్రీమణి… తన రూట్స్ చీరాల… చాన్నాళ్లు గోదావరిఖనిలో ఉన్నాడు కాబట్టి తెలంగాణ స్లాంగ్, జీవితం తెలుసని నాని ఏదో చెప్పినట్టున్నాడు…

Ads

ముందుగా పాట చదువుతాం అంటారా..? ఇదుగో…


ఒరి వారి, నీది గాదుర పోరి

ఇడిసెయ్ రా, ఇంగ ఒడిశెను దారి

ఓపారి అవ్వ ఒడిలో దూరి

మరిసెయ్ రా చిన్న మొల్లిగ మారి

బాల్యమే గొప్పది బాధ మరిశిపోతది

చందమామ రాదనే నిజం నమ్మనంటది

చిన్నపల్లి పట్టీకే ఏడుపాపి చూస్తది

కోడె ఈడు సెడ్డది

నిజాన్ని కోడై కూస్తది

బజ్జోరా, సంటి బిడ్డగ మారి

ప్రేమ నాలో దాచిన

చిన్న బొడ్డెమ్మగానే గావురంగ

నిన్ను నేనె వద్దనీ

గిరి గీసుకున్న గింత దెల్వకుంట

రగిలే వేదనే దీపమోలె వెట్టినా

పేర్చిన బతుకమ్మనే

కన్నీళ్లలో సాగదోలిన

ఇడిచేసి వదిలేశిన

రెక్కలిరిగిన ఈగ

సుడిగాలిలో సిక్కినట్టు

దిక్కుమొక్కులేని కన్ను

ఎక్కి ఎక్కి ఏడ్షినట్టు

నీకు దగ్గరవ్వలేక

దూరమయ్యే దారిలేక

చితికిపోయే నా బతుకిలా

గుండె పుండు మీద

గొడ్డుకారమద్ది గుద్దుతుంటే

గుక్కపెట్టి ఏడ్వలేని జన్మా


తెలంగాణ పదాలు మంచి పడ్డయ్ కొన్ని… ఓరివారి, సిన్న మొల్లిగ మారి, పల్లి పట్టీ, గావురంగ… తెలంగాణతనం, సాహితీస్పృహ కూడా ఉంది… పేర్చిన బతుకమ్మను కన్నీళ్లలో సాగదోలిన, బొడ్డెమ్మలా గావురంగ చూసుకున్నా, రగిలే వేదనే దీపంలా పెట్టినా… ఇలా కొన్ని… తెలంగాణ పదాలు తెలియని వాళ్లకు సమజ్ కాకపోవచ్చుగాక, తెలంగాణ వాళ్లు ఎంజాయ్ చేయొచ్చు… కాకపోతే బజ్జోరా, బాల్యం, గొడ్డుకారం, గిరిగీసుకోవడం వంటివి కొన్ని పాటలో కాస్త పంటికింద రాళ్లలా ఉన్నయ్…

అయితే పాటలో… ప్రియురాలు దూరమైతే ప్రేమికుడు ఏదో గీతం పాడుకుంటాడు సరే… అవ్వ ఒడిలో చేరి అన్నీ మరిచిపోతాడు సరే… కానీ ఈ ప్రేమ వెతలకూ బాల్యానికీ ముడిపెట్టడం కొంత ఆడ్‌గా ఉంది… ఏమో, కవి హృదయం అర్థం కాలేదు, సగటు ప్రేక్షకుడికి అర్థం కాకపోతే ఆ కవి హృదయానికీ అర్థం లేదు… పైగా ప్రేమ విరహాన్ని మరిచిపోవడానికి అమ్మ ఒడిలో పడుకుని ఊరట పొందడం వరకూ వోకే… కానీ అమ్మ ఒడి ఎప్పుడూ మనిషిని బాల్యంలోకి తీసుకుపోదు… ప్రేమవిరహానికి చిన్ననాటి జ్ఞాపకాలు విరుగుడూ కాదు… ఏమోలే, రాసింది శ్రీమణి కదా, ఏదో మనకు అర్థం కాని మార్మికభావన ఏదో ఉండే ఉంటుంది… అది తనకు మాత్రమే తెలుసు… ప్రేక్షకుడికి తెలియాల్సిన అవసరమే లేదు… అంతేనా నానీ..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రేవంత్ రెడ్డి ప్రదర్శించిన అరుదైన గౌరవం… రోశయ్యకు ఘన నివాళి…
  • మార్గన్..! ఆ ‘బిచ్చగాడు’ గుడ్డిగా ఓ దర్శకుడిని నమ్మి మునిగిన కథ..!!
  • అవునూ హరీషూ… కొండగట్టు బస్సు ప్రమాద మృతులు గుర్తున్నారా..?!
  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions