Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ టైగర్ నాగేశ్వరరావును మరోసారి ఎన్‌కౌంటర్ చేశారు కదరా…

October 21, 2023 by M S R

Gurram Seetaramulu…. ఆకలికీ అన్నానికీ దూరం పెరిగింది. ఇది ఇప్పటి సమస్య కాదు, వ్యవస్థ పుట్టిన దగ్గర నుంచి ఆధునిక రాజ్యాలు అవతరించిన దగ్గరి నుండి ఈ ఆకలి మరీ పెరిగింది… ఆకలి మరీ విచిత్రమైనది, దానికోసం ఎన్ని యుద్దాలు జరిగాయో… రాళ్ళు, ఎముకలు ఆయుధాలుగా చేసుకున్న దగ్గర మొదలై యుద్ద విమానాలు, మోర్టార్లు, క్షిపణులతో దాడులు చేసుకునే దాకా.., నిన్న మొన్నా జరిగిన జరుగుతున్న రష్యా- ఉక్రెయిన్ , ఇజ్రాయల్- గాజాల దాకా జరిగిన మారణహోమాల వెనక ఆకలి ఉంది, స్వావలంబన ఉంది…

కాళ్ళ కింద మాయం అవుతున్న నేల తల్లి క్షోభ ఉంది. ఆకలి తీరింది సరే, తర్వాత ఏమిటి ? అది తీరితే ఐశ్వర్యం అంతస్తులూ పెరుగుతాయి. విషాదం ఏమిటి అంటే ఆ పెరిగే ఐశ్వర్యం వెనక ఎండిన డొక్కలు ఉంటాయి. కొందరు ఆకలిని కులాన్ని వంటి మీద గాయంలా దాచుకోవాలి అనుకుంటారు, మరికొందరు తమ కుల ప్రవరను, ఐశ్వర్యాన్ని నగలుగా ప్రదర్శన చేస్తారు. ఈ ఆకలికీ అన్నానికీ మధ్య దూరం పెరుగుతున్న కొద్దీ పులివెందుల, బిట్రగుంట, దొంగ లింగాల, స్టువర్ట్ పురం, సీతారాం పురం (మంగళగిరి) లాంటి మన వంటి మీద కురుపులు గా మొదలై రాచపుండులా సలపరం పెడుతూ ఉంటాయి.

లోతుగా పోతే రెండు వేల ఏళ్ళ లోతైన ఘన చరిత్ర ఉంది. దొంగల గురించి మాట్లాడడం మనకు సిగ్గు బిడియం… మన దృష్టిలో దొంగలు అంటే రోజువారీ పనుల్లో చైన్ స్నాచ్ లూ చిన్న చిన్న దొంగతనాల గురించే వింటాము. పోలీసుల దృష్టి కూడా వేళ్ళ మీదనే ఉంటది. విషాదం ఏమిటి అంటే ఈ దొంగ తనాలలోనూ పోలీసుల వాటా ఉంటది. అలా వ్యవస్థీకృత హింసకు మిగిలిన రాచపుండ్ల ఆనవాళ్ళు ఆ ఊళ్లు…

Ads

ఇందులో స్టువర్ట్ పురం అనే ఊరు బాగా ప్రాచుర్యంలో ఉంది కానీ దాని కేంద్రంగా జరిగిన దొంగతనాలు ఉల్లిగడ్డ మీద పొట్టు అంత. వెంగల్ రెడ్డి, పండుగ సాయన్న, సర్వాయి పాపన్న, మీరే సాబు, బల్మూర్ కొండల్ రెడ్డి, బల్మూర్ బాలమ్మ (అద్దాల బాలమ్మ) హీరాబాయి కురుమయ్య ,పాపిరెడ్డి… వీళ్లంతా టైగర్ నాగేశ్వరరావు దొంగ తనాలు మొదలు పెట్టక ముందే ఉన్నోళ్లను దోచి లేనోళ్లకు పెట్టినోళ్లు… ప్రజలు వాళ్ళను తమ వీరగాధల్లో నిలుపుకొని ఈనాటికీ గానం చేస్తున్నారు.

పోలీసులు వాళ్ళ పైత్యంతో వాళ్ళను ద్రోహులుగా, దొంగలుగా రికార్డులను పదిలం చేసి ఉంచారు. దొంగల గురించి వేశ్యల గురించి ఇలా బహిరంగంగా చర్చ చేయడం మన రోజువారీ చర్చల్లో అకడమిక్ వ్యవహారాల్లో అసలు ఉండదు, కానీ పద్దెనిమిదో శతాబ్దపు చివరి భాగంలో లండన్, అమెరికా కేంద్రాలుగా మంచి అధ్యయనాలు జరిగాయి. పందొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఎరిక్ హాబ్స్ వామ్ లాంటి వాళ్ళు సీరియస్ అధ్యయనం చేసారు.

టైగర్ నాగేశ్వరరావు సినిమా చూసా… మా తమ్ముడు ఆ సినిమా మీద ఆంధ్రా హైకోర్ట్ లో పిల్ వేసాడు, రోజూ ఆ సినిమాలో ఉన్న వికృతం గురించి చెప్పేవాడు. అన్నా, మీరు సినిమా చూడండి అంటే నిన్న వెళ్ళా. పరమ దుర్మార్గమైన సినిమా. ఇది టైగర్ నాగేశ్వరరావు అలియాస్ గరిక నాగేశ్వరరావు అనే ఒక ఎరుకలి కథ. తాను పుట్టక ముందే తన పూర్వీకులను దొంగల జాబితాలో కల్పిన కథ. ఆకలి తరిమితే పూర్వీకుల నుండి పుట్టు మచ్చగా సంక్రమించిన పుట్టు దొంగ కథ.

నేరాన్ని, చోరీని పుట్టుమచ్చలుగా మిగుల్చు కున్న నాగేశ్వరరావు లాంటి వందలాది మంది కథ… సినిమా మొదలు కావడమే టైగర్ నాగేశ్వరరావు క్రూరుడు అనీ, వ్యభిచారి అనీ, భారత దేశ అంతర్గత ముప్పు అనే రీతిలో ఢిల్లీ క్రైం బ్రాంచ్ హెడ్ క్వార్టర్ కేంద్రంగా కథను నడిపారు. సినిమా అంతా అబద్దాల మయం. కల్పితం అని చెప్పి టైగర్ నాగేశ్వరరావు పేరువేయడం మించిన ద్రోహం లేదు.

కొన్ని కులాలను నూటా యాభై ఏళ్ళ కింద బ్రిటిష్ పాలకులు ఉద్దేశపూర్వకంగా హత్యలు దోపిడీలు దొంగతనాలు చేసేవారు అని నేర జాబితాలో వేసారు. అదే పని ఈ కాలపు సినిమా మాఫియా కొనసాగిస్తోంది. పులివెందుల, బిట్రగుంట, దొంగ లింగాల, స్టువర్ట్ పురం, సీతారాంపురం కేంద్రంగా తయారయిన రాజకీయ లిక్కర్ మాఫియా వెనక టైగర్ నాగేశ్వరరావు, ఆయన పూర్వీకుల త్యాగాలు లేవని మనం చెప్పగలమా ?

ఇంత చేసినా టైగర్ నాగేశ్వరరావు పోయాక స్మశానంలో కాసింత జాగా, తన బార్య మణెమ్మకు చిన్నపాటి కొలువు తప్ప మిగిలింది ఏమీ లేదు. నిన్ననే ఒక పేపర్ లో చూసా, గడిచిన తొమ్మిదేళ్ళలో ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయల ప్రజల సొమ్ము అప్పనంగా తిని దర్జాగా బ్రతుకుతున్న దొరల గురించి చదివా.., ఆ దొరలు విదిల్చిన చిల్లర మీదనే స్టువర్ట్ పురం టైగర్ నాగేశ్వరరావు శీలం మీద చెప్పబడిన సినిమా తీర్పు ఇవ్వాళ వెండితెర మీద తన అబద్దపు క్యాట్ వాక్ చేస్తోంది.

టైగర్ నాగేశ్వరరావు మీద దొంగ దెబ్బ తీసాడు దర్శకుడు వంశీ చౌదరి . ఇందులో బలంగా తీయాల్సిన భాగం జాషువా బిడ్డ హేమలత. ఆమె మీద కూడా సరైన దృష్టి పెట్టలేదు. నేను ఆమెను అత్తా అనేవాణ్ణి . ఆమెను అలా తెరమీద చూడడం కొంచం భావోద్వేగానికి గురైనా. ఎందుకంటే ఆమె నాకు బాగా దగ్గర మనిషి. టైగర్ నాగేశ్వరరావు బ్రతుకునీ చావునీ క్రూరంగా చూపిన దర్శకుడు ఆయన పోయాక మూడు రోజులు పాటు ఆయన పార్ధివ దేహాన్ని తన తమ గూడేలలో దండోరా వేసిన నిజాలు తీసే సాహసం చేయలేక పోయాడు.

టైగర్ నాగేశ్వరరావు ధిక్కారంలో కొందరు తిరుగుబాటుని చూసారు, మరికొందరు దొంగను, వ్యభిచారిని చూసారు. నిన్న ఖమ్మంలో టైగర్ నాగేశ్వరరావు తెర మీద కనబడ్డ ప్రతిసారీ ఈలలు చప్పట్లు గమనించా. పాతికేళ్ళ లోపు ఎరుకలి పిల్లలు నాగేశ్వరరావు విజయాలను ఈలలు వేస్తూ, చావుని కన్నీళ్ళతోనూ చూడడం గమనించా. నిజాలు తెలిసిన నేను దర్శకుని అజ్ఞానాన్ని తిట్టుకుంటూ, నిస్సహాయంగా బయటకు వచ్చా. ఏది ఏమైనా పాలకల వంటి మీద రాచపుండు లాంటి టైగెర్ నాగేశ్వరరావుని మరోసారి బహిరంగంగా ఎన్కౌంటర్ చేసారు అనిపించింది… seetaramulu@gmail.com

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions