Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆయనే శంకరాభరణం శంకరశాస్త్రి పాత్రకు ప్రేరణ… మరి ఆ శిష్యుడు..?!

May 1, 2025 by M S R

.

………. By….. Amarnath Vasireddy………. శంకరాభరణం : ఈ సినిమా గురించి తెలియని తెలుగు వారుండరు. ఇది సినిమా రివ్యూ కాదు. ఒక వ్యక్తిత్వంపై సమీక్ష. నేను ఈ సినిమా చూసేనాటికి లోకజ్ఞానం తెలియని బాలుడు. అటుపై సినిమా పూర్తిగా చూసే అవకాశం దక్కలేదు. పొద్దునే యూట్యూబ్ లో మొత్తం సినిమా చూసాను.

సినిమా గొప్పతనం గురించి, కర్ణాటక సంగీతం గురించి ఇక్కడ రాయడం లేదు. సూర్యకాంతి మొక్కకు సూర్యుడి పరిచయం అవసరం లేదు. చెప్పాలనుకున్నది శంకరశాస్త్రి వ్యక్తిత్వ లక్షణాల గురించి. { పర్సనాలిటీ ట్రైట్స్ }. ముందుగా నా అర్హత , అనుభవం గురించి రెండు మాటలు…

Ads

మంగళంపల్లి బాల మురళికృష్ణ గారితో రెండుసార్లు కచేరీలు నిర్వహించాను. అనేక గంటలు ఆయనతో గడిపాను. బాల మురళి గారి సీనియర్ అన్నవరపు రామస్వామి గారు. వయస్సు 95. మొన్న కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది .

Sankarabharanam_Movie

బాల మురళి గారు, అన్నవరపు రామస్వామి గారు ఇద్దరూ విజయవాడలోని మా పాఠశాలను ప్రారంభించి, తొలి పాఠంగా మా విద్యార్థులకు సంగీత పాఠాన్ని నిర్వహించారు. నేను తిరువాయూరులో జరిగే త్యాగరాజ ఆరాధనోత్సవాలు వెళ్ళాను. ఎంతో మంది ఉన్నత సంగీత విద్వాంసులతో మంచి సాన్నిహిత్యం వుంది…

నేను సైకాలజిస్ట్ కూడా. ఎన్నోసార్లు ఎంతో మంది తత్వాలను విశ్లేషించాను. ఈ అనుభవంతో శంకర శాస్త్రి పాత్ర కేరక్టరైజేషన్ మీద విశ్లేషణ.
1. మెండైన ఆత్మ విశ్వాసం – ఒక్కోసారి అది కాస్త ఎక్కువేమో అనిపిస్తుంది. కానీ పేరొందిన కళాకారుల్లో ఇది కనిపిస్తుంది. ఇది సహజం. కాకుంటే ప్రతికూల పరిస్థితుల్లో వారు ముందుకు సాగలేరు.

2 . తనపై తనకు నమ్మకం వుండే వ్యక్తి ఎంతటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ఎదురొడ్డి నిలుస్తాడు. ప్రపంచాన్నే ఎదిరిస్తాడు. తోటి కళాకారులు నిందించినా, ఊరంతా గుసగుసలాడినా శంకరశాస్త్రి పట్టించుకోలేదు. తాను చేస్తున్నది సరైనదే అని నమ్మకం ఉన్నవాడు అలాగే ప్రవర్తిస్తాడు .

మంగళంపల్లి బాలమురళి ఎన్టీఆర్ పై అలిగి చెన్నై వెళ్ళిపోయాడు. కొంతమంది ఎంత నచ్చచెప్పినా వినలేదు. ఇక ఎన్టీఆర్.. తాను మంచి అని నమ్మితే ఎంతటి ప్రతికూల పరిస్థితి అయినా చేసేసేవాడు. ఇద్దరిదీ చిన్న పిల్లల మనస్తత్వం. వేరే వారు చేబితే వినేరకం కాదు.

వీరిద్దరికీ ఎందుకు పొసగకుండా పోయిందో ఇప్పటిదాకా సరైన విశ్లేషణ రాలేదు. ఒకటి మాత్రం నిజం. కుట్రలు లేవు. అవమానాలు లేవు. ఎదిగిన ఇద్దరు పిల్లలు పరస్పరం అలిగారు, అంతే.. అటుపై కలిశారు. కథ సుఖాంతం. (ఈ బాలమురళి ప్రస్తావనకూ శంకరాభరణానికీ లంకె ఉంది)

 

sankarabharanam

3 . నిండు కుండ తొణకదు. కంచు మోగునట్లు బంగారు మోగదు. గొప్పవారందరూ మితభాషులే. మాట్లాడే ప్రతి మాటకు ఎంతో అర్థం ఉంటుంది. విజయవాడ స్కూల్ ప్రారంభం సందర్భంగా బాల మురళి గారిని హిందూ విలేకరి కర్ణాటక సంగీతం భవిష్యత్తు గురించి అడిగారు.

” ఏమీ బెంగ లేదు. ఎవరి సాయం అవసరం లేదు” అని రెండే మాటల్లో బాల మురళి గారు సమాధానము ఇచ్చారు. విలేకరి ఇది అసంపూర్ణం ఐన జవాబు అన్నట్టుగా మొఖం పెట్టి “సర్ మీరైనా చెప్పండి.. ఇంకాస్త టైం ఇవ్వమని చెప్పండి.. డిటైల్డ్ గా మాట్లాడమనండి” అని నాకేసి చూసారు, నాకేమో ఆయన మొత్తం సమాధానం ఇచ్చారు అనిపించింది. నవ్వి ఊరుకున్నాను.

4 . అద్భుత ప్రతిభ పాటవాలు కలిగిన వారు కులము మతము లాంటి గోడలకు అతీతంగా ప్రవర్తిస్తారు. ఆపన్నులను ఆదుకొంటారు. అది తమ కనీస బాధ్యత అని భావిస్తారు. తాము చేసే పనులకు పబ్లిసిటీ రావాలని కోరుకోరు. అనవసరంగా అవతలి వారిని పొగడరు.

తప్పనిసరి పరిసితుల్లో అవతలి వారికి చక్కటి మాటలతో బుద్ధి చెబుతారు. వెస్ట్రన్ మ్యూజిక్ గ్యాంగ్ కు శంకర శాస్త్రి బుద్ధి చెప్పిన తీరు సంగీతానికి స్వపర బేధాలు వుండవు అనడం.. అయన విశ్వజనీన దృష్టి కోణాన్ని విశాల “దృక్పధాన్ని సూచిస్తుంది. అనేక మంది గొప్పవారిలో ఈ గుణం నేను చూసాను.

5 . మాట కఠినం.. మనసు వెన్న. కోపం ఎక్కువ. అది పాల పొంగులాంటిది. విజయవాడ సంగీత కళాశాల ప్రాంగణం. బాల మురళి గారి సన్మానం కచేరి ప్రారంభం కాబోతుంది. ముందుగా మా స్లేట్ పిలల్లు పౌరాణిక నాటకాన్ని ప్రారంభించారు. ఆయన నాకేసి కోపంగా చూస్తూ “ఇవన్నీ ఇప్పుడు నేను చూడాలా? లేచి హోటల్ కు వెళతాను” అన్నారు.

 

sankara sastri

నాకు తెలుసు ఆయన కోపం పాలపొంగు అని. సర్.. మా పిలల్లకు మీ ఆశీర్వాదం కావాలి” అన్నాను. కాసేపటికి అయన మొఖంలో కోపం స్థానంలో చిరునవ్వు.. శంకర శాస్త్రితో ఎవరైనా మాట్లాడాలంటే భయం. ఒక్క అల్లు క్యారెక్టర్ కు తప్పించి. బాలమురళి గారికి కోపం వస్తే సర్ది చెప్పేవారు లేరట…

6 . బాధ కలిగితే ఏడవాలి. నవ్వొస్తే నవ్వాలి. ఇన్నాళ్లు శంకరాభరణం సినిమాపై నాకు ఒక కంప్లెయింట్ ఉండేది. ఉన్నట్టుండి శంకరశాస్త్రి, మంజుభార్గవి పాత్ర .. ఇద్దరు ఒకేసారి మరణించడం నాకు కృతకంగా అనిపించేది.

ఇన్నాళ్లకు తన సంగీతానికి గుర్తింపు, అలాగే కళంకితగా లోకం చీదరించుకొన్న ఒక అమాయకురాలు ఇవన్నీ చేసింది అని పంతులు గారిలో ఉద్వేగం.., తన కొడుకు, తన గురువు శంకర శాస్త్రిలాగే పాడడం, ఆయన చేతనే గండపెండేరాన్ని పొందడం, ఇక తాను సాధించాల్సింది ఏముంది అని మంజు భార్గవి పాత్ర ఉద్వేగం… ఇద్దరు మానసికోద్వేగాలు దాచుకొనేవారు.. గుండెపోటు రావడం సహజం. కొన్నింటిని అర్థం చేసుకోవాలి అంటే కొంత పరిణతి ఉండాలి.

విశ్వనాథ్ గారు ఎవరెస్ట్ శిఖరం. ఆయన గురించి చెప్పేది ఏముంది? కానీ శంకర శాస్త్రి పాత్ర మలచిన తీరు చూసి నాకు ఇది కేవలం కల్పితం కాదు. నిజ జీవిత పాత్ర స్ఫూర్తితో రూపొందింది అనిపించింది. ఎవరా నిజజీవిత పాత్ర? బాలమురళి గారు? కాదు. కొన్ని విషయాల్లో పోలిక వున్నా మరి కొన్ని విషయాల్లో చాలా స్పష్టమయిన తేడాలు వున్నాయి.

పైన పేర్కొన్న అన్నవరపు గారి ప్రియ శిష్యుడు మోదుమూరి సుధాకర్ గారు. అద్భుత గాయకుడు. నాకు మంచి మిత్రుడు. ఏమంటాడంటే… ‘‘శంకర శాస్త్రి పాత్రకు ప్రేరణ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు. పంతులు గారి విగ్రహం విజయవాడ అలంకార్ థియేటర్ కూడలిలో వుంది.

parupalli

 

రామకృష్ణయ్య పంతులు గొప్ప గురువు. పైసా పుచ్చుకోకుండా ఎంతో మందిని గొప్పకళాకారులుగా తీర్చిదిద్దారు. ఆయన శిష్యులే అన్నవరపు రామస్వామి గారు.. మంగళంపల్లి బాలమురళి గారు. రామస్వామి గారి మనుమరాలి భర్త మాండొలిన్ శ్రీనివాస్. అన్నవరపు గారి శిష్యుడు సుధాకర్ గారు. సుధాకర్ స్వయానా పారుపల్లి వారి సోదరి మనువడు…

‘శంకరాభరణం’ సినిమాలో శంకరశాస్త్రిగారి పాత్రకు ప్రేరణ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు… 1980లో వచ్చింది ఆ సినిమా… మొదట్లో సినిమా ఆడకపోెయినా తరువాత పుంజుకుని సూపర్ హిట్టయింది… విశ్వనాథ్ గారు విజయవాడ వచ్చి, గాంధీనగర్ లోని పంతులుగారి విగ్రహాన్ని దర్శించుకొని, పూలమాల వేసి, వారికి తన కృతజ్ఞత తెలుపుకున్నారు.

పారుపల్లివారి కట్టు, బొట్టు, తలపాగా, కోటు,నడక, వారి హుందాతనం, మితభాషణ… ఒక్కటేమిటి?.. అన్నిటికీ సజీవ రూపాన్నిచ్చారు. పంతులు గారి జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలు, వారి నిస్వార్థ సంగీత సేవ.. వీటిని తన చిత్రంలో ఎంతో అందంగా మలచారు విశ్వనాథ్ గారు. శంకరశాస్త్రి గారి శిష్యుడి పాత్రకు కూడా పంతులు గారి శిష్యుడైన ‘బాల’మురళి యే ప్రేరణ…

ఆ సినిమా చివరలో శంకరశాస్త్రి గారికి వయోభారం చేత పాడలేని పరిస్థితి వస్తే, వేదికపైకి శిష్యుడువచ్చి, గురువుగారు ఆగిన చోటు నుండి అందుకొని, పాటని రసవత్తరంగా పూర్తి చేస్తాడు. దాదాపు అటువంటి సంఘటనే పంతులు గారి జీవితంలోనూ జరిగింది.

sankarabharanam

1942… త్యాగయ్యగారి ఆరాధనోత్సవాలు తిరువయ్యారులో జరుగుతున్నాయి. అందులో గానం చేయడానికి పంతులు గారికి గంట సమయం కేటాయించబడింది. పంతులు గారు తనతో తన శిష్యుడు, 12 సంవత్సరాల మురళిని కూడా అక్కడికి తెచ్చారు.

అప్పటికే తెలుగునాట బాల గాయకుడిగా పేరుతెచ్చుకున్న మురళి చేత ఆ పవిత్ర స్థలంలో పాడించి, పెద్దల ఆశీస్సులకు పాత్రుణ్ని చేయాలని నిశ్చయించుకున్న పంతులు గారు, నిర్వాహకులతో తనకు ఆరోగ్యం సరిగా లేదని, అందుచేత, తనకు బదులుగా తన శిష్యుడికి రెండు కీర్తనలు పాడే అవకాశం ఇవ్వవలసిందిగా విన్నవించుకొని, ఎలాగో ఒప్పించారు. ఎంతో అరుదైన తన అవకాశాన్ని శిష్యుడి కోసం త్యాగం చేశారాయన… మురళిని తానే వేదికనెక్కించారు.

ఆజానుబాహులైన ప్రక్కవాద్య కళాకారుల మధ్య… అర్భకుడైన బాలమురళి ప్రేక్షకులకు కనిపించకపోవడంతో ఒక పీటను తెప్పించి, దానిపై కూర్చుండబెట్టారు. కచేరీ ప్రారంభం అయింది. మురళి గానానికి శ్రోతలు పరవశించిపోయారు.

రెండు కీర్తనలు నాలుగయ్యాయి.. మరొక పావుగంట.. మరొక అరగంట.. ఇలా మూడుసార్లు సమయం పొడిగించబడింది. జనం ఆ గంధర్వ గానానికి మంత్రముగ్ధులయ్యారు.. బాలమురళికి బ్రహ్మరథం పట్టారు… దానికి కాస్త కల్పన కలిపితే శంకరాభరణం క్లైమాక్స్… అంతే…!

(సాగరసంగమం సినిమా విశేషాల కోసం పాత పోస్టులు సెర్చ్ చేస్తుంటే ఈ స్టోరీ కనిపించింది… కొత్త పాఠకుల కోసం మరోసారి రీపబ్లిషింగ్… ఐతే ఇదే శంకరశాస్త్రి, తులసి పాత్రలకు సంబంధించి ఖదీర్ బాబు రాసిన మరో స్టోరీ కూడా ఉంది… అదీ కాసేపాగి చెప్పుకుందాం, మరో స్టోరీలో…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సార్, మా కరెంటు కనెక్షన్ తీసుకుంటారా..? బోలెడు ఆఫర్లున్నాయి..!!
  • Amitabh Bachchan: The Timeless Titan of Indian Branding
  • ఈ వయస్సులోనూ అత్యంత విలువైన బ్రాండ్ ప్రమోటర్… బిగ్ బీ..!!
  • The Cremator: One Woman’s Sacred Mission to Honor 4,000 Souls
  • భయాన్ని దహనం చేసిన మహిళ — 4 వేల శవాలకు అంత్యక్రియలు…
  • కొడుక్కి ఓ హిట్ కోసం… అల్లుడు నిర్మాతగా… అక్కినేని తెరప్రయత్నం…
  • శవాన్ని ఓవెన్‌లోకి తోశారు… ఏదో కాలుతున్న ధ్వని… ఖాళీ స్ట్రెచర్ బయటికి వచ్చింది…
  • డిస్టర్బింగ్ సీసీటీవీ ఫుటేజీ… కొన్ని జవాబులు దొరకని ప్రశ్నలు కూడా…
  • ‘‘నీ ఏడుపేదో నువ్వేడువు… నాకన్నా ఎక్కువ ఏడువు… నేనేమైనా వద్దన్నానా..?’’
  • అమ్మతనం అంటే అన్నీ సహించడం కాదు… కొన్ని వదిలించుకోవడం కూడా..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions