ప్చ్… ఇంకా ఊరూరికీ గొర్ల యూనిట్లు పెంచాలె సారూ అని చెబితే విన్నారా..? వినకపోతిరి..? అక్కడికి అధికార పార్టీ ఎమ్మెల్యే నోరు విడిచి, నాటు కోళ్లను కూడా పంపిణీ చేయాలి అన్నాడు… వినకపోతిరి…? అరె… ఇంకా ఉపఎన్నికలు వస్తాయేమో… కోడిచికెన్, మేకమటన్ లేకపోతే ముద్దదిగని కార్యకర్తలు, నాయకులు ఉంటారు… కులసంఘాల నేతలుంటారు… ఊళ్లల్లో పెద్దమనుషులుంటారు… ఏం సారూ, ఎన్నికలొచ్చినప్పుడైనా జెర మసాలా భోజనం పెట్టించవా అని తప్పుతీయరా..? మరి తప్పదు కదా..! ఏ చెరువు దగ్గరికి పోయినా 20 రూపాయలకు కిలో చేపలు దొరుకుతున్నయని ఆ మంత్రి ఎవరో మస్తు చెప్పిండు గానీ.., చేపపొట్టు కూడా ఆ ధరకు రాదుపో అంటున్నారు చెరువుల కాడ… సో, కోళ్లు తప్పవాయె, గొర్లు తప్పవాయె, కోతలు తప్పవాయె… కసకసా…
అరె, ఏదో డిస్టిలరీలకు చెప్పి, బ్రూవరీలకు చెప్పి బీర్లు, విస్కీల ప్రొడక్షన్ పెంచవచ్చు… ఊరూరా పారించవచ్చు… కానీ కోళ్లు, గొర్లకు కొరత వస్తే..? సో, ఇకనైనా పార్టీలు సీరియస్‌గా ఆలోచించి, ఈ ‘ఫుడ్ సెక్యూరిటీ’ విషయంలో ఏవైనా నిర్ణయాలు తీసుకోవాలి… ఇంటింటికీ మొక్కలు పెంచడం తప్పనిసరి అని చెబుతున్నట్టే… ఈ కోళ్లు, గొర్ల పెంపకాన్ని తప్పనిసరి చేస్తే బెటరేమో చర్చించాలి… ఈ జంఝాటం అధికారంలో ఉన్నవాడికీ తప్పదు, ప్రతిపక్షంలో ఉన్నవాడికీ తప్పదు… వెంట నలుగురు కార్యకర్తలు తిరగాలంటే ఎవరికైనా ఈ ఖర్చు తప్పదు… ఇప్పుడెందుకు ఈ ఆందోళన అంటారా..? కారణం ఉంది… ఈ వార్త చదవండి…
Ads
ఆంధ్రజ్యోతి రిపోర్టర్ ఎవరో గానీ భలే పట్టుకున్నాడు ఈ వార్త… పట్టుకోవడం కాదు, అందరూ చూస్తున్నదే… కానీ దాన్ని వార్తలా మలిచిన తీరు బాగుంది… అసలు వార్తంటేనే ఇది కదా… సొల్లు నేతల ప్రసంగాలు ఎవడు చదువుతాడు..? ఆ వార్త ఏమిటయ్యా అంటే… హుజూరాబాద్ ఉపఎన్నికల కోసం వచ్చీపోయే కార్యకర్తలు, నాయకులు… ఎమ్మెల్యేలు, కేడర్ క్యాంపులు… ఆరు నెలలుగా ఉపఎన్నిక వ్యూహాలు, అక్కడే తిష్ట… యుద్ధశిబిరమే… ఇంకేముంది..? కోళ్లను, గొర్లను కోసిపారేశారు… వాటర్ క్యాన్లు, సోడా బాటిళ్లు, విస్కీ కార్టన్లు, బీర్లు… గ్యాస్ బుడ్లు, వంట సామగ్రి సరేసరి… మూడు పూటలూ నిత్యాన్నదానమే…
ఇంకేముంది..? పోలింగ్ తరువాత చూస్తే ఒక్క కోడి లేదు, ఒక్క గొర్రె మిగల్లేదు… (వార్తలో ఊరి పేరు రాయలేదు, తెలివిగా హైదరాబాద్ డేట్‌లైన్ పెట్టుకున్నాడు కానీ… ఆ ఊరు బహుశా కమలాపూర్ మండలంలోని గూడూరు అయితే కాదు కదా…) ఐనా ఆ పరిసర గ్రామాల స్థితీ అంతేనట… పుణ్యానికి పంచిపెట్టిన కోట్ల రూపాయల సొమ్ము ఊళ్లల్లో ఇంకా ఉంది కదా… కొద్దిరోజులు మందుకూ, మటన్‌కూ ఢోకా లేదు… బయట జిల్లాల నుంచి కోళ్లను, గొర్లను దిగుమతి చేసుకోవచ్చు… కానీ తరువాత..? అందుకే తరచూ ఉపఎన్నికలు వస్తూ ఉండాలి… పల్లెలు, పట్టణాల ఆర్థిక వ్యవస్థలకు ఊతం దొరుకుతుంది… అనవసరంగా వందలు, వేల కోట్ల ఖర్చు అని ఆడిపోసుకుంటారు గానీ… డబ్బు ఫ్లో అయితేనే కదా, ఏ ప్రాంతమైనా డెవలప్ అయ్యేది… సో.., జై హుజూరాబాద్… మరికొన్ని ఉపఎన్నికలు రావాలని ప్రజలు కోరుకుంటే ఫాఫం, తప్పుపట్టకండి ప్లీజ్…!!
Share this Article