By…… Chada Sastry…………. డాక్టర్ టి.సి. ఆనంద్ కుమార్, పునరుత్పత్తి జీవశాస్త్రవేత్త, భారతదేశపు మొట్టమొదటి టెస్ట్-ట్యూబ్ బిడ్డను సృష్టించినందుకు ప్రసిద్ది చెందారు. ఆయన పని చేసిన ప్రాజెక్ట్ ద్వారా భారత్ లోని మొట్టమొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ 6వ తేదీ ఆగస్టు 1986 న ముంబైలో హర్ష చౌడా అనే బిడ్డ పుట్టుకకు దారితీసింది. అయితే డాక్టర్ ఆనంద్ కుమార్ పెద్ద మనసున్న మహా మనిషి. నాకన్నా ముందే ఎవరో కలకత్తా డాక్టర్ ముఖర్జీ ఇలా భారత్ లో మొట్ట మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీకి జన్మ ఇచ్చిన డాక్టర్ అని విని ఆ ముఖర్జీ గారు తన చేతితో రాసిన రీసెర్చ్ పేపర్లు ఈయన చదివి అవును నిజమే! డాక్టర్ ముఖర్జీ తన కంటే ఎనిమిది సంవత్సరాల ముందే టెస్ట్ ట్యూబ్ బేబీ ని భారత్ కి ఇచ్చారు అని డాక్టర్ కుమార్ తేల్చిచెప్పారు. భారతదేశం యొక్క మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ, కనుప్రియ అగర్వాల్ అలియాస్ దుర్గా, అక్టోబర్ 3, 1978 లోనే డాక్టర్ ముఖర్జీ గారి ఘనత వల్ల కోల్కతాలో జన్మించారు అని ప్రకటించారు. కానీ ఈ ఘనత దేశ శాస్ట్రీయ రంగంలో గుర్తింపు పొందలేదు కాబట్టి డాక్టర్ కుమార్కు డాక్టర్ ముఖర్జీ గారి గురించి ముందుగా తెలియదు.
ఇంతకీ ఎవరీ డాక్టర్ ముఖర్జీ ?
Ads
డాక్టర్ ముఖర్జీ కథ ఒక మేధావి కథ. అతను తన కోల్కతా అపార్ట్మెంట్లో కొన్ని సాధారణ ఉపకరణాలు మరియు రిఫ్రిజిరేటర్ సహాయంతో భారతదేశంలో విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవిఎఫ్) ప్రయోగాలు జరపడంతో ముందు ఉండేవారు. వైద్యుడి కుమారుడుగా అతను వైద్య విద్యార్థిగా ఉన్నప్పటి నుండి వినూత్న స్త్రీ జననేంద్రియ శస్త్రచికిత్సకు ఆకర్షితుడయ్యాడు. పునరుత్పత్తి ఎండోక్రినాలజీలో పీహెచ్డీ కోసం యుకెలోని ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయానికి వెళ్లే ముందు కోల్కతాలోని నేషనల్ మెడికల్ కాలేజీలో చదువుకున్నాడు. అతను 1967 లో భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు, అతను అండోత్సర్గము మరియు స్పెర్మాటోజెనిసిస్ పరిశోధన ప్రారంభించాడు. ఒక సంవత్సరంలో, క్రయోబయాలజిస్ట్ సునీత్ ముఖర్జీ మరియు గైనకాలజిస్ట్ సరోజ్ కాంతి భట్టాచార్యలతో కూడిన బృందంతో, అతను ప్రపంచంలో రెండవ టెస్ట్-ట్యూబ్ శిశువు పుట్టినట్లు ప్రకటించాడు.
బ్రిటిష్ జీవశాస్త్రవేత్త రాబర్ట్ ఎడ్వర్డ్స్ ఇంగ్లాండ్లో మొదటి టెస్ట్-ట్యూబ్ బిడ్డ పుట్టినట్లు ప్రకటించిన 67 రోజులకే డాక్టర్ ముఖర్జీ ఈ ప్రకటన చేశారు. డాక్టర్ ముఖర్జీ మానవ పిండాన్ని కాపాడటానికి క్రియోప్రెజర్వేషన్ అనే పద్ధతిని ఉపయోగించారు. మరి డాక్టర్ ముఖర్జీ ఈ విషయం తమకు ముందుగా చెప్పకుండా ప్రెస్ కి చెప్పారు అని అహం దెబ్బతిన్న అప్పటి వామపక్ష CPM ప్రభుత్వం భావించిందో ఏమో కాని డాక్టర్ సాధించిన ఈ విజయం అస్పష్టంగా ఉంది అని ప్రకటించి CPM పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 1978 లో అతనిపై విచారించడానికి ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో ఉన్న డాక్టర్లు ఎవరూ ఈ IV పరిశోధనలో నిష్ణాతులు కారు. ఆ కమిటీ హెడ్ రేడియో ఫీజిసియస్ట్,ఇద్దరు గైనికాలజిస్టులు, ఒకరు న్యూక్లియర్ ఫిజిక్స్, ఒకరు న్యూరో, ఒకరు ఫీషియాలాజి. ఈ కమిటీ ఆయన రీసెర్చ్ ఫేక్ అని అతని వాదనలు నకిలీవని తేల్చిచెప్పాయి.
అతని మీద ఆరోపణలు :
1. సరైన ఆధారాలు వాదన బలపరిచే కాగితాలు చూపకుండా టెస్ట్ ట్యూబ్ బేబీ జన్మించింది అని నకిలీ ప్రకటన
2. ఈ విషయం ప్రభుత్వ అధికారులతో ముందు చర్చించలేదు
3. అతి సాధారణ పరికరాలతో ఈ ప్రయోగం అసాధ్యం
4. కమిటీ కోరినా తాను తప్పు చేసినట్లు అంగీకరించకపోవడం…….. అతనికి జపాన్ లో ఈ విషయమై ఒక కాన్ఫెరెన్సు కి వెళ్ళడానికి ఆహ్వానం ఉన్నా ఈ కమిటీ రిపోర్ట్ ఆధారంగా అతనికి అనుమతి ఇవ్వలేదు. ఇంకా డాక్టర్ ముఖర్జీ గారిని అవమానపరిచే ఉద్దేశ్యంతో అతన్ని జూన్ 1981 లో కోల్కతాలోని రీజినల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆప్తాల్మాజీకి( కళ్ళ విభాగానికి) బదిలీ చేశారు. ఈ కమిటీ, ప్రభుత్వం చేసిన మానసిక టార్చర్, కక్ష సాధింపు చర్యలకు, అవమానకరమైన బదిలీపై మానసికంగా కుంగిపోయిన 50 సం. ల డాక్టర్ ముఖర్జీ కొన్ని వారాల్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుని జూన్ 19, 1981న చనిపోయారు.
డాక్టర్ ముఖర్జీకి వ్యతిరేకంగా వారు చేసిన ప్రచారానికి వాడుకున్న ఆయుధం సరి అయిన డాక్యుమెంటేషన్ లేదు అని. కానీ అతని సహచరుడు ఇంకో డాక్టర్ ముఖర్జీ ప్రకారం 1978 లో ఢిల్లీలో జరిగిన ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆన్ హార్మోనల్ స్టెరాయిడ్స్లో డాక్టర్ ముఖర్జీ తన పరిశోధనలను సమర్పించారని, 1979 లో హైదరాబాద్లో జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్లో, మరియు 1978 లో ఇండియన్ జర్నల్ ఆఫ్ క్రయోజెనిక్స్లో ఒక పత్రాన్ని ప్రచురించారు అని, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్ విట్రోఫెర్టిలైజ్డ్ ఫ్రోజెన్-థావ్డ్ హ్యూమన్ ఎంబ్రియోను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి కూడా సమర్పించారు అని చెప్పారు. డాక్టర్ ముఖర్జీ జీవితంపై దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత తపన్ సిన్హా నటులు పంకజ్ కపూర్, షబానా అజ్మీలతో రూపొందించిన “ఏక్ డాక్టర్ కి మౌత్ (1991)” అనే సినిమా ప్రభుత్వం, డాక్టర్లు లాబీ యొక్క ప్రతీకారం గురించి వివరిస్తుంది. ఏది ఏమైనా ప్రపంచంలో రెండవ టెస్ట్ ట్యూబ్ బేబీ , భారత్ లో మొదటి టెస్ట్ ట్యూబ్ సాధించిన ఒక గొప్ప పరిశోధకుడిగా పేరు రావలసిన డాక్టర్ ముఖర్జీ రాజకీయాల వల్ల 50 సం. ల.పిన్న వయసులో తనువు చాలించారు. ఆ విధంగా దేశం తని నుండి మరిన్ని సేవలు పొందకుండా ఒక గొప్ప పరిశోధకుడిని కోల్పోయింది…………… ….చాడా శాస్త్రి…
Share this Article