అకస్మాత్తుగా ఓ పది సెకండ్ల వీడియో సోషల్ మీడియాలో చూసి జాలేసింది… సెల్ఫోన్లు నేనే తెచ్చాను, కంప్యూటర్లు నేనే కనిపెట్టాను వంటి పాత తుపాకీరాముడు మాటల్ని చంద్రబాబు ఇంకా మరిచిపోనట్టున్నాడు, ఐనా ఇంకేం మారతాడులే అనిపించింది… జన్మతః వచ్చిన గుణాలేమోలే అనిపించింది… సోషల్ మీడియాలో చంద్రబాబు వ్యతిరేకులతోపాటు తటస్థులు కూడా ఏవేవో కామెంట్స్ పెడుతున్నారు… వెక్కిరిస్తున్నారు… మీమ్స్ సరేసరి…
‘‘ఎక్కడెక్కడ, ఎన్ని పేలాయో గూగుల్ మ్యాప్స్ ద్వారా చూద్దాం, ఏం చేద్దామో ఆలోచిద్దాం… పట్టాభీ, మన దగ్గరున్న సమాచారంతో కూడా ఆర్గనైజ్ చేయి’’ అని ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులతో చంద్రబాబు మాట్లాడుతున్న వీడియో అది… అది ఫేక్ వీడియో కూడా కాదు… టీడీపీ సోషల్ సైట్లలోనే ఆ వీడియో ఉంది… ‘ఈయన ఎన్ని బాంబులు పేలాయో గూగుల్ మ్యాప్స్‌లో సమాచారం వెతికి, తెలుగు విద్యార్థులు అక్కడి నుంచి ఎలా తప్పించుకోగలరో ఆలోచిస్తాడట, ఇంకా నయం, పుతిన్‌కు కాల్ చేసి, మావాళ్లు ఉంటున్న ఏరియాలో బాంబులు వేస్తే మర్యాద దక్కదు అని బెదిరిస్తాడేమో…’’ ఇలాంటి వ్యాఖ్యలతో వెటకారం పోస్టుల్ని కొందరు దంచికొడుతున్నారు…
కానీ నిజానికి ఇక్కడ చంద్రబాబు తప్పేమీ లేదు… సరిగ్గా ఆ పది సెకండ్ల వీడియోను కట్ చేసి వినడం కాదు, దానికి ముందు, వెనుక వెర్షన్ కూడా వినాలి… అక్కడ విద్యార్థులు ఒకరిద్దరు ఏం చెబుతున్నారంటే… మేం బోర్డర్‌కు 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంటాం, కానీ అక్కడికీ వెళ్లలేం, ఓ బ్రిడ్జిని కూలగొట్టారు, ఆల్టర్నేట్ రూట్స్ లేవు, ఏం చేయాలో అర్థం కావడం లేదు అని వివరిస్తోంది ఓ అమ్మాయి…
Ads
అప్పుడు చంద్రబాబు ఏయే చోట్ల బ్రిడ్జిలు పేల్చారో గూగుల్ మ్యాప్స్ ద్వారా చూద్దాం, ఆల్టర్నేట్ రూట్స్ ఏమైనా దొరుకుతాయా వర్కవుట్ చేద్దాం, మీతో టచ్‌లో ఉంటాం అని చెప్పాడు… అంటే బోర్డర్ చేరుకోవడానికి ఏమైనా వేరే రూట్స్ సజెస్ట్ చేయగలమేమో ప్రయత్నిద్దామని చంద్రబాబు మాటల సారాంశం… అంతేకాదు, ఏటీఎంలు పనిచేయడం లేదు, బ్యాంకులు లేవు, ఆ పిల్లలకు ఏదైనా సాయం చేయాలంటే మార్గాంతరం కూడా కనిపించడం లేదు… చంద్రబాబు కూడా అదే చెబుతూ, ఎంబసీ ద్వారా గానీ, లేకపోతే సమీపంలో మనవాళ్లు ఎవరైనా ఉంటే వాళ్ల ద్వారా గానీ ఏమైనా సాయం చేయగలమేమో చూద్దాం అని పిల్లలకు చెబుతున్నాడు…
నిజానికి ఇక్కడ చంద్రబాబు ప్రచారం కోసం ఇష్యూను వాడుకుంటున్నాడు అని విమర్శించలేం… ఆందోళనలో ఉన్న పిల్లలకు ఎవరైనా భరోసా ఇస్తుంటే తప్పుపట్టడం దేనికి..? ఒడిశా మెగా తుపాన్ సమయంలో గానీ, బద్రీనాథ్ ప్రమాద సమయంలో గానీ… నిజంగానే గతంలో కొన్ని సంక్షోభాలు, ప్రమాదాలు తలెత్తినప్పుడు చంద్రబాబు స్పందించిన తీరు చూశాం… ఉక్రెయిన్ పిల్లల విషయంలో వాస్తవంగానే చంద్రబాబు చేయడానికి ఏమీలేదు… చేయగలిగిన సాయమేదో ఇక్కడ పీఎంవో, అక్కడి మన ఎంబసీ చేస్తూనే ఉన్నాయి… కానీ చిక్కుకున్న పిల్లల్లో ధైర్యాన్ని నింపేందుకు జరిగే ఓ ప్రయత్నాన్ని, పరామర్శను తప్పుపట్టలేం… ఇదే పని తెలుగు పాలకులు చేస్తే తప్పేమిటట… తామెందుకు వారిలో ధైర్యం నింపే పనిచేయకూడదు..?!
Share this Article