Income via Fine:
1. చట్టం, నేరం, శిక్ష, జరిమానా ఒక ట్రాక్ మీద వెళుతూ ఉంటాయి.
2. అలవాట్లు, సరదాలు, వ్యసనాలు పక్కనే మరో ట్రాక్ మీద వెళుతూ ఉంటాయి.
3. న్యాయం, ధర్మం, నైతికత, ఆదర్శాలు వీటికి దూరంగా ఎక్కడో దేవతవస్త్రం లాంటి కనిపించని ట్రాక్ మీద, కనిపించని ప్రయాణం చేస్తుంటాయి.
ఏ ట్రాక్ మీద వెళ్లేవి ఆ ట్రాక్ మీదే వెళ్లాలి. లేకపోతే పెను ప్రమాదాలు జరుగుతాయి.
ఏది నేరం?
మత్తు పదార్థాలు అన్నీ మాదకద్రవ్యాలు కావు. కొన్ని మత్తు ద్రవాలనో, ద్రవ్యాలనో ప్రభుత్వమే తయారు చేయించి, ప్రభుత్వమే అమ్మకాలను పెద్ద మనసుతో పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఎక్కడ తాగాలో ప్రభుత్వమే చెబుతుంది. వారు చెప్పిన చోట, చెప్పిన వేళల్లో తాగితే నేరం కానే కాదు. తాగి బండి నడిపితేనే నేరం.
Ads
ఒకపక్క విపరీతంగా తాగించాలి. మరో పక్క ప్రజలను దారిలో పెట్టాలి. ఈ రెండు పరస్పర వైరుధ్యాల మధ్య ప్రభుత్వాలు ఎప్పుడూ నలిగిపోయి…చివరకు రసహృదయంతో లెక్కకు మించి చుక్కలు గుక్కలు గుక్కలుగా తాగించేవైపునే నిలబడాల్సి వస్తోంది. ఇదొక అసంకల్పిత ప్రతీకార మద్య మహా యజ్ఞంగా మనం విశాల హృదయంతో, తాత్విక దృష్టితో అర్థం చేసుకోవాలి.
తాగి బండి నడిపినవారి నుండి, తాగి బండి నడిపి ఎదుటివారిని చంపినవారి నుండి జరిమానాలు వసూలు చేయడం ప్రభుత్వ విధి. చీమా చీమా ఎందుకు కుట్టావు? కథలోలా చావుకు తాగుడు; ఆ తాగుడుకు ప్రభుత్వ విధానం, ఆ విధానం నైతికత…అంటూ కథను వెనక్కు తవ్వుకుంటూ వెళ్లడానికి భారతీయ శిక్షా స్మృతి ఒప్పుకోదు. స్మృతి అంటేనే గుర్తుండేది అని అర్థం. అదొక జ్ఞాపకంగా గుర్తు పెట్టుకోవడం వరకే. అంతకు మించిన చర్చలోకి వెళితే స్మృతికి మతి పోయి…గతి లేనిదవుతుంది.
సరదాలు- వ్యసనాలు
జంధ్యాల సినిమాలో ఒక పెళ్ళిచూపుల సందర్భం. అమ్మాయి గురించి ఆమె తరఫువారు గొప్పగా చెప్పిన తరువాత…అబ్బాయి తరఫున సుత్తివేలు చెప్పే మాట- “మా అబ్బాయి బంగారు. ఏ దురలవాట్లు లేవు. భోజనమయ్యాక ఒక జర్దా పాన్ తప్ప. పాన్ తరువాత ఒక సిగరెట్టు తప్ప. సిగరెట్టు తరువాత ఒక బాటిల్ తప్ప. బాటిల్ తరువాత …కొంపలు తప్ప…” ఇవతల అమ్మాయి తరుపువారు స్పృహదప్పి పడిపోతారు.
అలా ఏ వ్యసనమయినా ముందు సరదాకే మొదలై…అలవాటు అయి…చివరికి దురలవాటు అవుతుంది.
డిసెంబర్ 31 రాత్రి తాగి నడిపేవారి బారిన పడకుండా ఫ్లయ్ ఓవర్లను మూసేసుకుంటాం కానీ…తాగడాన్ని ఆపలేము. మన అలవాట్ల తీవ్రత అలాంటిది.
న్యాయం- ధర్మం
న్యాయానికి చెవులు మాత్రమే పని చేస్తాయి. న్యాయంలో చూపు అప్రధానం. ధర్మం బ్రహ్మ పదార్ధం. కళ్లు, చెవులు, నోరు ఏ అవయవమూ ధర్మానికి సరిగ్గా పని చేయదు. ధర్మం ఎప్పుడూ ప్రవచనాల్లోనే వినపడుతూ ఉంటుంది. ఏటా ఒక్కో రాష్ట్రం 15, 20, 30 వేల కోట్ల రూపాయల మద్యం తాగేలా విధానాలను రూపొందించి అమలు చేయడం న్యాయమా? ధర్మమా? అన్నది మరీ అన్యాయమయిన ప్రశ్న అవుతుంది. అలా అడగడం అత్యంత అధర్మమవుతుంది.
సిద్ధాంతం చెబితే అర్థం కావడం కష్టం కాబట్టి…ఎంతటి సిద్ధాంతాన్నయినా ఒక ఉదాహరణతోనే చెప్పాలి. అప్పుడు అరటి పండు ఒలిచిపెట్టినంత సులభంగా అందరికీ అర్థమవుతుంది.
హైదరాబాద్ లో నాలుగు నెలల్లో మందు బాబులు చెల్లించిన జరిమానా సొమ్ము దగ్గర దగ్గర మూడున్నర కోట్ల రూపాయలట. ఇందులో సరదా ఉంది. వ్యసనాలు ఉన్నాయి. న్యాయముంది. చట్టముంది. నేరముంది. శిక్ష ఉంది. ధర్మముంది. ఆదర్శముంది. అభ్యుదయముంది. ఒక్క మూడున్నర కోట్ల రూపాయల్లో సకల సామాజిక గతి సూత్రాలన్నీ పెనవేసుకుని విడదీయరానంత బలంగా ఉన్నాయి.
అదే- మన సమసమాజ నవసమాజ నిర్మాణంలో బ్యూటీ!
ఏ హార్వర్డ్ లేదా గచ్చిబౌలి ఇండియన్ బిజినెస్ స్కూల్- ఐ ఎస్ బి లాంటి మేనేజ్మెంట్ విద్యా సంస్థలు సరిగ్గా దృష్టి పెడితే ఇదొక గొప్ప వ్యాపార సూత్రం కాగలదు. విలువ ఆధారిత పన్ను(వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్) ఎలా వేయాలో చెప్పే పాఠం కాగలదు. అతి మామూలు 180 ఎమ్మెల్ క్వార్టర్ బాటిల్ ధర వంద రూపాయలు ఉంటే అందులో డెబ్బయ్ అయిదు రూపాయలు పన్నులే ఉంటాయి. కేంద్ర, రాష్ట్ర పన్నులకు తోడు తాగే మందు బాటిల్ ధరకు చదువులు, స్పోర్ట్స్ లాంటి లోకోపకార సెస్సులేవో కూడా తోడవుతాయి. వంద రూపాయల మద్యం తాగి బండి నడిపినందుకు కట్టాల్సిన అపరాధ రుసుము వెయ్యి రూపాయలు అయినప్పుడు…ప్రభుత్వాలకు మద్యం అమ్మకాల మీద ఆదాయం కంటే…తాగి నడిపినవారు కట్టే జరిమానాల డబ్బే పదింతలు ఎక్కువగా వస్తుంది. రావాలి కూడా. ఇది తాగినవాడికి కొల్లేటరల్ డ్యామేజ్. ప్రభుత్వానికి కొల్లేటరల్ అడ్వాంటేజ్ అండ్ ప్రాఫిట్!
ఈ కోణంలో చూసినప్పుడు హైదరాబాద్ పోలీసులు నాలుగు నెలల్లో వసూలు చేసిన మూడున్నర కోట్ల లెక్క తప్పుల తడక అవుతుంది. కనీసం తక్కువలో తక్కువ మూడు వందల కోట్లయినా ఉండాల్సింది.
ఏడాదిలో ఒక క్వార్టర్ కు హైదరాబాద్ లో అమ్ముడయ్యే మద్యం ఎంత?
అందులో తాగి బండ్లు నడిపే వారి శాతం ఎంత?
వారిలో పోలీసులు పట్టుకున్నది ఎంత శాతం?
వసూలు అయినది ఎంత?
ఇంకా వసూలు కావాల్సింది ఎంత?
అంతలో ఈ మూడున్నర కోట్లు ఎంత?
-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com
Share this Article