On the Very Top:
“ఏమో! బహుశా త్వరలో
మీ ఇంటికే రావచ్చు మేము
స్వాగతం ఇస్తావు కదూ!
ఆతిథ్యానికి అర్హులమే మేము
చంద్రమండలానికి ప్రయాణం
సాధించరాని స్వప్నం కాదు
గాలికన్నా బరువైన వస్తువుని
నేల మీద పడకుండా నిలబెట్టలేదూ?
పరమాణువు గర్భంలోని
పరమ రహస్యాలూ
మహాకాశ వాతావరణంలోని మర్మాలూ తెలుసుకున్నాక
సరాసరి నీదగ్గరకే
ఖరారుగా వస్తాంలే
అప్పుడు మా రాయబారుల్ని
ఆదరిస్తావు కదూ నువు?”
-శ్రీ శ్రీ
Ads
శరచ్చంద్రిక కవితలో శ్రీశ్రీ కోరుకున్నట్లు మనం చంద్రుడిని చేరాము. చంద్రుడు స్వాగతం పలికాడు. చంద్రమండలానికి ప్రయాణం నిజంగానే సాధించిన స్వప్నం. పరమాణు రహస్యాలు తెలుసుకుని… శ్రీశ్రీ కవి వాక్కును స్మరిస్తూ సరాసరి విక్రమ్ రాయబారిని చంద్రుడి ఇంటికి క్షేమంగా పంపాము. చంద్రుడి ఆతిథ్యం అందుకుంటున్న ప్రజ్ఞ మనది. మహా కవి వాక్కు వృథా పోదు. పోలేదు. పోబోదు.
నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి ఎగిరిన చంద్రయాన్-3 అలుపు, సొలుపు లేకుండా తిరిగి… తిరిగి… దిగాల్సిన వేళకు తడబడకుండా దిగి… చంద్రుడ్ని ముద్దాడడం చిన్న విషయం కానే కాదు. రెండో చంద్రయానం తడబడి చంద్రుడ్ని చేరుకోలేని అనుభవం నేర్పిన పాఠంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఈసారి తీసుకున్న జాగ్రత్తలు అన్నీ ఇన్నీ కాదు. శ్రీహరికోటలో లాంచింగ్ మొదలు… వేగం తగ్గిస్తూ చంద్రుడి మీద ల్యాండర్ భద్రంగా దిగడం వరకు కారణమయిన భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్తలందరికీ యావద్దేశం శిరసు వంచి నమస్కరిస్తోంది.
భారతీయులందరూ ఎవరికి వారు వారే చంద్రుడిపై కాలు మోపినట్లు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బులవుతున్నారు. చంద్రయాన్-3 సఫలమయిన మరుక్షణం “నౌ ఇండియా ఈజ్ ఆన్ ది మూన్ (ఇప్పుడు భారత్ చంద్రమండలం మీద ఉంది) అని ఇస్రో చైర్మన్ సోమనాథ్ అన్న మాటను ప్రత్యక్ష ప్రసారం చూస్తున్న కోట్ల మంది భారతీయుల కళ్లల్లో ఆనందబాష్పాలు దొర్లాయి.
అంతరిక్ష పరిశోధనల్లో అమెరికా, రష్యాకు మనం ఏమాత్రం తక్కువ కాదని…ఆమాటకొస్తే వారికంటే ఎక్కువేనని రుజువు చేసిన క్షణాలివి. దేశం గర్వపడాల్సిన క్షణాలివి. 140 కోట్ల మంది గుండె చప్పుళ్లే కరతాళ ధ్వనులుగా…చంద్రుడి మీద భారత మువ్వన్నెల జెండాతో రంగుల సంతకం చేయించిన మన శాస్త్రవేత్తల విక్రమ ప్రజ్ఞను కొన్ని తరాల పాటు కథలు కథలుగా చెప్పుకోవాల్సిన అంతరిక్ష విజయమిది… -పమిడికాల్వ మధుసూదన్, 9989090018
Share this Article