దాదాపు ప్రపంచంలో ప్రతి దేశం తమదైన ప్రత్యేక కరెన్సీని కలిగి ఉన్నాయి. ఉదాహరణకు అమెరికా డాలర్, భారత్ రూపాయి, బ్రిటన్ పౌండ్, జపాన్ యెన్, చైనా యువాన్, రష్యా రూబుల్. కానీ ఒకదేశం ఇతర దేశాలతో వర్తక వాణిజ్యాలు చేయడానికి ప్రపంచంలో ఎక్కువ దేశాలు అంగీకరించిన కరెన్సీలో చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ప్రపంచంలో అగ్రరాజ్యంగా కొనసాగుతున్న అమెరికా డాలర్ ను దాదాపు అన్ని దేశాల్లో కరెన్సీగా అంగీకరిస్తారు. అమెరికా అగ్రరాజ్యంగా మారడంలో డాలర్ ఆధిపత్యం ఒక ప్రధాన కారణం.
సాధారణంగా విదేశాలతో చేసే వర్తక వాణిజ్యాలు అంటే ఎగుమతులు, దిగుమతుల చెల్లింపులు డాలర్లలో చేయాల్సి ఉంటుంది. ఎగుమతులు చేసినపుడు దేశానికి డాలర్ల రూపంలో చెల్లింపులు వస్తాయి, దిగుమతులు చేసుకున్నప్పుడు డాలర్ల రూపంలో చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. (ఈమధ్య చైనా తన యువాన్, భారత్ తన రూపాయి విలువ, ప్రాధాన్యత పెంచడానికి… పలు దేశాల నుంచి దిగుమతులకు గాను రూపాయల్లో చెల్లింపులు జరుపుతామని చెబుతున్నాయి… ఉదాహరణకు, రష్యా నుంచి వచ్చే చమురుకు రూపాయల్లో చెల్లింపులు జరపడం…)
ఒక దేశం నుండి ఎగుమతులు ఎక్కువగా ఉండి దిగుమతులు తక్కువగా ఉంటే సమస్య లేదు కాని దిగుమతులు ఎక్కువగా ఉండి ఎగుమతులు తక్కువగా ఉంటే దానిని లోటుగా పరిగణిస్తారు. ఈ లోటు కారణంగా వర్తక వాణిజ్యాలలో ఇబ్బందులు తలెత్తకుండా ఆయా దేశాల రిజర్వ్ బ్యాంకులు ఫారిన్ ఎక్చేంజ్ నిల్వలను నిర్వహిస్తాయి.
Ads
ప్రపంచంలో విదేశీ మారక నిల్వలలో మొదటి మూడు స్థానాల్లో (బిలియన్ డాలర్లలో) చైనా 3582, జపాన్ 1827, స్విజర్లాండ్ 795 ఉండగా భారత్ 674 బిలియన్ డాలర్లతో నాలుగవ స్థానంలో ఉంది.
“భారత్ పొరుగు దేశాలు అనేక పారామీటర్లలో భారత్ ను ఇప్పటికే వెనక్కి నెట్టేయడమో లేదా త్వరలో వెనక్కి నెడతాయని” యూట్యూబ్ లో వీడియోలు చేసే స్వయం ప్రకటిత మేధావి దృవ్ రాఠి ఒక వీడియోలో ప్రకటించిన నేపథ్యంలో పొరుగు దేశాల ఫారిన్ ఎక్చేంజ్ నిల్వలు ఎంత ఉన్నాయో చూద్దాం.
బంగ్లాదేశ్ 27 (బిలియన్ డాలర్లు)
పాకిస్థాన్ 8 (బిలియన్ డాలర్లు)
మయన్మార్ 6 (బిలియన్ డాలర్లు)
ఆఫ్ఘనిస్తాన్ 6 (బిలియన్ డాలర్లు)
శ్రీలంక 5 (బిలియన్ డాలర్లు)
ఈ అంకెలు అన్ని నిన్నటి వరకు ఉన్న తాజా సంఖ్యలే.
భారత్ 674 బిలియన్ డాలర్ల నిల్వలతో పోలిస్తే పొరుగు దేశాల స్థాయి ఏమిటి? కొసమెరుపు ఏమిటంటే భారత్ గతవారంలో పెరిగిన ఫారిన్ ఎక్చేంజ్ నిల్వల విలువ 7.5 బిలియన్ డాలర్లు… ( – నాగరాజు మున్నూరు )
Share this Article