.
వైట్ వాష్… వరుసగా మూడు పరాజయాలతో… స్వదేశంలో ఒక విదేశీ జట్టు చేతిలో ఒక టెస్ట్ సీరీస్ ఓటమి ఇదే తొలిసారి… ఇండియా క్రికెట్ ప్రేమికులందరినీ నొప్పించే ఆటతీరు ఇది…
నిజంగా న్యూజిలాండ్ అంత గొప్పగా ఉందా మన జట్టుకు కొరుకుడు పడనంతగా… మరీ ఇంత ఘన విజయం సాధించేంతగా… మనం మరీ అంత దిగజారిపోయామా..? కాదు, ఏదో ఉంది… ఏదో మిస్టరీ… కొత్త కోచ్, బీసీసీఐ జైషాల పట్ల నిరసనా..? అందుకే కాడి కింద పారేశారా..?
Ads
చెత్తా బంతులకు కూడా ఔటైపోయి, ఓ నిరసన ప్రదర్శనలా పెవిలియన్ దారి పట్టారా..? కావాలనే ఓడిపోయారా..? అదేనా కారణం..? ఇలా కొన్ని విశ్లేషణలు కనిపిస్తున్నాయి… క్రికెట్‌లో అత్యుత్తమ జట్లలో ఒకటైన ఇండియా ఇంత ఘోరంగా ఓడిపోవడం వెనుక ఇప్పటికిప్పుడు బయటపడని ఏవో కారణాలు ఉన్నాయనే చాలామంది నమ్ముతున్నారు…
మేనేజ్‌మెంట్ నిర్ణయాలు నచ్చకపోతే మరీ ఇంత మూకుమ్మడిగా, మరీ ఘోరంగా సీరీస్ విదేశానికి అప్పగించి… క్రికెట్ ప్రేమికుల తీవ్ర విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిసీ ఓడిపోతారా..? ఇది మరో సమర్థన… కొన్నిసార్లు ఇలా జరుగుతూనే ఉంటుంది, రంధ్రాన్వేషణ తగదు అని వాళ్ల వాదన…
కావచ్చు… అదే నిజం కావచ్చు కూడా… విరాట్ కోహ్లి బ్యాటు మహత్తు ఎప్పుడో కొడిగట్టింది… రోహిత్ శర్మ కూడా అంతే… కుదురుగా, స్థిరంగా, నిలకడగా, నమ్మకంగా రాణిస్తున్న బ్యాట్స్‌మన్ ఒక్కరూ లేరు… మంచి భాగస్వామ్యాలు నిర్మించగలిగిన వాళ్లు లేరు…
ఉన్నారు, బ్యాటర్లు… కానీ క్రీజులోకి రాగానే దంచుడు బ్యాచు… టెస్ట్ క్రికెట్ అది కాదు… టెస్ట్ మ్యాచ్ స్ట్రాటజీ వేరు, గేమ్ ప్లాన్ వేరు… ఐపీఎల్ కాలుష్యం మెదళ్లకు ఎక్కిన ప్లేయర్లు టెస్ట్ క్రికెట్ ఎలా ఆడాలో మరిచిపోయారు… కొందరికి అసలే తెలియదు… మొన్నటి మూడో మ్యాచ్ చూడండి… ఎంత వేగంగా ముగిసిపోయిందో…
మరీ టీ20 శకం వచ్చాక టెస్ట్ క్రికెట్ ఇక గతం అనుకోవాల్సిందే… వచ్చిన బంతిని వచ్చినట్టుగా బాదేయడమే స్పీడ్ క్రికెట్ స్ట్రాటజీ… ఐదు రోజులు ఆడలేకపోతున్నారు… ఇంగ్లండ్ కూడా బజ్‌బాల్ క్రికెట్ అని స్టార్ట్ చేశారు గానీ అదే రెండు సీరీస్‌లతో సమాప్తం…
మీడియా కూడా ఎంతసేపూ ఐపీఎల్, టీ20, మహా అయితే వన్డే… అంతేతప్ప టెస్ట్ క్రికెట్ మీద దానికి ధ్యాస లేదు… ఇంపార్టెన్సూ ఇవ్వదు… ఎవడైనా మంచిగా దంచితే వాడిని ఆరోజుకు ఆకాశానికెత్తడం… కీర్తించడం… డబ్బు, యాడ్స్, కీర్తి, పాపులారిటీ ఇంకేం కావాలి..? ఇన్‌స్టాలో పోస్టులు పెడితే కూడా కోట్లకుకోట్లు… ఇక ఆట ఎవడికి కావాలి..? మార్కెట్‌లో ఉన్న నాలుగు రోజులూ దంచుకోవాలి, దండుకోవాలి… ఇదే ప్రపంచం…
పాత ప్లేయర్లు, కామెంటేటర్లు దుమ్మెత్తిపోస్తున్నారు… కానీ మరో కోణం చూద్దాం… ఎగిసిన కెరటం ఎప్పుడో ఓసారి విరిగిపడకతప్పదు… ఇదీ అంతే… ఒకప్పుడు క్రికెట్‌ను ఏలిన వెస్టిండీస్ ఇప్పుడు మన స్టేట్ టీమ్స్‌కు ఈక్వల్… పెద్ద జట్లను భయపెట్టిన శ్రీలంక ఇప్పుడు నథింగ్… పాకిస్థాన్ క్రికెట్ దివాలా… పెద్ద జట్లలో ఒకటిగా కనిపించిన జింబాబ్వే కథ కూడా తెలిసిందే కదా…
ఒకప్పుడు దక్షిణాఫ్రికా జట్టుతో ఫైట్ అంటే వణుకు… ఇప్పుడదీ లేదు… న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు మాత్రమే లోపాలతో సతమతమవుతున్నా సరే ఈరోజుకూ కాస్త గట్టిగా కనిపిస్తున్నాయి… ఇండియా కూడా ఓసారి విరిగిపడుతుందనీ, అప్పటి నుంచే ప్రక్షాళన స్టార్టవుతుందని అనుకుంటున్నదే… ఆరోజు రానే వచ్చింది… మరీ అసాధారణం, అనూహ్యం వంటి పెద్ద పదాలేమీ అక్కర్లేదు…
కొన్నిసార్లు పతనం కూడా మంచికే… వ్యాధి ఏమిటో తెలుస్తుంది… వేలాడుతున్న గబ్బిలాలను తరిమేయడానికి, కొత్త రక్తాన్ని ఇంజక్ట్ చేయడానికి వీలుంటుంది… చికిత్స సులభం అవుతుంది… చూద్దాం…!!
Share this Article