అనగనగా ఓ ఊరి చివర స్మశానం కాడ …
ఓ మర్రి చెట్టు ఉండేది.
Ads
ఆ మర్రి చెట్టు మీద దెయ్యాలుంటాయని … ఆ చుట్టుపక్కల ఊళ్లల్లో బాగా ప్రచారంలో ఉన్న విషయం.
సుబ్బయ్య కూడా చిన్నప్పట్నించీ ఈ విషయం వింటూనే ఉన్నాడు.
అయితే అతనెప్పుడూ దెయ్యాలను చూడలేదు.
దెయ్యాలను చూడలేదు కాబట్టి దేవుడు కూడా ఉండి ఉండడు అనుకుని గుడి మొహం కూడా ఎప్పుడూ చూడ్లేదు.
చాలాసార్లు సెకండ్ షో సినిమా చూసి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న టౌన్ నుంచీ సైకిలేసుకుని ఆ మర్రి చెట్టు కింద నుంచీ ప్రయాణించిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
ఎప్పుడూ ఒక్కగానొక్క దెయ్యం కూడా తగల్లేదు.
అలా హాయిగా ఓ ఎనభై ఏళ్ల పాటు దేవుడూ లేడు, దెయ్యమూ లేదని బతికేసిన తర్వాత ఓ ఫైన్ నైట్ సుబ్బయ్య ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి.
ఆ రోజు పొద్దూకు మాట్ల మాలపల్లె నుంచీ ఊళ్లోకి పోయి పొగాకు తెచ్చుకుందామని బయల్దేరాడు.
రోడ్డు దాటుతూండగా …
ఓ చిన్నకారు తగిలేసింది.
అక్కడ్నించీ ఊళ్లోనే ఉన్న రూరల్ డిస్పెన్సరీకి వెళ్లడం …
డాక్టరు గారు సుబ్బయ్య మరణాన్ని ధృవీకరించడంతో కథ ముగిసింది.
అయితే ఈలోగానే …
సుబ్బయ్యకు దెయ్యాలున్నాయనే విషయం బోధపడింది.
తనకు కారు తగులగానే దయ్యంగానే మారిపోవడం తెలుస్తూనే ఉంది.
దెయ్యంగా మారాను అని నిర్ధారణ అయ్యాక … మర్రిచెట్టు దగ్గరకు పోవాలనిపించింది.
అలా మర్రి చెట్టు దగ్గరకు చేరాడు.
నిజంగానే మర్రిచెట్టు మీద దెయ్యాలున్నాయి. మొత్తం మర్రిచెట్టంతా ఓ చిన్నసైజు టౌనులా ఉంది.
మర్రి చెట్టుకు కుడివైపు చివరగా ఉన్న కొమ్మ మీద …
ఆ మధ్య తన కళ్ల ముందే కాలుజారి కాలవలో పడిపోయి ప్రవాహంలో ఊపిరి అందక చనిపోయిన గుడి పంతులుగారు కనిపించారు.
గురువుగారూ … మీకు ఈత వచ్చు కదా… అయినా అలా ఎలా చనిపోయారండీ పంతులు గారూ అని అడుగుతూ ఆ కొమ్మ దిగువన ఉన్న ఊడను పట్టుకుని పైకి ఎక్కే ప్రయత్నం చేశాడు సుబ్బయ్య …
కుడేపు చివరన ఉన్న కొమ్మల మీదున్న దెయ్యాలన్నీ ఒక్కసారి ఘొల్లున అరిచాయి.
అద్దిరిపోయి ఊడను వదిలి కింద పడ్డాడు సుబ్బయ్య ..
చెట్టు మొదలుకు కాస్త దూరంగా …
కూచుని సుబ్బయ్య వంకే చూస్తున్న కుంటి ఎంకడు నవ్వుతూ చేయి ఊపాడు …
సుబ్బయ్య లేచి దుమ్ము దులుపుకుంటూ ఎంకడి దగ్గరకు పోయి కూచున్నాడు …
అదేంట్రా … అంత గోల చేసేయి ఆ కొమ్మల మీదున్న దెయ్యాలు అని అడిగాడు..
ఎంకయ్య నవ్వుతా … ఒరే ఆ కుడేపు చివర కొమ్మల మీద అగ్రహారం ఉందిరా … బ్రాహ్మణ దెయ్యాలుంటాయి అక్కడ … నువ్వేమో పుసిక్కిన నేరుగా గుడిపంతులు దెయ్యం ఇంట్లోకి ఎంటరైపోబోయావ్ … మరి అరవరేటి అన్నాడు…
వార్నీ చచ్చిపోయాక ఇంకా కులాలేంట్రా అన్నాడు సుబ్బయ్య …
మరదే నీకు తెల్సింది … ఆ మధ్య కొమ్మల్లో కమ్మోరూ … ఆటికి పెడగా ఉన్న కొమ్మల మీద రాజుల దెయ్యాలూ … ఆటికి అటేపు కొమ్మల మీద కాపు దెయ్యాలూ ఇట్టా …
మరి మన దెయ్యాలెక్కడ్రా? అని ఎంకడి మాటలకు అడ్డొచ్చాడు సుబ్బయ్య …
అదే ఆ కొసాన ఉన్న ఊడల మీదున్న కొమ్మలున్నాయి కదా … దాని మీద మన దయ్యాలుంటాయి గురూ … ఆ ఎనకమాల కొమ్మల మీద మిగిలిన మన దళిత కులాల దెయ్యాలుంటాయి … అని తేల్చాడు ఎంకడు …
దెయ్యాలకు కూడా కులాలుంటాయని నాకు ఇప్పటిదాకా తెల్దురా అన్నాడు బుర్రగోక్కుంటూ సుబ్బయ్య
దెయ్యాలకేంట్రా ? చీమలకూ దోమలకూ కూడా కులం ఉండుద్ది తెల్సా?
నిజమా? సుబ్బయ్య ఆశ్చర్యం
అవున్రా … కమ్మోరిళ్లల్లో తిరిగే దోమలు చచ్చినా ఇంకో చోటకెళ్లి ఇంకో కులమోళ్లని కుట్టవు తెల్సా నీకు… వివరించాడు ఎంకయ్య
నీతో మాట్లాడతా ఉంటే నా బుర్ర పోతాంది గానీ … నేను మన కులం కొమ్మెక్కి కాసుపు పడుకుంటాన్రా … నాయనా, రేత్రంతా నిద్రలేదు అంటూ ముందుకు సాగిన సుబ్బయ్యకి ఓ కొత్త కోరిక కలిగింది …
దెయ్యాలున్నాయని తేలిపోయింది కనుక దేవుడు కూడా ఉండే ఉంటాడు కదా…
ఎలా కలవాలా అనుకుంటూండగా …
ఎనక నుంచీ ఓ గొంతు వినిపిస్తుంది.
ఒరే సుబ్బిగా … దెయ్యాలకు దేవుడు కనిపించడుగాక కనిపించడు అని …
………………….
Share this Article