- ఒక చిన్న పాయింట్… దీనికి పెద్ద తెలివి కూడా అక్కర్లేదు… ఒకవేళ తెలివి ఉన్నట్టు కనిపించినా సరే, ప్రస్తుతం రోజులు బాగాలేవు కాబట్టి… జస్ట్, కామన్ సెన్స్‌తో ఆలోచిద్దాం……
- ఒక ఫ్యాక్టరీ ఉంది, ప్రభుత్వ రంగంలో ఉంది, అన్నిరకాల అవలక్షణాలూ ఉన్నాయి, నష్టాలు… సరే, దాని నిర్వహణకు కొంతకాలానికి ప్రైవేటు వాళ్లకు అప్పగిద్దాం అనుకుంది కేంద్ర ప్రభుత్వం… అమ్మడం కాదు, కేవలం నిర్వహణకు అప్పగించడం… మరీ సింపుల్‌గా చెప్పాలంటే లీజుకు ఇవ్వడం… కౌలుకు ఇవ్వడం అంటే అమ్మినట్టు కాదు కదా… క్లియర్… ఇది ఆస్తుల సద్వినియోగం… లోగుట్టు పెరుమాళ్లకెరుక అనుకున్నా సరే, అసలు మర్మాలు ఏమున్నా సరే, అసలు విధానరచనలో లోపాలున్నా సరే… పైకి చూస్తే మాత్రం అది ‘‘అద్దెకు ఇవ్వడం’’…
- భూములు అమ్మేసి దళితబంధుకు డబ్బులిస్తాం… ఇది రాష్ట్ర ప్రభుత్వ విధానం… అంటే పూర్తిగా అమ్మేయడమే… డబ్బు చేసుకుని, వోట్ల వేటలో ఖర్చు పెట్టేయడం… ప్రభుత్వ భూమి అంటే ఆస్తే కదా… అమ్మేయడమే కదా… మరి ఏడేళ్లలో ఏకంగా ఏడు లక్షల కోట్ల సంపదను సృష్టించామని ఘనంగా చెబుతున్న తెలంగాణ ప్రభుత్వానికి ప్రభుత్వ ఆస్తులు అమ్ముకునే ఖర్మ ఏం పట్టింది..?
- ఇప్పుడు చెప్పండి… కేంద్రం ఆస్తులు అమ్ముతోందా..? రాష్ట్రం ఆస్తులు అమ్ముతోందా..? కానీ టీఆర్ఎస్ క్యాంపు ఏం చేసింది..? కేంద్రంలోని బీజేపీ సర్కారుపై విరుచుకుపడింది… హరేక్ మాల్, ఫర్ సేల్, సర్కారువారి పాట, ఇంతకన్నా దారుణం మరొకటుందా..? దేశాన్నే అమ్మేస్తున్నారు అన్న తరహాలో ప్రచారం సాగించారు… నిజంగా ‘‘ఐనకాడికి అమ్మేయడం’’ అనేదేమో స్టేట్ పాలసీ… మరోవైపు ‘‘ఆస్తులన్నీ అద్దెకు ఇస్తాం’’ అనే కేంద్రాన్ని తిట్టిపోస్తున్నారు… ఉదాహరణకు నమస్తే తెలంగాణ స్టోరీ చూడండి… నేరుగా హెడ్డింగే ‘‘6 లక్షల కోట్లు అమ్మేస్తాం’’ అని పెట్టేశారు… నమస్తే తెలంగాణకు, ప్రజాశక్తి పత్రికకు తేడా ఏముంది ఇక..? అఫ్ కోర్స్, ప్రస్తుతం తేడా ఏమీ కనిపించడం లేదు…
Ads
- ఇక అసలు విషయానికొద్దాం… తెలంగాణ బీజేపీలో సబ్జెక్టు మీద ఎప్పటికప్పుడు స్టడీ చేసి, కౌంటర్ చేసే యంత్రాంగం లేదు… ఆ సోయి కూడా లేదు… ఎంతసేపూ, కమాన్, భాగ్యలక్ష్మి గుడి దగ్గరికి రా, చూసుకుందాం నీ పెతాపమో నా పెతాపమో అంటూ సవాళ్లు విసిరే ఓ పక్కా రాజకీయ నాయకుడి టైపు… కనీసం కేంద్ర వైఖరి ఇదీ అని సమర్థించుకునే తెలివితేటలు కూడా లేవు… అందుకే కీలకమైన అంశాలు వచ్చినప్పుడు ఎడ్డిమొహం వేస్తోంది… ఎంతసేపూ కేసీయార్‌ను జైల్లో వేస్తాం, అరెస్టు చేస్తాం, అవినీతి మీద బొచ్చెడు ఆధారాలున్నయ్ అంటూ కాలం చెల్లిన ఆ భ్రమాత్మక ప్రకటనలు తప్ప అడుగు కదిలేది లేదు, ఆ సంకల్పమూ లేదు… ఉండదు, ఇక్కడ తన్నుకుంటున్నా సరే ఢిల్లీలో గట్టిగా అలుముకునే (హత్తుకునే) పార్టీలే ఇవి… ఈ భీషణ, భీకర, బీభత్స ప్రకటనల్ని జనం పట్టించుకోవడం మానేసి చాలా రోజులైంది…
- కేంద్రం ఏదో ఊడబొడుస్తుందని కాదు, నోట్ల రద్దు నుంచి ఆత్మనిర్బరం దాకా చాలా వైఫల్యాలున్నయ్… సో, ఇక్కడ చెప్పదలుచుకుంది దొందూదొందే అని… ప్రజాఆస్తుల పరిరక్షణ పట్ల ఎవరూ శుద్ధపూసలు కారు అని చెప్పడం..! కేంద్ర వైఖరి కూడా స్ట్రెయిటుగా ఏమీ లేదు… మోడీగారి డిమానిటైజేషన్ ఏం ఉద్దరించిందో చూశాం కదా, ఇప్పుడు మానిటైజేషన్ అంటున్నాడు…
- కొన్ని ఆస్తులు లీజుకు అంటున్నారు కానీ విశాఖ స్టీల్ వంటి ఆస్తులు తెగనమ్మడమే బీజేపీ సర్కారు విధానం… రోడ్లు, పవర్ ట్రాన్స్‌మిషన్ లైన్లు, పోర్టుల మీద ఏదో సూత్రప్రాయ విధానపత్రంలాగా రిలీజు చేశారు తప్ప, ఏది ఏం చేయాలనుకున్నారో, ఏ పద్ధతిని అవలంబిస్తారో, ఆస్తుల్ని తిరిగి అప్పగించడానికి దేనికెంత గడువు పెడతారో, నిర్వహణ కంట్రాక్టుల ప్రాతిపదికలేమిటో, ఈ నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ స్వరూపం ఏమిటో క్లారిటీ లేదు… టోల్ మోడల్, ఇన్‌ఫ్రా ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్టు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్టు వంటి పద్ధతులూ ప్రస్తావించారు… ఐనా మోడీజీ, హేమిటి ఇదంతా..? ఇంత సంక్లిష్టత అవసరమా..? తెలంగాణ ప్రభుత్వంలాగే అమ్మేసి డబ్బు చేసుకుంటే పోలా..? పోనీ, ఏపీ సర్కారులాగా భవిష్యత్తు ఆదాయాన్ని చూపి, ఏవో కార్పొరేషన్లు పెట్టేసి అప్పులు తెచ్చేస్తే పోలా..? ఈ ‘‘అద్దెకు ఇచ్చే’’ యవ్వారాలు దేనికి..?! ప్రభుత్వ ఆస్తుల ‘‘అద్దె వ్యవహారం’’ అంటేనే స్కామ్… ఆస్తుల్ని అప్పనంగా ధారబోయడం… అది మళ్లీ ఎప్పుడైనా చెప్పుకుందాం…
Share this Article