MY COUNTRY IS THE WORLD, AND MY RELIGION IS TO DO GOOD… BY THOMAS PAINE.
నా దేశమే ప్రపంచం, మంచి చేయడమే నా మతం.. ప్రఖ్యాత ఫ్రెంచ్ విప్లవకారుడు, రచయిత థామస్ పైన్ చెప్పిన మాటలు.. ఓ పాకిస్థానీ విషయంలో భారత్ స్పందించిన తీరుతో అక్షరసత్యాలయ్యాయి.
భారతీయ హృదయ స్పందన.. మరో పాకిస్థానీకి హృదయాన్నిచ్చి.. జీవితాన్నందించిన కథ ఇది.
Ads
అందుకు చెన్నై ఎంజీఎం హెల్త్‌కేర్ మల్టీ స్పెషాల్టీ హాస్పిటల్ వేదికైంది. ఉచితంగా గుండె మార్పిడి శస్త్రచికిత్స చేయించుకుని పునర్జన్మ పొందిన ఆయేషా రషన్… భారత రుణం తామెప్పటికీ తీర్చుకోలేమని ఆనందభాష్పాలు కార్చిన కృతజ్ఞతాపూర్వక సంతకం.. రెండు దాయాది దేశాల మధ్య జాతి, మత సరిహద్దులను చెరిపేసింది.
WE ARE VERY VERY SMALL.. BUT WE ARE POFOUNDLY CAPABLE OF VERY VERY BIG THINGS అంటాడు STEPHEN HAWKING.
చెన్నై ఎంజీఎం వైద్యులు అదే చేశారు. అందుకే ఇప్పుడు ఆయేషా రషన్ కథలో ఆ వైద్యులే కథానాయకులయ్యారు.
పందొమ్మిదేళ్ల ఆయేషా రషన్.. సుమారు దశాబ్ద కాలంగా గుండె జబ్బుతో బాధపడుతోంది. 2014లోనే సనోబార్ అనే మహిళ.. తన కూతురు ఆయేషా రషన్ ప్రాణాలు కాపాడుకునేందుకు భారత్ కు వచ్చింది. అప్పటికే, పాకిస్థాన్ లో ఆయేషా రషన్ కు హార్ట్ పంప్ ను అమర్చారు. కానీ, ఆ పంపింగ్ సిస్టమ్ ఫెయిలై సరిగ్గా పనిచేయకపోవడంతో.. పాకిస్థాన్ లో ఏ హాస్పిటల్ కు వెళ్లినా చేతులెత్తేశారు. చేసేది లేక.. పక్కనే ఉన్న భారత్ లో సోదరభావంతో ఏదైనా మంచి జరగకపోతుందానని సనోబార్ తన కూతురు ఆయేషా తో కలిసి ఇండియాకొచ్చింది. హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఒక్కటే.. ఆయేషా బతకడానికి మార్గం. ఆ సౌకర్యాలు పాక్ లో లేకపోవడంతో.. ఒకింత కలవరంతోనే ఆ అల్లాపై భారం వేసి.. రాముడు నడయాడిన భారతావనిలో అడుగిడింది.
అలా తెలిసినవారి సిఫారసుతో చెన్నై ఎంజీఎం హెల్త్ కేర్ హాస్పిటల్ ను సందర్శించింది. హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ ప్లాంట్ డైరెక్టరైన కే.ఆర్. బాలకృష్ణన్ కలిసింది. మరో కో డైరెక్టరైన సురేష్ రావు కూడా వారితో సంప్రదింపులు జరిపాక.. 19 ఏళ్ల అయేషాకు అన్ని పరీక్షలు నిర్వహించి గుండె మార్పిడి తప్పనిసరని తేల్చారు. అప్పటికే ఆమె గుండె బలహీనంగా మారుతున్నందున.. ఆయేషాకు ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రెన్ ఆక్సిజనేషన్ అనే ఎక్మోగా పిల్చుకునే మెడికల్ ప్రాసెస్ ప్రారంభించారు.
కానీ, హార్ట్ ప్లాంటేషన్ కు 35 లక్షల రూపాయలవసరం. సనోబార్ ది పాకిస్థాన్ లో ఓ పేద ఫ్యామిలీ. అయినా, అప్పోసప్పో చేసి.. బిడ్డ ప్రాణాలను బతికుంచుకోవాలన్న తపనతో ఓ మాతృమూర్తిగా.. దేశం కాని దేశం.. అదీ దాయాది దేశమైన భారత్ కు వచ్చింది. అంత పైసా పెట్టుకుని బిడ్డ ప్రాణాలు దక్కించుకునే ఆర్థికశక్తి లేదు. కానీ, ఇంతదూరం వచ్చాక.. గుండె మార్పిడి చేస్తే బిడ్డ ప్రాణం దక్కుతుందని తెలిశాక.. బిడ్డను కాపాడుకోలేని అసమర్థత ఆమెలో తెలియని ఆందోళనకు కారణమైంది. లిటరల్ గా ఓ నిస్సహాయ స్థితిలో ఓ స్టాచ్యూ ఐపోయింది సనోబార్.
కానీ, ఎంజీఎం హాస్పిటల్ ఎంత కాస్ట్లీయో… అంత మానవీయ కోణాన్నీ ప్రదర్శిస్తుందని.. అక్కడి వైద్యులు నిరూపించారు. కన్నపేగు ఆయేషాను రక్షించుకునేందుకు ఎక్కడో పాకిస్థాన్ నుంచి వచ్చిన సనోబార్ ను చూసి ఆ వైద్యులు కూడా చలించిపోయారు. ఎంజీఎం తరపున ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో సర్జరీ చేయడానికి మాటిచ్చారు. అయితే, తాము ఉచితంగా ఆపరేషన్ చేయడానికి సిద్ధపడ్డా.. హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ ప్రక్రియలో కనీసం 35 లక్షల రూపాయలవసరం పడతాయని చెప్పిన వైద్యులు.. అందుకూ వారే దారి చూపిన దేవతలయ్యారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. దేవరకొండ బాలగంగాధర్ తిలక్ చెప్పినట్టుగా.. మంచి గంధంలా పరిమళించే మానవత్వమే మాకు అలంకారమని నిరూపించారు.
అలా అభాగ్యుల పాలిట అండగా నిల్చే ఐశ్వర్యం అనే ఓ స్వచ్ఛంద సంస్థకు ఆయేషా కథ వినిపించారు. పేరులోనే కాదు.. సాయంలోనూ ఐశ్వర్యాన్ని చూపిన ఐశ్వర్యం ట్రస్ట్ అందుకు సానుకూలంగా స్పందించింది. వైద్యసాయానికి కావల్సిన 35 లక్షల రూపాయలను ఆయేషా తల్లికి ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుంది.
అయితే, ట్రాన్స్ ప్లాంటేషన్ కు కావల్సిన గుండె లభించేందుకు సమయం పట్టింది. ఆ సమయం ఏడాదిన్నర క్రితం ఆసన్నమైంది. అలా ఆయేషాకు ఎంజీఎం వైద్యుల నుంచి అందిన సమాచారంతో.. తన బిడ్డ బతికే ఆశలు కేవలం పదిశాతం మాత్రమే ఉన్నాయన్న సమయంలో.. హుటాహుటీన ఆయేషాను తీసుకుని ఎంజీఎంకు తిరిగి వచ్చింది. సుమారు 18 నెలల పాటు బిడ్డ కోసం భారత్ కు మకాం మార్చుకున్న సనోబార్.. తన సంకల్పంతో జన్మనిచ్చిన పేగుకు మరోసారి పునర్జన్మనివ్వగల్గింది.
అలా ఢిల్లీ నుంచి వచ్చిన ఓ వ్యక్తి గుండెను ఎంజీఎం వైద్య సిబ్బంది ఆయేషా రషన్ కు అమర్చి ఆపరేషన్ విజయవంతం చేశారు. రోజూ ఎన్నో సర్జరీలు చేసే వైద్యుల్లో కూడా ఏదో సాధించిన అనుభూతి ఒకవైపు కనిపిస్తే.. మరోవైపు తన దేశంలో అందని వైద్యం.. నిత్యం తమ దేశంతో సై అంటే సై అనేందుకు సిద్ధంగా ఉండే దాయాది దేశంలో కనిపించిన మానవత్వమనే మరో కోణం ఆయేషా రషన్ కూ, ఆమె తల్లి సనోబార్ కూ మాటలకందని ఓ అనుభవాన్ని మిగిల్చింది.
కేవలం భారత దేశ ప్రభుత్వానికి.. మరీ ముఖ్యంగా తమ సమస్యపై తమ దేశంలోనూ కనిపించని విధంగా స్పందించిన ఎంజీఎం సిబ్బందికి మాత్రమే కాదు.. 35 లక్షలతో హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు ముందుకొచ్చిన ఐశ్వర్యం ట్రస్ట్ కు.. మొత్తంగా పరిమళించిన మానవత్వానికి వారు చేసిన కృతజ్ఞతాపూర్వక అభివాదం.. అక్కడి ఆ దృశ్యాన్ని కుల, మత, జాతి, సరిహద్దు, శత్రువాదాలన్నింటినీ పటాపంచలు చేసింది.
ఇప్పుడు ఆయేషా రషన్ ఫ్యాషన్ డిజైనర్ కావాలన్న కలలతో.. పునర్జన్మ సంతరించుకుని ఓ గుర్రమై పరుగులు పెడుతోంది….. (Article By రమణ కొంటికర్ల 99126 99960 )
Share this Article