.
అవినీతి పార్టీలు, అక్రమాల పార్టీలు, కుటుంబ పార్టీలు… ప్రత్యేకించి ఏదో ఓ ఎమోషన్‌ను రాజేసి, ఆ మంటల్లో చలి కాచుకుంటూ… ఎడాపెడా విలాసాలు, ఎనలేని ఆస్తులు, కళ్లు తిరిగే వైభోగాలు, అడ్డగోలు పెత్తనాలకు దిగే ప్రాంతీయ, ఉప ప్రాంతీయ పార్టీలను జనం ఛీకొడుతున్నారు… పల్లె వోటరు గానీ, పట్టణ వోటరు గానీ తన తీర్పు స్పష్టంగానే చెబుతున్నాడు…
ఇది గతకాలం కాదు, సోషల్ మీడియా పుణ్యామని అందరికీ ఏ పార్టీ ఏమిటో, ఏ నాయకుడి లక్షణం ఏమిటో అన్నీ అర్థం చేసుకుంటున్నాడు వోటరు… ఎటొచ్చీ ప్రత్యామ్నాయం దొరకని, జాతీయ పార్టీలు ఎదగని ఏపీ రాజకీయం కాస్త డిఫరెంట్… ఉన్న రెండున్నర ప్రాంతీయ పార్టీలే దిక్కు తెలుగు ప్రజలకు పాపం…
Ads
మరో తాజా ఉదాహరణ కావాలా..? మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికలు… 288 స్థానాలకు బీజేపీ 122, షిండే శివసేన 54, అజిత్ పవార్ ఎన్సీపీ 39… అసెంబ్లీ ఎన్నికల్లో కనబడిన ఫలితాలే రిపీట్… ఇంకాస్త ఎక్కువే… పట్టణ వోటరు కాస్త కాంగ్రెస్ పట్ల దయచూపి 32 సీట్లు ఇచ్చాడు… ఠాక్రే అసమర్థత, సంజయ్ రౌత్ శల్య సారథ్యంతో ఠాక్రే శివసేన 8 సీట్లతో మరింత భ్రష్టుపట్టింది… శరద్ పవార్ పార్టీకి 7 సీట్లు…
రేపు ముంబై , నాగపూర్ , పూణె లాంటి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలోనూ ఇదే రిపీట్ కావడం ఖాయం… ముంబై ఎన్నికల్లో కలిసి పోటీచేద్దామని ఠాక్రే వారసులిద్దరూ (ఉద్దవ్, రాజ్ ఠాక్రే) మంతనాలు చేస్తున్నారని తాజా వార్త… తన బేసిక్ బలాల్ని తుంగలో కలిపేసి మరాఠీ ఎమోషన్‌ను రాజేయాలని ఉద్ధవ్ ఠాక్రే శివసేన అనుకుంది… వోటరు ఛీకొట్టాడు… (రెండు శివసేనలు, రెండు ఎన్సీపీలు ప్రాంతీయ, ఉపప్రాంతీయ పార్టీలే… ఎటొచ్చీ ఏదో ఓ జాతీయ పార్టీతో కలిసి ఉన్నప్పుడే వాటికి బలం, మనుగడ…)
ముంబైలో కాంగ్రెస్ విడిగా పోటీ చేస్తుందట… అంటే ఆ కూటమి విచ్ఛిన్నం అయినట్టే… చూస్తూ ఉండండి, కొన్నాళ్లకు ఠాక్రే శివసేన ఉండదు, శరద్ పవార్ ఎన్సీపీ ఉండదు… ఒకటి షిండే శివసేనలో, మరొకటి అజిత్ పవార్ ఎన్సీపీలో విలీనం అవుతాయి… (జాతీయ స్థాయిలో ఇండి కూటమి కూడా దాదాపు విచ్ఛిన్నం అయినట్టే కనిపిస్తోంది…)
ఇది మహారాష్ట్ర కథ… బీహార్ ఫలితాలు చూశాం కదా… కులం పేరిట ఎమోషన్ రాజకీయాలు చేసి… అవినీతి, కుటుంబపాలన, అక్రమాలతో భ్రష్టుపట్టిన ఆర్జేడీకి జనం ఎలా వాతలు పెట్టారో… దాంతో జతకలిసిన కాంగ్రెస్ కూడా అడ్డగోలుగా దెబ్బతినిపోయింది… కాస్త భిన్నంగా ఉండే నితిశ్ బీజేపీతో కలవడం వల్ల బతికిపోయాడు… పార్టీ నిలబడింది…
తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితిని మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో చూశాం… సమాజ్‌వాదీ పార్టీని ఆల్రెడీ యూపీ వోట్లు ఛీకొట్టారు… ఇక డీఎంకే, టీఎంసీ, ఆప్ మాత్రమే బలంగా కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి… ఒకరిది ద్రవిడ, పక్కా ప్రాంతీయ ఎమోషన్…
మరొకరిది బెంగాలీ ఎమోషన్… మన బెంగాలీ అయినా సరే, అక్రమ వలసల బంగ్లాదేశీయులైనా ఆమెకు ఒకటే.., మొన్నటి బంగ్లాదేశ్ హిందువు సజీవదహనం మీద ఒక్క మాట మాట్లాడదు… పైగా మీ వోట్లను తీసేస్తే వంటింటి సామాన్లతో తిరగబడండి అని పిలుపునిస్తుంది ఆమె అక్రమ వలసదార్లకు..!! ఆప్ పని అయిపోయింది, ఢిల్లీలో దెబ్బతిన్నది.., వేర్పాటువాదానికి, తీవ్రవాదానికి ఆజ్యం పోస్తూ పంజాబ్‌లో తన గోతి తనే తవ్వుకుంటున్నది…
ఏతావాతా… ఏదో ఓ ఎమోషన్ రాజేసి, రాజకీయం చేసి… అడ్డగోలుగా పాలించే కుటుంబ, ప్రాంతీయ పార్టీలకు రోజులు బాగాలేవు… ఇదీ సారాంశం..!! (ఏపీ, జార్ఖండ్ మాత్రమే కాస్త భిన్నమైన స్టోరీలు)… జాతీయ పార్టీలు అవినీతిలో ఏమైనా శుద్ధపూసలా అంటారా..? యూపీయే కాలం నాటి అక్రమాలకు ఇప్పటికీ కాంగ్రెస్ అనుభవిస్తూనే ఉంది…!! కేరళ ప్రాంతీయ పార్ఠీగా మారిన సీపీఎం అనుభవించబోతోంది..!!
Share this Article