.
2005… ఇండియన్ వుమెన్ క్రికెట్ జట్టు వరల్డ్ కప్ పోటీలో రన్నరప్… అప్పుడు ఒక్కో ప్లేయర్‌కు ఇచ్చింది ఎంతో తెలుసా..? 1000… మీరు చదివింది నిజమే… ఒక్కో మ్యాచుకు వెయ్యి రూపాయలు… మొత్తం 8 వేలు…
2006కు ముందు, మహిళల క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (WCAI) వద్ద జట్టును విదేశీ పర్యటనలకు పంపడానికి టికెట్ల కోసం కూడా డబ్బు లేని పరిస్థితి ఉండేది… అప్పుడు నటి మందిరా బేడీ ఒక వజ్రాల బ్రాండ్‌కు చేసిన ప్రకటనకు వచ్చిన మొత్తం పారితోషికాన్ని విరాళంగా ఇచ్చింది… ఆ డబ్బుతోనే ఇంగ్లండ్ పర్యటనకు విమాన టికెట్లు కొనుగోలు చేశారు…
Ads
అంతేకాదు… భారత మహిళా క్రికెటర్లు ఒకప్పుడు ఎదుర్కొన్న వివక్ష, కష్టాలు, ప్రోత్సాహం లేమిని గుర్తుచేసుకుంటే నేటి విజయం మరింత గొప్పగా కనిపిస్తుంది… అదే ప్రపంచ కప్ నేపథ్యాన్ని చూద్దాం… విమాన టికెట్లకు డబ్బుల్లేక చందాలు సేకరించేవాళ్లు… దేశీయ ప్రయాణాలు రైళ్లలో జనరల్ బోగీల్లో ఉండేవి…
- ప్లేయర్లు సొంత దుప్పట్లు తెచ్చుకుని నేలపై పడుకోవడం, తక్కువ వసతులు ఉన్న గదుల్లో సర్దుకోవడం కామన్… సొంత కిట్ ఉంటే ఓ లగ్జరీ… స్పాన్సరర్లు ఎవరూ లేరు… కొందరు ప్లేయర్లు బ్యాట్లను, లెగ్ గార్డులను కూడా పంచుకుని వాడేవారు, ఆడేవారు… పాపం ఆడవారు..!!
నేటి మహిళా క్రికెట్: సమానత్వం, కోట్లు
2006లో BCCI పరిధిలోకి మహిళా క్రికెట్ వచ్చిన తర్వాత, ముఖ్యంగా ఇటీవల కాలంలో తీసుకున్న నిర్ణయాల వల్ల వారి ఆర్థిక స్థితి పూర్తిగా మారిపోయింది… 2017 ప్రపంచకప్ సెమీఫైనల్ విజయం, WPL (ఉమెన్స్ ప్రీమియర్ లీగ్) వంటివి మహిళా క్రికెట్‌కు దేశవ్యాప్త ఆదరణను పెంచాయి…
ప్రస్తుతం ప్రపంచ కప్ విజయం తరువాత… 90 కోట్ల ప్రైజ్ మనీ ప్లస్ బీసీసీఐ నజరానా కలిపి)… పురుష క్రికెటర్లతో సమానంగా మ్యాచ్ ఫీజు ప్రకటించారు… టెస్టుకు 15 లక్షలు, వన్డేకు 6 లక్షలు, టీ20కు 3 లక్షలు… గ్రేడ్ ఏ కంట్రాక్టు ఉన్న ప్లేయర్‌కు 50 లక్షల వార్షిక వేతనం… (పురుషుల్లో ఇదే గ్రేడ్‌కు 7 కోట్లు…) వుమెన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యధికంగా స్మృతి మంధానకు చెల్లిస్తారు… తాజాగా 3.5 కోట్లు…
ఒకప్పుడు మ్యాచ్ ఫీజు 1000 రూపాయలు… ఇప్పుడు 6 లక్షలు… ఇదీ తేడా… ఇవి ఎందుకు చెప్పుకోవాలీ అంటే… మహిళలు ఇదే కాదు, ఇతరత్రా క్రీడల్లో కూడా ముందుకు రావాలని చెప్పడం కోసం..! చెస్, బ్యాడ్మింటన్, టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, షూటింగ్, ఆర్చరీ వంటి క్రీడలకూ స్పాన్సరర్లు దొరుకుతున్నారు… స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ కొలువుల్లో ప్రయారిటీ కూడా…

ఉదాహరణకు… దీప్తి శర్మ యూపీలో డీఎస్పీ ఇప్పుడు… కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మొదట రైల్వేలో ఆఫీస్ సూపరింటిండెంట్… ఇప్పుడు డీఎస్పీ..
నిన్నటి వేలల్లో ఉన్న ప్రైజ్ మనీ, చందాలతో విదేశీ పర్యటనలు, పంచుకున్న బ్యాట్‌ల కాలం నుండి… నేటి కోట్లలో నజరానాలు, సమాన మ్యాచ్ ఫీజులు, బిజినెస్ క్లాస్ ప్రయాణాల స్థాయికి భారత మహిళా క్రికెట్ ఎదిగింది… ఇది కేవలం క్రీడాకారిణుల ప్రతిభ, నిబద్ధత మాత్రమే కాక, BCCI వంటి సంస్థలు తీసుకున్న కీలక నిర్ణయాలు, WPL వంటి లీగ్‌ల ద్వారా పెరిగిన ఆదరణ, పెట్టుబడికి నిదర్శనం…
మిథాలీ రాజ్ వంటి తొలితరం క్రికెటర్ల పోరాటం, మందిరా బేడీ వంటి వ్యక్తుల అండ… ఈ రోజు హర్మన్‌ప్రీత్ కౌర్ సేన సాధించిన విజయానికి బలమైన పునాదులు వేశాయి. ఇది కేవలం ఆర్థిక విజయమే కాదు, క్రీడల్లో స్త్రీ, పురుష సమానత్వం దిశగా దేశం వేసిన గొప్ప అడుగు…

మగ క్రికెటర్లు వందల కోట్లకు ఎదిగారు… వారితో ఇప్పుడప్పుడే వుమెన్ ప్లేయర్లను పోల్చలేం కానీ… WPL,, కమర్షియల్ యాడ్స్, బ్రాండ్ ప్రమోషన్స్, పెరిగిన మ్యాచు ఫీజుల కారణంగా… మిథాలీ ఆస్తి 40- 45 కోట్లు ఇప్పుడు… రిటైరైనా ఏమాత్రం తగ్గలేదు…
స్మృతి మంధానా ఆర్సీబీ కెప్టెన్, బీసీసీఐ గ్రేడ్ ఏ కంట్రాక్టు, టాప్ బ్రాండ్ల ఎండార్స్‌మెంట్ల ద్వారా 32-34 కోట్లకు ఎదిగింది… తరువాత హర్మన్ ప్రీత్ 24- 26 కోట్లు… జెమీమా రోడ్రిగ్స్ 10- 15 కోట్లు… ఢిల్లీ కేపిటల్స్ జట్టు, బీసీసీఐ బీ గ్రేడ్ కంట్రాక్టు, కొన్ని ఎండార్స్‌మెంట్లు… దీప్తి శర్మ ఆస్తులు 5-10 కోట్ల నడుమ…

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి వారికి ఒక్కో యాడ్ కోసం ₹5 కోట్ల నుండి ₹10 కోట్ల వరకు పారితోషికం అందుతుంది… వారికి గ్లోబల్ బ్రాండ్‌లు ఉన్నాయి… మహిళా క్రీడాకారిణులకు బ్రాండ్‌లు వస్తున్నప్పటికీ, వారి ఫీజులు ఇంకా లక్షల్లో లేదా కోటి లోపు మాత్రమే ఉన్నాయి (WPL విజయం తర్వాత ఈ వ్యత్యాసం కొంత తగ్గుతోంది)…
సినిమాలు, యాడ్స్, టీవీలు, మోడలింగ్, ఫ్యాషన్ షోలు… ఏ ఫీల్డ్ చూసుకున్నా… మహిళల పనివేళలు, వేతనాల మీద వివక్ష చూస్తూనే ఉన్నాం… ఇటీవలి దీపిక పడుకోన్ వివాదం చదివాం కదా… మన పెద్ద దర్శకుల పెద్ద గొప్పదనం కూడా చూశాం కదా… సరే, మహిళా క్రికెటర్ల విషయానికొస్తే… ఎంతోకొంత న్యాయం జరుగుతోంది… మగ క్రికెటర్లతో పోలిస్తే ఇంకా చాలా దూరంలో ఉన్నా సరే..!!

ఓసారి న్యూజిలాండ్‌లో హోటల్ గదులు కూడా ఇవ్వకపోతే… తెలిసిన ఎన్ఆర్ఐల ఇళ్లలో ఉంటూ మ్యాచులు ఆడారట… తరువాత మందిరా బేడి ఓ అనధికారిక స్పాన్సరర్‌లా టీమ్‌కు ఎంతో సాయం చేసింది… ఈ ప్రపంచ కప్ విజేత నిజానికి పరోక్షంగా మందిరా బేడీ కూడా..!!
Share this Article
