కొన్ని దేశాల్లో ఉన్న మనవాళ్లు నోటికొచ్చినట్టు సోషల్ మీడియా పోస్టుల్ని పెట్టి కేసులు, అవస్థల పాలైన ఉదాహరణలు చూశాం… మన దేశంలో కూడా కొన్ని సంస్థల్లో పనిచేసేవాళ్లకు దూల ఎక్కువ… రాబోయే పరిణామాల్ని, నష్టాల్ని అంచనా వేసుకోకుండా ఇష్టారీతిన పోస్టులు పెడుతుంటారు… కొందరు తెలివిగా ఇది నా వ్యక్తిగతం అంటూ డిస్‌క్లెయిమర్స్ కూడా రాస్తుంటారు… కానీ టైమ్ ఎదురుతన్నినప్పుడు ఇవేమీ కాపాడవు… గిలెటిన్… అనగా తల తెగిపడటమే… అంతే…
వ్యక్తిగతంగా పలు అంశాలపై ఎలాంటి అభిప్రాయాలున్నా సరే… వ్యక్తులపై రాగద్వేషాలున్నా సరే… దాచుకోవడం అవసరం… కాదని దూల చూపిస్తే, అది తాము పనిచేసే సంస్థలకు చిర్రెత్తిస్తే జరిగే నష్టం తమకే… ఓ తాజా ఉదాహరణ ఏమిటంటే…? ఇండియాటుడే గ్రూపు చాలా పెద్ద మీడియా సంస్థ తెలుసు కదా… అందులో కోల్‌కత్తా కేంద్రంగా ఇంద్రనీల్ చటర్జీ అనే పెద్దమనిషి డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా కొలువు వెలగబెడుతున్నాడు…
అది అసలే మీడియా గ్రూపు… తమ ఉద్యోగులు వ్యక్తం చేసే అభిప్రాయాలు కూడా సంస్థపై కొంత రిఫ్లెక్టవుతుంటాయి… పైగా బాధ్యతాయుత పోస్టుల్లో ఉన్నవాళ్లకు సంయమనం అవసరం… ద్రౌపది ముర్ము రాష్ట్రపతి కావడం ఆయనకు చాలా కోపం తెప్పించింది… ఓ ఫేస్‌బుక్ పోస్టులో తన బాధను వెళ్లగక్కాడు… అదేమో వైరల్ అయిపోయింది… వాళ్ల బాసులకు ఫోన్లు… ఎంబరాస్‌మెంట్… ఇదేందిరభయ్ అనడిగారు… క్లారిఫికేషన్ ఇవ్వు అన్నారు… దాంతో వెంటనే ఆ పోస్టు డిలిట్ చేశాడు…
Ads
సారీ సర్, ఈసారికి తప్పుకాయండి సార్, ఇంకెప్పుడూ ఇలా దూల ప్రదర్శించను సార్ అని వేడుకున్నాడు… ఐతేనేం… సదరు మీడియా సంస్థ కొలువు నుంచి ఊడబీకి, మెడలు పట్టుకుని గేటు దాటించింది… అందుకే సోషల్ దూలతో ఆడుకోవడం అంత మంచిది కాదని పెద్దలు చెబుతుంటారు… అసలు తను ఏం రాశాడో తెలుసా..?
తను డిలిట్ చేసినా, అప్పటికే చాలామంది స్క్రీన్ షాట్ తీసి, ఆడుకుంటున్నారు… రఫ్‌గా చెప్పాలంటే… ‘‘నేను పాతతరం మనిషిని, దానికి గర్వపడుతుంటాను కూడా… నేను స్వలింగసంపర్కుల పెళ్లిళ్లను సమర్థించను… అలాగే ఓ ఆదివాసీ రాష్ట్రపతి కావడాన్ని కూడా అంగీకరించను… కొన్ని కుర్చీలు ‘‘అందరికోసం’’ ఉద్దేశించినవి కావు… వాటికి కాస్త గౌరవం ఉంటుంది… దుర్గపూజ చేయడానికి ఓ స్వీపర్‌ను అనుమతిస్తామా..? మదరసాల్లో హిందువులు బోధించగలరా..?
ప్రతిపక్షాలకు ‘‘మధ్యవేలు చూపిస్తూ’’ (అభ్యంతకర ముద్ర) చట్టాల్ని ఓ రాజ్యాంగబద్ధమైన రబ్బర్ స్టాంప్ ద్వారా పాస్ చేయించుకునే చౌకబారు సామాజిక- రాజకీయ జిమ్మిక్కు ఇది… మనం రైసినా హిల్స్ (రాష్ట్రపతి భవన్) కుర్చీనే కాదు… అబ్దుల్ కాలం, ప్రణబ్ ముఖర్జీ, రాధాకృష్ణన్, జకీర్ హుసేన్, శంకర్ దయాళ్ శర్మ, రాజేంద్రప్రసాద్ వంటి గొప్ప వ్యక్తులను కూడా అవమానించినట్టే… ఈ మధ్యయుగ కుల రాజకీయాలకు బాబా ఇంద్ర (ఇంద్రనీల్ పైత్యనామం) వ్యతిరేకం. ఖచ్చితంగా నా వ్యక్తిగత అభిప్రాయం…’’
అచ్చంగా ఇది ద్రౌపది ముర్మును అవమానించినట్టే… అంతేకాదు, సదరు మీడియా పెద్దమనిషి అల్పత్వాన్ని అద్దంలా చూపిస్తోంది… ఇలాంటి కేరక్టర్లు ఖచ్చితంగా ఆ సంస్థకు ఎప్పుడైనా నష్టదాయకమే… సో, ఇండియాటుడే గ్రూపు ఈ చటర్జీ తల తీసేయడం సరైన నిర్ణయమే..!!
Share this Article