ఇండియాటుడే… ఓ జాతీయ మీడియా సంస్థ… పాపులర్ మీడియా… సర్వేలు, ఇతరత్రా ప్రయోగాలతో ఎప్పుడూ అదే మీడియా వార్తల్లో ఉంటుంది కూడా… అది పాత్రికేయ కోణంలోనే చేసిన ఓ తాజా ప్రయోగం మాత్రం మరీ టీవీ9 తరహాలో ఉండి నవ్వు పుట్టించింది…
తిరుమల లడ్డూ వ్యవహారం కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీయడం నిజం… జంతుకొవ్వుల కల్తీ నెయ్యితో లడ్డూల తయారీ నిజంగానే జరిగిందో లేదో… ఎవడి పాపమో, ఏ నికృష్టుడి నైచ్యమో తెలియదు, ఇప్పట్లో తేలదు, ఆ దేవుడే చూసుకుంటాడు గానీ… దేశవ్యాప్తంగా ప్రధాన ఆలయాల్లో ప్రసాదాల నాణ్యత మీద చర్చను మాత్రం ఈ వివాదం లేవనెత్తింది…
శుభం… అశుభంలోనూ ఓ పరమార్థం… ఇండియాటుడే ఏం చేసిందీ అంటే… కొన్ని ప్రధాన ఆలయాల్లో ప్రసాదాలను తీసుకుని, ల్యాబరేటరీ పరీక్షలు తనే సొంతంగా చేయించింది… (Shriram Institute for Industrial Research)… సంకల్పం వరకూ వోకే… కానీ దాని ఆచరణలో లాజిక్కులను పూర్తిగా వదిలిపెట్టేశారు… అంతేకదా మరి, ప్రజెంట్ మీడియా అంటేనే లాజిక్ రాహిత్యం కదా…
Ads
తిరుమల లడ్డూతోపాటు తొలి దశలో మధుర- బృందావన్ ప్రసాదాన్ని కూడా పరీక్షలకు పంపించారు… బాగానే ఉందని తేల్చారు… వంటనూనెలు, జంతువుల కొవ్వుల నూనెలు ఏమీ కల్తీ కాలేదనీ, దేశీ నెయ్యి వాడారని ఆ ల్యాబ్ పరీక్షల్లో తేలింది… సో, తిరుమల లడ్డూ సేఫ్, పవిత్రం, నాణ్యం అని ఇండియాటుడే చెప్పేసింది…
కానీ కల్తీ గత ప్రభుత్వ హయాంలో జరిగింది అనేది కదా ఆరోపణ… ఇప్పుడు అన్నిరకాల జాగ్రత్తలతో స్వచ్ఛమైన ఆవునెయ్యితో లడ్డూ తయారు చేస్తున్నామని టీటీడీ, ప్రభుత్వం చెబుతున్నాయి కదా… మరి వర్తమానంలోని లడ్డూను పరీక్షలు చేయిస్తే, అది చంద్రబాబుకు సర్టిఫికెట్ ఇవ్వడం తప్ప, పాత జగన్ పాపానికి శీలపరీక్ష చేయడం కాదు కదా… ‘భూత’కాలం పాపాలపై వర్తమాన పరీక్షలు దేనికి..?
తదుపరి దశలో ఢిల్లీ జనదేవళన్ మందిర్, హనుమాన్ మందిర్ ప్రసాదాల్ని పరీక్షించారు… జనదేవళన్ ప్రసాదం వంటనూనెలు, వనస్పతితో తయారైనట్టు తేలిందట… ఏముంది ఇందులో..? ప్రతి చోటా గుడి ప్రసాదాన్ని ఆవు నెయ్యితోనే చేయాలనేముంది..? ఆ గుడి సంప్రదాయం, గుడి ఆదాయం, ప్రసాద వ్యయం, వసూలు చేసే ధర వంటి చాలా అంశాలు ముడిపడి ఉంటాయి… జంతువుల కొవ్వుల నూనెల కల్తీ అపచారం తప్ప వంట నూనెలు, వనస్పతి అపరాధం ఎలా అవుతుంది..?
లక్నోలో మంకమేశ్వర్, హనుమాన్ సేతు గుళ్ల ప్రసాదాల్ని కూడా లేబరేటరీకి పంపించారు… వాటి పరిసరాల్లోని మిఠాయి దుకాణాల శాంపిళ్లతో పోలిస్తే గుళ్లో ప్రసాదాలు వోకే… ముంబైలో సిద్దివినాయక ఆలయం చాలా ఫేమస్… అక్కడ లడ్డూ, బర్ఫీలను పరీక్షలు చేయిస్తే… మంచి నాణ్యత ప్రమాణాలున్నట్టు తేలింది…
నిజానికి దేశంలోని ప్రతి ఆలయం తిరుమల లడ్డూ వివాదం తరువాత తమ ప్రసాదాల నాణ్యత మీద దృష్టి పెట్టాయి… దిద్దుకున్నాయి… పరీక్షలు చేయించుకున్నాయి… కొత్త కట్టుదిట్టాలు మొదలుపెట్టాయి… సిద్ధివినాయక ఆలయంలో గుడి ప్రసాదమే గాకుండా… భక్తులు మోతీచూర్ లడ్డూ వంటి స్వీట్లు అక్కడికక్కడే కొని భక్తులకు పంచిపెడుతుంటారు… కర్నాటకలోని గానుగాపూర్‌లో కూడా అంతే… అవన్నీ నాణ్యమైనవా అని ఎవరూ చూడరు..? ప్రైవేటు తయారీ… రేటును బట్టి క్వాలిటీ…
సో, ఇండియాటుడే ఉద్దేశం మంచిదే అయినా… తిరుమల లడ్డూ వివాదం తరువాత చాన్నాళ్లకు పరీక్షలు చేయించడమే సరైన ఆచరణ కాదు..!!
Share this Article