.
పెద్దన్న ట్రంపు చెప్పాడు కాబట్టి అది అంతిమ ప్రకటన… భారత విదేశాంగ శాఖ కూడా అధికారికంగానే ప్రకటించింది కాబట్టి నిజమే… ఏమిటి..? ఆపరేషన్ సిందూర్ అయిపోయింది… పాకిస్థాన్ ఇండియా నడుమ కాల్పుల విరమణ అంగీకారం జరిగింది…
సో, ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయి… ఎక్స్‌పెక్ట్ చేస్తున్నదే… అదే జరిగింది… రెండు అణ్వస్త్ర దేశాల నడుమ యుద్ధాన్ని ప్రపంచమే ఒప్పుకోదు… ఒత్తిడి చేస్తుంది… ఒప్పిస్తుంది… దీనికి అమెరికా అనే పెద్దన్న మధ్యవర్తిత్వం… తప్పలేదు, తప్పదు…
Ads
ఎందుకు తప్పదు..? ఎందుకంటే..? పాకిస్థాన్‌కు ఓసారి బలమైన శాస్తి అవసరమే కానీ… అమెరికా వంటి దేశం చెప్పాక అయిష్టంగానైనా అంగీకరించకతప్పదు… లేకపోతే యూరోపియన్ యూనియన్, అమెరికా మిత్రదేశాలు మనల్ని ఏకాకిని చేస్తాయి… అది మనకే నష్టం…
పాకిస్థాన్ కూడా వినక తప్పదు… అసలు అది అర్జెంటుగా ట్రంపు ఫోటోకు నమస్కారం పెట్టాలి… యుద్ధం కొనసాగితే అత్యంత తీవ్రంగా నష్టపోయేది… మరి ఈ యుద్ధం ఏం తేల్చింది..?
1. ఇంతకుముందులా కాదు, ఏ ఉగ్రదాడి జరిగిన ప్రతీకారం, పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయనే బలమైన సంకేతం ఇచ్చాం… అధికారికంగానే ఇండియా ప్రకటించింది, ఏమని..? ఇకపై ప్రతి ఉగ్రదాడిని ఈ దేశం మీద యుద్ధప్రకటనలాగే తీసుకుంటాం అని… (అఫ్‌కోర్స్, చీరినా సరే పాకిస్థాన్ మారదు, ఇంకొన్ని వ్యూహాల్ని ఇండియా ఆలోచించాల్సిందే…)
2. పాకిస్థాన్ బీరాలు తప్ప దానికి స్టామినా లేదు, నాలుగు రోజులు యుద్ధం చేసే స్థితి లేదని ప్రపంచానికి కూడా అర్థమైపోయింది… బొచ్చె పట్టుకుని అంతర్జాతీయ వీథుల్లో అప్పులు బిచ్చమెత్తినా ఒక్కడూ దేకలేడు… ప్రపంచం దాన్నెలా చూస్తున్నదో దానికీ అర్థమైంది… (ఐఎంఎఫ్ అప్పు యుద్ధావసరాలకు కాదు… అదెప్పుడో సాంక్షన్ అయింది కూడా…)
3. మన మిత్ర దేశాలు ఏమిటో మనకూ ఓ క్లారిటీ వచ్చింది… ప్రత్యేకించి టర్కీ, అజర్‌బైజాన్ మన శత్రుదేశాల జాబితాలో చేరినట్టే… తొక్కలో అజర్‌బైజాన్‌దేముందిలే గానీ… టర్కీ డేంజరస్…
4. పాకిస్థాన్‌కు కూడా అర్థమైంది… ఇస్లామిక్ దేశాలతోపాటు ప్రపంచంలోని ఏ దేశమూ దానికి మద్దతుగా రాదు అని… (ఆ రెండు దేశాలు తప్ప)… దానికి బెలూచిస్తాన్, టీటీపీ తీవ్రవాదం సెగ కూడా గట్టిగానే తగిలింది… కీలకమైన సందర్భాల్లో చైనా కూడా దానికి అండగా రాదనే చేదునిజం కూడా తెలిసిపోయింది…
5. మరీ ముఖ్యంగా చైనా సరుకు ఉత్త తుప్పాస్ అనీ, ఉత్తర కొరియా ఇచ్చిన మిసైళ్లు కూడా తాలు సరుకునని తేలిపోయింది… అన్నింటికీ మించి గగనతల రక్షణలో ఇండియా ఎంత దృఢంగా ఉందో ప్రపంచానికి అర్థమైంది…
6. ఎస్-400 మాత్రమే కాదు, మన ఆకాష్, మన రాఫెల్ ఎట్సెట్రా మన రక్షణకు ఎంత కీలకమో కూడా అర్థమైంది… పాకిస్థాన్ నుంచి డొల్ల డ్రోన్లే కాదు, అణ్వస్త్రాల మిసైళ్లు, పురుగు వచ్చినా సరే, ఒక్కటీ ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వకుండా పేల్చేయగలమని ప్రపంచ దేశాలకు అర్థమైంది… పాకిస్థాన్‌లో ఎన్ని ఎయిర్‌బేసులు, ఏయే నష్టాలు జరిగాయో బహుశా రేపోమాపో మీడియా సవివరంగా చెబుతుంది, వేచి ఉండండి…
7. ఇండియాలో అంతర్గతంగా ఏయే శక్తులు కీలకమైన విపత్తుల్లో, యుద్ధసమయాల్లో ఎలా వ్యవహరిస్తాయో ప్రభుత్వానికి మంచి క్లారిటీ వచ్చింది… ఈ టెంపో కొనసాగించాల్సిన అవసరముంది… ప్రత్యేకించి మన మీద విషం కక్కే సోషల్ మీడియా అకౌంట్లు, మీడియా మీద కొరడా సజీవంగానే ఉండాలి… అసలు ఇవే మన దేశానికి అసలైన శత్రువులు…
8. పాకిస్థాన్ కాలు దువ్వుతున్నా సరే, మతం పేరిట ఇండియన్ ముస్లింలు (చాలావరకూ) పాకిస్థాన్ అనుకూలతను గానీ, మన దేశ వ్యతిరేకంగా గానీ వ్యవహరించలేదు… ఒవైసీ వంటి ముస్లిం వాయిస్ కూడా ఈ దేశం పట్ల బలమైన, పాజిటివ్ వైఖరిని ప్రదర్శించడం అభినందనీయం…
9. యుద్ధ సందర్భాల్లో, దాడుల్లో మనం ఎంత ఖచ్చితత్వాన్ని పాటిస్తామో చేసి చూపించాం, అంతేకాదు, మన సైనిక విభాగాలు, కీలకమైన ఉన్నతాధికారుల నడుమ సమన్వయం ఎలా ఉంటుందో ఓసారి ప్రాక్టికల్‌గా చూసుకున్నాం…
10. చివరగా మరో విశేషం… ఈ దేశం సెక్యులర్… ఏ స్థాయి వరకైనా… ఓ ముస్లిం యువతి కావచ్చు, ఓ సిక్కు యువతి కావచ్చు… ఈ దేశ పతాకను పక్కన పెట్టుకుని, యుద్ధ విశేషాలను ప్రపంచానికి చెబుతున్న తీరు సూపర్బ్… ఫేక్ సెక్యులర్ గీతాలు పాడే కుళ్లు బుద్ధులకు ఆ ఫోటోలు, ఆ వీడియోలు చెంపపెట్టు..!
చివరగా… యుద్ధ విరమణ అంటే విరామం… ఫుల్ స్టాప్ కాదు… మోడీ రేప్పొద్దున కొత్త ఆలోచనలతో పాకిస్థాన్‌ను నష్టపరుస్తాడా లేకపోతే నిద్రపోతాడా చూడాల్సిందే… కానీ కార్గిల్ తరువాత జాతి మొత్తం చైతన్యవంతమై ఓ జోష్‌తో ఏకమైన సందర్భం మాత్రం ఇదే… ఇదే వేడిలో పీవోకే స్వాధీనం చేసుకుని ఉండాల్సిందని మెజారిటీ దేశప్రజల కోరిక… ఇదే నిరాశపరిచేది, నిట్టూర్చేది…!!
Share this Article