.
నారా లోకేష్. పేరుకు మంత్రే అయినా కూడా కూటమి ప్రభుత్వంలో అంతకు మించి అన్న విషయం బహిరంగ రహస్యమే. పార్టీలోనూ .. ప్రభుత్వంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తర్వాత ఆయనే అనే విషయం తెలిసిందే.
ఇది అంతా ఇప్పుడు ఎందుకు అంటే ఎంతో భవిష్యత్ ఉన్న నాయకుడు అయిన లోకేష్ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకటి.. అధికారంలోకి వచ్చిన తర్వాత మరొకటి అన్న చందంగా వ్యవహరిస్తూ విమర్శలు మూటకట్టుకుంటున్నారు.
Ads
అందుకు బెస్ట్ ఉదాహరణ ఇండో సోల్ కంపెనీ వ్యవహారమే. ప్రతిపక్షంలో ఉండగా నారా లోకేష్ ఇండో సోల్ పెట్టుబడులను ఫేక్ గా అభివర్ణించారు. లక్ష రూపాయల మూలధనంతో ఏర్పాటు అయిన ఇండో సోల్ 72,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతుంది అంట. ఇది ఫేక్ కాక మరేమిటి?.. ఇది ఎలా ఫేకో.. జగన్ హయాంలో కుదిరిన అవగాహన ఒప్పందాలు కూడా అలాగే ఫేక్ అంటూ నారా లోకేష్ ప్రతిపక్షంలో ఉండగా విమర్శలు గుప్పించారు.
ఈ కంపెనీ అడ్రస్ కూడా పులివెందులే అని చెప్పుకొచ్చారు. ఒకప్పుడు ఫేక్ అని విమర్శించిన ఇండో సోల్ కంపెనీ విషయంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎక్కడలేని ప్రేమ కురిపిస్తోంది. మరో స్వయంగా నారా లోకేష్ ఫేక్ అని చెప్పిన కంపెనీపై ఇప్పుడు ఇంత ప్రేమ కురిపించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?.
దీని వెనక ఉన్న బలమైన కారణాలు ఏంటి?. కరేడు గ్రామంలో రైతులు ఎన్నో పంటలు పండే తమకు జీవనాధారం అయిన భూములు ఇవ్వబోం అని చెపుతున్నా కూడా ప్రభుత్వం ఎందుకు అంతగా ఇండో సోల్ కోసం రాజీపడకుండా ముందుకు సాగుతోంది.
ఈ కంపెనీ కోసం ఏకంగా 8,234 ఎకరాల భూమి ఇచ్చేందుకు సర్కారు సిద్ధం అయింది. దీని కోసం ఇప్పటికే కేబినెట్ లో కూడా అనుమతి తీసుకున్నారు. ఇండో సోల్ యాజమాన్యానికి చెందిన మరో కంపెనీ షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్. ఈ కంపెనీకి జగన్ హయాంలో చేసిన మేళ్లు అన్ని ఇన్ని కావు. అవి ఇప్పటికే కొనసాగుతున్నాయి.
ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర మొదలుపెడితే అన్ని పనులు ఈ సంస్థకే కేటాయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జగన్ పేరు ఎత్తితే చాలు మండిపడే చంద్రబాబు, నారా లోకేష్ ఈ గ్రూప్ కంపెనీల విషయంలో ఈగ కూడా వాలనీయకుండా చూసుకోవటంతో పాటు వాళ్ళకే పెద్ద ఎత్తున ప్రయోజనం కలిపించేలా వ్యవహరిస్తుండటం ఇప్పుడు టీడీపీ నేతలు, క్యాడర్ ను కూడా విస్మయానికి గురి చేస్తోంది.
నారా లోకేష్ చెప్పినట్లు జగన్ హయాంలో ఫేక్ కంపెనీలతో ఎంఓయూలు చేసుకుంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా అలా పుట్టిన కంపెనీలకు ఇలా వేల కోట్ల రూపాయల పవర్ ప్రాజెక్ట్ లతోపాటు ఇతర రంగాల్లో కూడా ప్రాజెక్ట్ లు కేటాయిస్తున్నారు. నారా లోకేష్ శాఖ అయిన ఐటి శాఖలో ఉర్సా క్లస్టర్స్ కు వైజాగ్ లో భూమి కేటాయింపు ఎంతో దుమారం రేపిన సంగతి అందరికి తెలిసిందే.
కరేడు భూముల సేకరణ విషయంలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా కూడా ప్రభుత్వ పెద్ద ల నుంచి ఎలాంటి స్పందనా లేకపోవటమే పెద్ద విషాదం. ఇక్కడ మరో విచిత్రం ఏమిటి అంటే ఈ కంపెనీని ముందు తెర మీదకు తెచ్చింది జగన్ మోహన్ రెడ్డి… వైసీపీ ప్రభుత్వమే కావటంతో వాళ్ళు కూడా సైలెంట్.
అంటే రాజకీయంగా ఏ మాత్రం పడదు అని పైకి కలరింగ్ ఇచ్చుకుంటూ ఇండో సోల్ విషయంలో మాత్రం తెర వెనక అటు కూటమి.. ఇటు వైసీపీ కలిసి పనిచేస్తున్నాయి అనే విమర్శలు కూడా ఉన్నాయి. లేకపోతే ఒకప్పుడు ఫేక్ ఇండో సోల్ ఫేక్ అని చెప్పిన నారా లోకేష్ ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారు అంటే దాని అర్ధం అదే కదా… (వాసిరెడ్డి శ్రీనివాస్)
Share this Article