Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కమల్ అంటే కమలే… ఏ పాత్రయినా సరే అలవోకగా దూరిపోగలడు…

January 5, 2026 by M S R

.

Subramanyam Dogiparthi ………. 1989 నవంబరులో వచ్చిన ఈ ఇంద్రుడు చంద్రుడు సినిమా డబ్బింగ్ సినిమా కాదు . కమల్ హాసన్ కనిపించగానే డబ్బింగ్ అనుకునే అవకాశం ఉంది . ఇది సురేష్ ప్రొడక్షన్స్ బేనర్ కింద రామానాయుడు నిర్మించిన స్ట్రైట్ తెలుగు సినిమా .

ఈ సినిమాకు మరో ప్రత్యేకత కూడా ఉంది . పరుచూరి బ్రదర్స్ కధకు స్క్రీన్ ప్లేని కమల్ హాసన్ తయారుచేసాడు . కాబట్టే క్లైమాక్సులో చేజింగ్స్ , సర్కస్ ఫీట్లు , కార్లు గుద్దుకోవటాలు వగైరా పుష్కలంగా ఉన్నాయి .

Ads

పక్కా వినోదాత్మక సినిమా . అందులో మళ్ళా ఓ మేయర్ రసికత , అవినీతి , లౌక్యం , అన్నీ మిళితం చేయబడ్డాయి . అండర్ గ్రౌండ్ డ్రైనేజీల ప్రపంచ బాంకుల నిధుల్ని స్వాహా చేయటం 1989 రోజుల్లోనే ఉందన్న మాట . అలాగే మేయర్ , ఆయన స్టెపినీ , సెక్రటరీ , ఓ సెటిల్మెంట్ బ్రోకర్ , అంతా కలిపి నగర నిధులను , గ్రాంట్లను ఎలా అప్పడంలాగా కరకర నమిలేస్తారో సరదాగా చూపించారు ఈ సినిమాలో .

ఈ సినిమాలో ముందుగా మెచ్చుకోవలసింది కమల్ హాసన్నే . పొట్టేసుకుని పళ్ళికిలిస్తూ మేయరుగా బ్రహ్మాండంగా నటించాడు . కాలేజీ కుర్రాడుగా డాన్సరుగా రెండో పాత్రను కూడా అంతే గొప్పగా నటించాడు . రెండు పాత్రల్లోనూ కామెడీ ఉంటుంది . సినిమానంతా రెండు పాత్రలు ప్రేక్షకులను లాక్కెళ్ళుతాయి .

తర్వాత హీరోయిన్ విజయశాంతి . చలాకీగా , రొమాంటిగ్గా , కమల్ హాసనుకు దీటుగా అలరించింది . ముఖ్యంగా డ్యూయెట్లలో స్వతహాగా డాన్సరయిన కమల్ హాసనుతో సమానంగా డాన్సించింది .

ఆమె తర్వాత మా గుంటూరు జయలలిత , విలన్ చరణ్ రాజ్ , గొల్లపూడి మారుతీరావు , శ్రీవిద్య , పి యల్ నారాయణ , నాగేష్ , కుయిలీ , దివ్య , ప్రదీప్ శక్తి , డబ్బింగ్ జానకి  తదితరులు నటించారు .

ఇళయరాజా సంగీత దర్శకత్వంలో పాటలన్నీ హిట్టే . ముఖ్యంగా లాలీ జో లాలీ జో ఊరుకో పాపాయీ పారిపోనీకుండా పట్టుకో నా చేయీ పాట చాలా శ్రావ్యంగా ఉంటుంది . కమల్ హాసన్ చాలా బాగా నటించాడు . కాలేజీ ఏజిలో టీనేజి మోజులో డిగ్రీలు మోసుకొచ్చాను అంటూ సాగే గ్రూప్ డాన్స్ కూడా బాగుంటుంది .

సంధ్యారాగపు సరిగమలో తొలి కలయికలో పాట చిత్రీకరణ చూడాల్సిందే… ప్రత్యేకించి ఫస్టాఫ్ సాంగ్ సప్తవర్ణ సమ్మేళనమే… చిన్న చిన్న స్టెప్పులతో ఆద్యంతం రక్తికట్టిస్తారు కమల్, విజయశాంతి…

దోర దోర దొంగ ముద్దు దోబూచి అంటూ సాగే రెండు డ్యూయెట్లలో కమల్ హాసన్ , విజయశాంతిల డాన్సులు బాగుంటాయి . నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డు సిధ్ధంరా ఫ్రెండూ అంటూ మేయర్ పాడే బొంగురు గొంతు పాటను బాలసుబ్రమణ్యం అద్భుతంగా పాడారు . (బహుశా ఇదే పాటకు కావచ్చు, బాలు వోకల్ కార్డ్స్ ఇబ్బందికి గురై, ట్రీట్‌మెంటు కూడా తీసుకున్నాడు అంటారు…) డాన్సుల్ని రఘురాం కంపోజ్ చేసారు .

పాటల్ని వేటూరి , సిరివెన్నెల వ్రాయగా బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , జానకమ్మ పాడారు . కధా రచనలో పరుచూరి బ్రదర్సుకు ఇ వి వి సత్యనారాయణ , క్రేజీ మోహన్ సహకరించారని టైటిల్సులో వేసారు . ఇ వి వి ఓ గెస్ట్ పాత్రలో తళుక్కుమంటాడు కూడా . ఇ వి వి ఈ సినిమాకు కో డైరెక్టర్ కూడా . పరుచూరి బ్రదర్స్ డైలాగులను చాలా బాగా వ్రాసారు .

సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా వీర హిట్టయింది . తమిళంలోకి , హిందీలోకి డబ్ అయింది . తమిళంలో కూడా చాలా హిట్టయింది . కమల్ హాసనుకు ఉత్తమ నటుడుగా నంది అవార్డు కూడా వచ్చింది . సినిమా యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూసినా మళ్ళా చూడవచ్చు . ఎక్కడా బోరించదు . చక్కటి వినోదాత్మక , రొమాంటిక్ సినిమా .

నేను పరిచయం చేస్తున్న 1213 వ సినిమా. #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_స్కూల్ #సినిమా_కబుర్లు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏ అవకాశం ఎవరిని వరిస్తుందో… ఏ రేంజుకు ఎత్తుతుందో ఎవరికెరుక..!!
  • మరో బ్లో- ఔట్…! నాటి పాశర్లపూడి నుంచి నేటి మలికిపురం దాకా..!!
  • ప్రపంచంలోకెల్లా అతి పెద్ద శివలింగం… గుళ్ల సముదాయం కూడా…
  • ఇక్కడ ఏం పీకి కట్టామని దేశంలో పీకుతాం… బీఆర్ఎస్ రాజ్యాంగం ఓ పెద్ద జోక్…
  • So Long Love… ఎన్నాళ్లకెన్నాళ్లకెన్నాళ్లకు… ఎన్నెల్లు తిరిగొచ్చె మా కళ్లకు…
  • మేడిగడ్డ బరాజులాగే… కల్వకుర్తి లిఫ్టు… కవిత ప్రశ్నకు జవాబుల్లేవ్…
  • కమల్ అంటే కమలే… ఏ పాత్రయినా సరే అలవోకగా దూరిపోగలడు…
  • స్మిత వాయిద్యాల జోరు పాటలోకి ఈ రాజు గారు ఎలా దూరారు..?
  • వచ్చిందమ్మా వయ్యారీ… నువ్వొకదానివి తక్కువయ్యావు ఇన్నాళ్లూ…
  • విస్తుగొలుపుతున్న మావోయిస్టుల అత్యంతాధునిక ఆయుధ సామగ్రి..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions