కొన్ని మౌనంగా ఉండలేం… ఉండకూడదు… కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుంది అని ఊరుకోలేం… ఇంకెవడో మనల్ని ఎండగట్టేముందు మనమే ఆత్మవిమర్శ చేసుకోవడం బెటర్… ఇక్కడ పేర్లు రాయకుండా ఒక టీవీ చానెల్, ఒక రిపోర్టర్ అని ఏమీ తప్పించుకోవడం లేదు… టీవీ9 చిల్లర రిపోర్టింగ్ తీరు గురించే చెబుతున్నా…
రేటింగ్స్‌లో ఎన్టీవీ ఫస్ట్ ప్లేసుకు వెళ్లి, అప్పటిదాకా ఆ ప్లేసును ఎంజాయ్ చేసిన టీవీ9 రెండో స్థానానికి జారిపోయినా… తప్పులు దిద్దుకుందామనే సోయి లేదు… ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్లకే భాష రాదు, పోక్సోను పోస్కో అని, వర్షాన్ని రుధిరం అని పలుకుతూ ఉంటే… స్టోరీల ప్రజెంటేషన్‌లో పిచ్చి పోకడలు పోతుంటే… ప్రేక్షకులు ఇక మళ్లీ ఫస్ట్ ప్లేసు పట్టం ఎందుకు కడతారు..?
రోజూ అనేకమంది టీవీ9 రిపోర్టింగ్ తీరును ఈసడించుకుంటున్నా సరే… ఆ చానెల్ మారడం లేదు… కనీసం ఆ చానెల్ పెద్దల మనస్సులకైనా నచ్చుతోందా తమ రిపోర్టింగ్ స్టయిల్..? ఈ ఉదాహరణ చూడండి… ఓచోట రాజు అనే ఒకతను ఒక గుహలో చిక్కుకున్నాడు… రెండుమూడు రోజులు… భయం… ఎలాగోలా రెస్క్యూ చేశారు… శుభం… (అదుగో కాలు, ఇదుగో మేం ధైర్యం చెబుతున్నాం అంటూ బేకార్ రిపోర్టింగ్ చేస్తూనే ఉంది టీవీ9… పైగా మినిట్ టు మినిట్ రిపోర్టింగ్ అని జబ్బలు చరుచుకుంది కూడా… తను బయటపడ్డాక రిపోర్టింగ్ తీరే మరీ దారుణం…)
Ads
వైద్య పరీక్షలకు, అవసరమైన చికిత్సకు హాస్పిటల్‌కు తీసుకెళ్తుంటే టీవీ9 గొట్టం ఆ మనిషి మూతి మీద పెట్టి ప్రశ్నలు అడుగుతున్నాడు… మూతికి ఆక్సిజన్ గొట్టంకన్నా టీవీ9 గొట్టమే అత్యవసరం అన్నట్టుగా హడావుడి… హాస్పిటల్‌లో ఆక్సిజన్ మాస్క్ పెట్టకుండా ప్రశ్నలు వేస్తున్నాడు ఓ రిపోర్టర్… ఆ వ్యక్తి అసలే హైబత్‌లో ఉన్నాడు… ఈ ప్రశ్నలతో ఇంటరాగేషన్ దేనికి..? దీన్ని ఏ స్థాయి జర్నలిజం అనాలి..?
చావు బతుకుల్లో నుంచి బయటపడిన వాడి మూతి మీద గొట్టం పెట్టి, పిచ్చి ప్రశ్నలు వేయడాన్ని టీవీ9 పెద్దలు గర్విస్తున్నారా..? ఓహో, మా రిపోర్టింగ్ తీరుకు తిరుగులేదు అని కాలర్లు ఎగరేస్తున్నారా..? బయట జనం ఎలా తిట్టిపోస్తున్నారో గమనించాలనే సోయి కూడా లేదా..? మైహోం రామేశ్వరరావుకు జర్నలిజం తెలియకపోవచ్చు, కానీ టీవీ9 హెడ్డాఫీసును ఉద్దరిస్తున్న ఘన జర్నలిస్టులకు ఏమైంది..? మేమింతే అంటారా..?
అనండి… ఫాఫం, ఆయన మిమ్మల్ని నమ్ముకుని 550 కోట్లు పెట్టాడు… మీరు ఇలా ఉద్దరించండి… ఆల్‌రెడీ సెకండ్ ప్లేసుకు పడేశారు… మూడో ప్లేసు రారమ్మని పిలుస్తోందా..? కదలండి, కదలండి యుద్ధప్రాతిపదికన ఇలాగే దూసుకుపొండి… మిమ్మల్ని ఎవడు ఆపుతాడో చూద్దాం… అవునూ, ఇలాంటి పాతాళ స్థాయి రిపోర్టింగుతో రేటింగ్స్ వస్తాయని ఎవడు మీకు చెప్పింది..?!
టీవీ9 ఆనందించాల్సిన అసలు విషయం వేరే ఉంది… చావు బతుకుల నుంచి బయటపడి హాస్పిటల్ చేరిన ఆ వ్యక్తి బంధుగణంలో ఎవరూ ఆవేశపరులు సమయానికి అక్కడ లేనట్టుంది… లేకపోతే సదరు రిపోర్టర్‌కు ‘‘బాగానే పడేవి’’… పాపం శమించుగాక…!! (చివరగా :: చిల్లర పత్రికలు ఎన్నో ఉంటాయి, ఎన్నో దిక్కుమాలిన వార్తలు రాస్తుంటాయి, కానీ ఈనాడులో తప్పులు వస్తేనే ఆక్షేపిస్తాం… ఎందుకంటే, ఆ నంబర్ వన్ పత్రికలో తప్పులు మనం ఇష్టపడం… చిల్లర టీవీ చానెళ్లు ఎన్నో ఉంటాయి, ఏవేవో నెత్తిమాశిన కథనాలు వస్తుంటాయి, లైట్ తీసుకుంటాం, కానీ మొన్నటిదాకా నంబర్ వన్ ప్లేసులో ఉండి, ఒక దశలో టీవీ రిపోర్టింగుకు కొత్త దిశను చూపించిన టీవీ9 ఇలా భ్రష్టుపడితే చివుక్కుమంటుంది…)
Share this Article