హీరో నాని… పెద్దగా వివాదాల్లోకి వెళ్లడు… ఆచితూచి మాట్లాడతాడు… ఏదో అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి నుంచీ ఎదిగాడు కదా, ఏం మాట్లాడాలో తెలుసు, ఏం మాట్లాడకూడదో తెలుసు అనుకుంటారు కదా… కానీ తెలుగు ఇండియన్ ఐడల్ షోలో తను బాంచెత్ అనే పదం వాడిన తీరు నీచంగా అనిపించింది… ఇన్‌సెన్సిబుల్… (సరిపోదా శనివారం అని కొత్త సినిమా వస్తోంది కదా, దాని ప్రమోషన్ కోసం వచ్చాడు…)
తనకు ఆ పదానికి అర్థం తెలుసా..? తెలిసీ అన్నాడా..? నీయమ్మ, నీయక్క అనే బూతు పదాల్ని కొందరు ఊతపదాల్లాగా వాడుతూ ఉంటారు… అది బయట… కానీ లక్షల మంది చూసే ఓ షోలో… బాంచెత్ అనే పదం ఎలా వాడాడు..? దీని నేపథ్యం ఏమిటంటే..? ఓ కంటెస్టెంట్ తెలుగు ఇండియన్ ఐడల్ షోలో (సాయి వల్లభ..?) ఓ పాట పాడాడు… అది నాని నటించిన దసరా అనే సినిమాలోనిది… ధూంధాం దోస్తాన్ అనే పాట…
నిజానికి ఈ పాట రాసింది కాసర్ల శ్యాం… మంచి మంచి తెలంగాణ పదాలు పడ్డయ్ పాటలో… రాహుల్ సిప్లిగంజ్ పాడినట్టున్నాడు, బాగా వచ్చింది… కానీ బయట కొందరు జనం వాడే బాంచెత్ పదం ఈ పాటలో నాలుగైదుసార్లు వచ్చింది… కుర్చీ మడతబెట్టి వంటి వాక్యాల ప్రయోగంకన్నా ఇది టూ మచ్… నాకు తెలిసి శ్యాం తన పాటల్లో వెగటు పదాల్ని వాడడు, రాయడు… మరి ఈ పదం ఆ పాటలోకి ఎలా జొరబడిందో, ఏ మహానుభావుడు ఈ పుణ్యం మూట కట్టుకున్నాడో తెలియదు…
Ads
ఉంటే వైకుంఠం లేకుంటే ఊకుంటం, బద్దల్ బాషింగాలైతై, పవ్వగొట్టు పవ్వగొట్టు, బోటికూర దానంచుకు వెట్టు, ఓ అద్ధశేరు, కంట్రోల్ బియ్యం, నల్లీ బొక్కల్, గోశి గొంగడి… ఇలాంటి తెలంగాణ మాండలికంలో సాగే పదాలకు అర్థం ఎలాగూ కార్తీక్ అనే సింగర్‌కు తెలియదు, తనకు తెలుగే సరిగ్గా రాదు… థమన్, గీతామాధురి, శ్రీరామచంద్రలకూ తెలుసని అనుకోను… సరే, ఆ కంటెస్టెంట్ పాటలో ఉన్న పదాలే కాబట్టి పాడేశాడు… తరువాత ఆ కంటెస్టెంటుతో అదే పాటకు డాన్స్ చేయించి, అప్పుడన్నాడు నాని… ఇదీ బాంచెత్ అని… ఏం నానీ..? యూ టూ..!!
నిజానికి ఇలాంటి పాటల్ని అవాయిడ్ చేయడం బెటర్… కానీ కుర్చీలు మడతబెట్టే థమన్ నుంచి ఆ విజ్ఞతను ఆశించలేం… సరే, షో విషయానికొస్తే మనం ముందే చెప్పుకున్నట్టు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అభిజ్ఞను పంపించేశారు… జడ్జిల అహం చల్లారింది… తరువాత పైన దసరా పాట పాడిన సదరు కంటెస్టెంట్‌ను కూడా పంపించేశారు… ఆ ఇద్దరూ నాని పాటలే పాడారు… (ఎవరు షోకు అతిథిగా వస్తే వాళ్ల పాటల్ని రుద్ది, కంటెస్టెంట్లతో పాడిస్తుంటారు, అదో దిక్కుమాలిన ధోరణి)… చివరకు ఎవరైతే తన పాటకు డాన్స్ చేస్తే… బాంచెత్ అనే పదం వాడి మరీ నాని పొగిడాడో ఆ కంటెస్టెంట్ వెళ్లిపోయాడు… ఈ ఎపిసోడ్‌లో నజీరుద్దీన్, స్కంధ, కీర్తన ఎంచుకున్న పాటలు బాగున్నయ్..!!
Share this Article