కంపు కొట్టే చెత్తా రాజకీయ బురద వార్తలతో దినపత్రికలు ఎప్పుడో డస్ట్ బిన్లు, డంపింగ్ యార్డులు అయిపోయాయి… డప్పులు, రాళ్లు… చివరకు రాజకీయ నాయకులంతా ఒకటే… ఆ దరిద్రాల నడుమ అప్పుడప్పుడూ కాస్త సుపాత్రికేయాన్ని, సమాజహితాన్ని ప్రదర్శించే కొన్ని మెరుపులు ఈనాడులోనే కనిపిస్తాయి… నిజానికి ఇప్పుడు సొసైటీకి ఈ పాజిటివిటీయే అవసరం… కానీ దరిద్రపు మెయిన్ స్ట్రీమ్ మీడియా పట్టించుకుంటే కదా…
ఒక 88 ఏళ్ల వయస్సున్న యువ రైతు నెక్కంటి సుబ్బారావు గురించి ఈనాడు సండే మ్యాగజైన్ పబ్లిష్ చేసిన స్టోరీ పట్ల సదరు రిపోర్టర్‌కు అభినందనలు… అందులో ప్రధానంగా ఆకర్షించిన పాయింట్లు కొన్ని…
- శాస్త్రవేత్తలు కూడా చేతగాక వదిలేసిన వరి రకాన్ని ఇక్కడ పండించి చూపించాడు…
- ఎప్పుడూ ఏదో ప్రయోగం చేస్తూ, ఈ వయస్సులోనూ వ్యవసాయం చేస్తున్నాడు…
- అంతర్జాతీయ మీడియా కూడా తన కృషిని గుర్తించి ఎన్నో కథనాలు రాసింది…
- పంటల ఆరోగ్యమే కాదు, వ్యక్తిగా తన ఆరోగ్యాన్ని కూడా పదిలంగా కాపాడుకున్నాడు…
దేశం ఒక దశలో తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కున్నది… ఒకే పూట తినండి అని ప్రభుత్వమే ప్రజల్ని వేడుకోవాల్సిన దురవస్థ… ఆ స్థితిలో ఫిలిప్పీన్స్ నుంచి ఐఆర్-8 రకం వరి విత్తనాలు తెప్పించారు… కానీ ఇక్కడ పండించలేకపోయారు… కానీ సుబ్బారావు పండించి చూపించాడు… ప్రభుత్వం విసిరిన సవాల్‌ను స్వీకరించి మరీ గెలిచాడు… మొక్కజొన్న సాగులో కొన్ని చిట్కాలతో రెట్టింపు దిగుబడిని సాధించగలిగారు… రాజీవ్ గాంధీ ‘ధాన్ పండిత్’ అవార్డు ఇచ్చాడు… ఎన్టీరామారావు వ్యవసాయ వర్శిటీకి సలహాదారుడిని చేశాడు…
Ads
వ్యవసాయం ఈరోజు ప్రజెంట్ తరానికి ఓ దిక్కుమాలిన వృత్తిలా కనిపించవచ్చుగాక… నిజంగానే వ్యవసాయం నష్టదాయక వ్యవహారంగా మారిపోవచ్చుగాక… నమ్ముకున్న రైతుకు ఉరితాళ్లే మిగులుతూ ఉండవచ్చుగాక….. కానీ ఎవడూ పండించకపోతే తిండి ఎలా..? వ్యవసాయం ఈ సమాజపు సంస్కృతి… ఓ జీవనవిధానం… అందరూ వదిలేస్తే ఇక బతికేది ఎందుకు..?
వ్యవసాయం కనీసం గిట్టుబాటు కాకపోగా అప్పుల్లోకి నెడుతోంది… దీనికి కారణం మన తలకుమాసిన ప్రభుత్వాల విధానాలు… వందల రీసెర్చ్ స్టేషన్లు, భారీ సంఖ్యలో ఉద్యోగులున్న అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ విభాగాలు… ఒక్కడంటే ఒక్కడు ‘ఇదీ మా కంట్రిబ్యూషన్ ఈ దేశానికి’ అని చెప్పే కొత్త వంగడం ఏది… నిజానికి ప్రయోగాలు కాస్తో కూస్తో జరుగుతున్నవి ప్రైవేటు రంగంలో ప్లస్ రైతులు సొంతంగా చేసుకున్నవే… దేశంలో అత్యంత ఘోరంగా ఫెయిలైన వ్యవస్థ ఏదీ అంటే వ్యవసాయ యూనివర్శిటీలు, వ్యవసాయ శాఖలే, వ్యవసాయ విధానాలు…
అపరాలు, నూనెగింజలు నేటి అవసరం… వరి, పత్తి, చెరుకు కాదు… ఏదీ… అవసరమున్న పంటల్లో మంచి రీసెర్చ్ జాడలేవి..? ఓ చిన్న ఉదాహరణ చెప్పుకుందాం చివరగా… మన పొరుగునే ఉన్న నాందేడ్ జిల్లా, చాందిపూర్ తాలూకా, నాగబిడ్ ఊరు… దాదాజీ కోబ్రగడే అనే ఓ చిన్న రైతు… హెచ్ఎంటీ వంగడాన్ని సృష్టించాడు… ఈరోజు మార్కెట్‌లో బాస్మతి తరువాత ఈ బియ్యానికే అధిక ధర, అధిక డిమాండ్, అధిక మన్నిక, అధిక రుచి…
అందుకే చెప్పుకునేది ఈ దేశంలో రైతే నిరంతర ప్రయోగశీలి, నిఖార్సయిన శాస్త్రవేత్త… దురదృష్టం ఏమిటంటే ఆ హెచ్ఎంటీ మేమే కనిపెట్టామని సమీపంలోని ఓ రీసెర్చ్ స్టేషన్ విశ్వ, విఫల ప్రయత్నం చేసింది… ఇదీ మన దరిద్రం… ఈ కథ మళ్లీ ఎప్పుడైనా చెప్పుకుందాం… తరచి చూస్తే మన సమాజంలో, మన చుట్టూ ఇలాంటి సక్సెస్ స్టోరీలు ఎన్నో… సుబ్బారావును ఎన్నో రెట్లు మించిన వాళ్లు… అనేక వృత్తుల్లో… కానీ చూసి, రాసి, పదిమందికీ పంచే పాత్రికేయ నేత్రం ఏది..? నిస్పృహలో కూరుకుపోతున్న మన వెన్నెముకకు ఇలాంటి స్టోరీలు కదా కావల్సింది…!!
Share this Article